Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Influencer | సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ దారుణ హత్య.. రెండు నెలలు మృత్యువుతో పోరాడి కన్నుమూత

Influencer | సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ దారుణ హత్య.. రెండు నెలలు మృత్యువుతో పోరాడి కన్నుమూత

Influencer | సోషల్ మీడియాలో తన వీడియోలు, చిరునవ్వులతో ఎంతోమందిని ఆకట్టుకున్న 28 ఏళ్ల ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ మంజీత్ కౌర్‌కు అత్యంత విషాదకరమైన ముగింపు ఎదురైంది.

గత జులైలో జరిగిన దారుణ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె దాదాపు రెండు నెలల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చివరకు ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్‌కు చెందిన ఈ యువ ఇన్‌ఫ్లుయెన్సర్ మృతి స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. తీవ్ర కాలిన గాయాలతో చండీగఢ్‌లోని పీజీఐఎమ్‌ఈఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మంజీత్ కౌర్ ఆగస్టు 26న మృతి చెందినట్లు సమాచారం. ఘటన జరిగినప్పటి నుంచి ఆమె ప్రాణాల కోసం వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, గాయాల తీవ్రత కారణంగా ఆమె ఆరోగ్యం క్రమంగా విషమించినట్లు తెలుస్తోంది.

బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. జులై 3న చండీగఢ్‌లోని సెక్టార్ 34 ప్రాంతంలో ఉన్న ఓ మద్యం దుకాణం వద్దకు మంజీత్ కౌర్‌ను ఆమెకు పరిచయమున్న ఇద్దరు వ్యక్తులు పిలిచినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. అక్కడి నుంచి ఆమెను బలవంతంగా కారులో ఎక్కించి పంజాబ్‌లోని రూప్‌నగర్ జిల్లా మోరిండా ప్రాంతానికి తీసుకెళ్లినట్లు పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నారు.అక్కడ ఆమెపై తీవ్రంగా దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఆమెను ఓ చెట్టుకు కట్టేసి నిప్పంటించినట్లు విచారణలో వెల్లడైన వివరాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.మంటలు చెలరేగిన సమయంలో అక్కడికి చేరుకున్న ఓ స్నేహితుడు వెంటనే స్పందించి దుప్పటితో మంటలను ఆర్పినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన మంజీత్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

మొదట మోరిండాలో చికిత్స అందించిన వైద్యులు, గాయాల తీవ్రత కారణంగా ఆమెను మొహాలీకి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం జులై 9న చండీగఢ్‌లోని పీజీఐఎమ్‌ఈఆర్ ఆస్పత్రికి మార్చారు. మంజీత్ కౌర్ శరీరంపై 50 శాతానికి పైగా కాలిన గాయాలు కావడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. వారాల తరబడి ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆమెకు కొంతకాలం స్పృహ కూడా రాలేదని తెలుస్తోంది.జులై చివర్లో మంజీత్ కోలుకుంటోందని, త్వరలోనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా జరిగిన ఘటన గురించి మాట్లాడుతుందని ఆమెకు సన్నిహితుడైన మరో సోషల్ మీడియా వ్యక్తి తెలిపినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆమె అభిమానులు మంజీత్ త్వరగా కోలుకోవాలని ఆశించారు.

ఆగస్టు మొదటి వారంలో మంజీత్‌కు కొంత స్పృహ వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తనకు జరిగిన ఘటనకు సంబంధించి కొన్ని విషయాలను ఆమె కుటుంబ సభ్యులతో పంచుకున్నట్లు సమాచారం. అయితే అనంతరం ఆమె ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. వైద్యుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆగస్టు 26న ఆమె మృతి చెందారు. మంజీత్ కౌర్‌కు ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. తల్లి మరణంతో ఆ చిన్నారి జీవితంలో తీరని విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై చండీగఢ్ సెక్టార్ 34 పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. కిడ్నాప్, హత్యతో పాటు ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana