Tuesday, 22 Oct, 12.30 pm నమస్తే తెలంగాణ

బిజినెస్‌
ఇన్ఫీలో ముసలం

-సీఈవో, సీఎఫ్‌వోపై ఉద్యోగుల తీవ్ర ఆరోపణలు -సలీల్ పరేఖ్ అనైతిక చర్యలు -ఆదాయం, లాభాలు పెరిగేందుకు అడ్డదారులు -సంస్థ బోర్డుకు విజిల్‌బ్లోవర్ల లేఖ -చర్యలకు డిమాండ్ బెంగళూరు, అక్టోబర్ 21: దేశీయ ఐటీ రంగంలో రెండో అతిపెద్ద సంస్థగా వెలుగొందుతున్న ఇన్ఫోసిస్‌లో అనైతిక పద్ధతులు నడుస్తున్నాయా? సంస్థ ప్రయోజనాల కోసం తప్పుడు లెక్కలకు పాల్పడుతున్నారా? ఆదాయం, లాభాలు పెరిగేందుకు అడ్డదారులు తొక్కుతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. సంస్థ సీఈవో సలీల్ పరేఖ్, సీఎఫ్‌వో నిలంజన్ రాయ్‌లు అనైతిక విధానాలను అవలంభిస్తున్నారని ఉద్యోగులే చెబుతున్నారు. ఈ మేరకు కొందరు గుర్తుతెలియని సిబ్బంది ఇన్ఫీ బోర్డుకు లేఖ రాశారు. స్వల్పకాలిక ఆదాయం, లాభాల పెంపే ధ్యేయంగా పరేఖ్, రాయ్‌లు ఈ చర్యలకు పాల్పడుతున్నారని సదరు లేఖలో తమను తాము నీతి, నిజాయితీగల ఉద్యోగులుగా అభివర్ణించుకున్న కొందరు విజిల్‌బ్లోవర్లు తెలియజేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ లేఖను ఇన్ఫోసిస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు వారు గత నెల 20న పంపించారు. మిమ్మల్ని మేము చాలా గౌరవిస్తాం. గడిచిన కొన్ని త్రైమాసికాలుగా సీఈవో సలీల్ పరేఖ్ అనైతిక విధానాలకు పాల్పడుతున్నారు. స్వల్పకాలిక రెవిన్యూ, లాభాలను అధికంగా చూపిస్తున్నారు. ప్రస్తుత త్రైమాసికంలోనూ ఇదే జరిగింది అని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు ఇన్ఫీ ఉద్యోగులు ఆ లేఖలో స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో సీఎఫ్‌వో నిలంజన్ రాయ్ పాత్ర కూడా ఉందని ఆరోపించారు.

షేర్ల విలువ పెంచేందుకేనా?

సీఈవో పరేఖ్ అనైతిక పద్ధతులను అనుసరించడమేగాక, వాటిని సమర్థించుకున్నారని ఉద్యోగులు బో ర్డుకు వివరించారు. మనం చేసే పనుల గురించి బోర్డు లో ఎవరికీ అవగాహన ఉండదు. వారి కి మార్కెట్‌లో సంస్థ షేర్ విలువ పెరిగితే చాలు సంతోషంగా ఉంటారు అని తమతో అన్నట్లు ఉద్యోగులు తెలిపారు. దీంతో ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఒప్పందాల్లో నష్టాలే

భారీ ఒప్పందాల్లో నిబంధనల అతిక్రమణ జరిగిందని, సమీక్షలు, అనుమతులు, సూచనలు చేయకుండానే పెద్దపెద్ద డీల్స్‌కు పరేఖ్ పచ్చజెండా ఊపారని ఉద్యోగులు వెల్లడించారు. నిజానికి గడిచిన కొన్ని త్రైమాసికాల్లో కుదిరిన బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాల నుంచి సంస్థకు నయాపైసా లాభం లేదని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆడిటర్లు, బోర్డు నుంచి కీలక సమాచారాన్ని దాచిపెట్టారని, వెరిజోన్, ఇంటెల్ ఒప్పందాలతోపాటు జపాన్‌లో జాయింట్ వెంచర్లు, ఏబీఎన్ ఆమ్రో కొనుగోలు లావాదేవీలేవీ సక్రమంగా జరుగలేదని, అకౌంటింగ్ ప్రమాణాలను పాటించలేదని పేర్కొన్నారు.

నమ్మండి.. సాక్ష్యాలున్నాయ్

తాము చెప్పేదంతా నిజమని, దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా మా వద్ద ఉన్నాయని లేఖలో ఉద్యోగులు చెప్పారు. ఈ-మెయిల్స్, వాయిస్ రికార్డులున్నాయని వివరించారు. ఈ బాగోతంపై దర్యాప్తు జరిపితే విచారణ అధికారులకు ఆ సమాచారాన్ని అందజేస్తామని తెలిపారు. ఈ అక్రమాలను చూడలేక ఎందరో ఉద్యోగులు సంస్థను వీడిపోయారన్నారు. దీంతో ఇన్ఫోసిస్ డిప్యూటీ సీఎఫ్‌వో జయేశ్ సంఘ్‌రాజ్కా ఇటీవలి రాజీనామా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. మరోవైపు ఈ నెల 3న అమెరికాలోని విజిల్‌బ్లోవర్ ప్రొటెక్షన్ ప్రోగ్రాం కార్యాలయానికీ ఉద్యోగులు లేఖ రాశారు. గడిచిన రెండు త్రైమాసికాల్లో అకౌంటింగ్ అక్రమాలు, తప్పుడు ప్రకటనలున్నాయని ఆరోపించారు. వీలైనంత త్వరగా ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టి, దోషులను శిక్షిస్తారన్న విశ్వాసాన్ని ఈ సందర్భంగా ఉద్యోగులు కనబరిచారు.

విచారణ జరిపిస్తాం: ఇన్ఫీ

సంస్థలోని విజిల్‌బ్లోవర్లు రాసిన లేఖ అందిందని, దాన్ని ఆడిటింగ్ కమిటీ ముందు పెట్టామని ఇన్ఫోసిస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. కంపెనీ విజిల్‌బ్లోవర్ల విధానం ప్రకారం దీనిపై స్పందిస్తాం. సంస్థాగత నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం అని స్పష్టం చేసింది. 2017 ఆగస్టులో అప్పటి సీఈవో విశాల్ సిక్కా రాజీనామా అనంతరం పరిణామాల మధ్య పరేఖ్ ఇన్ఫీలోకి వచ్చిన విషయం తెలిసిందే. గతేడాది జనవరిలో సంస్థ సీఈవో బాధ్యతలు పరేఖ్ చేపట్టారు. ఇన్ఫీ వ్యవస్థాపకులకు సిక్కా, నాటి సంస్థ బోర్డుకు మధ్య పాలనాపరమైన లోపాలు, వేతనాల్లో వ్యత్యాసం వంటి అంశాలపై తీవ్ర బేధాభిప్రాయాలు ఏర్పడిన సంగతి విదితమే. ఈ క్రమంలోనే సిక్కా వైదొలుగగా, పరేఖ్ వచ్చారు. ఈ నేపథ్యంలో తాజా ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. కాగా, ఇజ్రాయెల్ టెక్నాలజీ సంస్థ పనయా కొనుగోలు వ్యవహారంలో కూడా అక్రమాలు జరిగాయని గతంలో ఇన్ఫోసిస్‌లో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దర్యాప్తులో ఇవి నిజం కాదని తేలడం గమనార్హం.
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana
Top