Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Imran Khan | ఇమ్రాన్‌ ఖాన్, ఆయన భార్య బుష్రాకు భారీ ఊరట.. ఫ్యామిలీని కలిసేందుకు, ఫోన్ కాల్స్ చేసేందుకు కోర్టు అనుమతి

Imran Khan | ఇమ్రాన్‌ ఖాన్, ఆయన భార్య బుష్రాకు భారీ ఊరట.. ఫ్యామిలీని కలిసేందుకు, ఫోన్ కాల్స్ చేసేందుకు కోర్టు అనుమతి

Imran Khan : జైలులో శిక్ష అనుభవిస్తున్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు, ఆయన భార్య బుష్రా బీబీకి భారీ ఊరట లభించింది. వారిద్దరినీ అందరికీ దూరంగా, ఒంటరిగా ఉంచకూడదని జైలు అధికారులను పాక్ హైకోర్టు ఆదేశించింది.

అంతేకాదు.. వారు జైలులో తమ బంధువులను కలిసేందుకు, తమ పిల్లలతో ఫోన్‌లో మాట్లాడేందుకు అనుమతివ్వాలని కూడా కోర్టు ఆదేశించింది. ఇమ్రాన్ ఖాన్, అతడి భార్య బుష్రా బీబీ ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

ఇమ్రాన్ 2023 నుంచి జైలులో ఉండగా, బుష్రా 2024, జనవరి నుంచి అదే జైలులో ఉంటున్నారు. అయితే, వారిని కలుసుకునేందుకు కుటుంబ సభ్యులకు ప్రభుత్వం, జైలు అధికారులు అనుమతించడం లేదు. దీంతో వారి తరఫున ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ విషయంలో గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను జైలు అధికారులు పాటించడం లేదంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారించిన ఇస్లామాబాద్ హై కోర్టు న్యాయమూర్తి ఖాదిం హుస్సేన్ సూమ్రో తాజాగా ఆదేశాలు జారీ చేశారు.

జైలు నిబంధనల ప్రకారం ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రాలు బంధువులను కలిసేందుకు అనుమతించాలని ఆదేశించారు. అలాగే, లండన్‌లో ఉంటున్న వారి కొడుకులతో ఫోన్‌లో మాట్లాడే ఏర్పాట్లు కూడా చేయాలని సూచించారు. అలాగే, వారిని ఇతరులకు దూరంగా ఒంటరిగా ఉంచకూడదని, జైలులో న్యూస్ పేపర్, బుక్స్ వంటివి అందించాలని ఆదేశించారు. వారికి అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించాలని కూడా ఆజ్ఞాపించారు. కోర్టు ఆదేశాలను అడియాలా జైలు సూపరింటెండెంట్ పాటించాలని, దీనిపై 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని జడ్జి ఆదేశాలు జారీ చేశారు.

ఇమ్రాన్ ఖాన్‌కు మెరుగైన వైద్య సహాయం అందించాలంటూ గత ఆగష్టులో కోర్టు ఆదేశించింది. దీని ప్రకారం ఇమ్రాన్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లి, వెంటనే తిరిగి జైలుకు తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వం కోర్టు ఆదేశాల్ని పాటించడం లేదని, ఈ ఆదేశాలు పాటించేలా చూడాలని కోరుతూ ఇమ్రాన్ సోదరి పాక్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, ఈ పిటిషన్‌ను అంత త్వరగా విచారించలేమని కోర్టు తెలిపింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana