Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
India | సీన్ రివర్స్.. రష్యాకు పెట్రోల్ ఎగుమతి చేస్తున్న భారత్‌..!

India | సీన్ రివర్స్.. రష్యాకు పెట్రోల్ ఎగుమతి చేస్తున్న భారత్‌..!

India : అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌ (Fuel Market) లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సీన్ రివర్స్ అయ్యింది. సాధారణంగా ముడి చమురు కోసం రష్యా (Russia) పై ఆధారపడే భారత్..

ఇప్పుడు అదే రష్యాకు పెట్రోల్ ఎగుమతి (Petrol Export) చేసే కీలక దేశంగా అవతరించింది. ఉక్రెయిన్ (Ukraine) డ్రోన్ దాడుల (Drone attacks) తో రష్యాలోని చమురుశుద్ధి కర్మాగారాలు తీవ్రంగా దెబ్బతినడమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పవచ్చు.

చమురుశుద్ధి కర్మాగారాలు దెబ్బతినడంతో ఏర్పడిన తీవ్ర ఇంధన కొరతను అధిగమించేందుకు భారత్ నుంచి రష్యా పెట్రోల్‌ను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఎనర్జీ అనలిటిక్స్ సంస్థ వోర్టెక్సా నివేదిక ప్రకారం.. గత రెండు నెలల్లో (జూలై-ఆగస్టు) రష్యా రిఫైనరీలపై సుమారు 32 సార్లు డ్రోన్ దాడులు జరిగాయి. దీనివల్ల దేశీయంగా పెట్రోల్ ఉత్పత్తి ఏకంగా 70 % పడిపోయింది. ఫలితంగా రష్యాలోని పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు రష్యా ప్రభుత్వం తన దేశం నుంచి పెట్రోల్, డీజిల్ ఎగుమతులను నిషేధించింది.

ఈ నేపథ్యంలో భారత్ గత రెండు నెలల్లో దాదాపు 10 లక్షల బ్యారెళ్ల పెట్రోల్‌ను రష్యాకు సరఫరా చేసింది. భారత్‌తోపాటు తుర్కియే, మొరాకో కూడా రష్యాకు ఇంధనాన్ని అందిస్తున్నాయి. గుజరాత్‌లోని వడినార్‌లో ఉన్న నయారా ఎనర్జీ రిఫైనరీ నుంచే ఈ ఎగుమతుల్లో ఎక్కువ భాగం జరిగినట్లు వాణిజ్య వర్గాలు తెలిపాయి. ఈ రిఫైనరీలో రష్యా ప్రభుత్వ రంగ సంస్థ రాస్‌నెఫ్ట్‌కు వాటా ఉండటం గమనార్హం. మరోవైపు ప్రపంచంలో మూడో అతిపెద్ద రిఫైనరీగా ఉన్న భారత్ తన సామర్థ్యాన్ని 272 ఎంఎంటీపీఏ నుంచి 300 ఎంఎంటీపీఏకు పెంచుకోవడం ద్వారా గ్లోబల్ రిఫైనింగ్ హబ్‌గా తన స్థానాన్ని పటిష్ఠం చేసుకుంటోందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి పేర్కొన్నారు.

అదే సమయంలో ఇరాన్ యుద్ధం, హర్మూజ్ జలసంధి మూసివేత వంటి పరిణామాల నేపథ్యంలో భారత్ తన ముడి చమురు దిగుమతులను కూడా విస్తృతం చేసుకుంది. ఒకప్పుడు 27 దేశాల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకున్న భారత్.. ఇప్పుడు 41 దేశాల నుంచి కొనుగోలు చేస్తోంది. హర్మూజ్ జలసంధి ద్వారా రవాణా నిలిచిపోవడంతో రష్యా నుంచి భారత్ ముడి చమురు దిగుమతులు రికార్డు స్థాయికి చేరాయి. అయితే కెప్లర్ డేటా ప్రకారం ఆగస్టులో దిగుమతులు కాస్త తగ్గి 2.1 మిలియన్ బ్యారెళ్లకు చేరాయి. అయినప్పటికీ దేశ మొత్తం దిగుమతుల్లో 40 % వాటాతో భారత్‌కు అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగా రష్యానే కొనసాగుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana