లండన్ : ఇంగ్లాండ్ వ్యాప్తంగా దుకాణ సముదాయాల్లో ఈ నెల 24 నుంచి ముఖం మాస్కులను తప్పనిసరి చేస్తూ ఆ దేశ ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది. జూన్ 15న ప్రజారవాణాలోనూ మాస్కులు తప్పనిసరి చేసింది. 'ముఖానికి మాస్కులు ధరించడం ద్వారా తమతోపాటు చుట్టూ ఉన్న వ్యక్తులు కరోనా బారి నుంచి రక్షించబడతారు. ప్రధాని సైతం ఈ విషయంలో ఇప్పటికే స్పష్టతనివ్వడంతో ఈ నెల 24 నుంచి దుకాణాల్లో మాస్కులను తప్పని సరి చేశాం' అని డౌనింగ్ స్ట్రీట్ అధికార ప్రతినిధి తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ నిబంధనను పోలీసులు కఠినంగా అమలు చేస్తారని, ఉల్లంఘించిన వారికి 100 పౌండ్ల జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా యూకే వ్యాప్తంగా ఇప్పటివరకు 2 లక్షల 90 వేల కరోనా కేసులు నమోదయ్యాయని, 45 వేల మంది మృతి చెందారని ఆ దేశ ఆరోగ్య సంస్థ తెలిపింది.

