Dailyhunt
Instagram Plus | త్వరలో ఇన్‌స్టాగ్రామ్ ప్లస్.. పెయిడ్ సర్వీస్ తేనున్న మెటా.. అదిరిపోయే ఫీచర్లు

Instagram Plus | త్వరలో ఇన్‌స్టాగ్రామ్ ప్లస్.. పెయిడ్ సర్వీస్ తేనున్న మెటా.. అదిరిపోయే ఫీచర్లు

Instagram Plus : సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ఒకటైన ఇన్‌స్టాగ్రామ్‌లో త్వరలో కీలక మార్పులు జరగనున్నాయి. యూజర్ల కోసం ఇన్‌స్టాగ్రామ్‌ మాతృ సంస్థ అయిన మెటా..

పెయిడ్ సర్వీస్ ప్రారంభించబోతుంది. 'ఇన్‌స్టాగ్రామ్‌ ప్లస్' పేరుతో కొత్త పెయిడ్, సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకురానున్నట్లు సమాచారం. ఇది ప్రీమియమ్ సర్వీస్ కాబట్టి, కొన్ని కొత్త ఫీచర్లు వీరికి మాత్రమే అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం ఈ ఫీచర్‌పై అధికారిక ప్రకటన రాలేదు.

కానీ, కొన్ని టెక్ మీడియా సంస్థల సమాచారం ప్రకారం.. ఈ సర్వీస్‌ను ఇప్పటికే బీటా వెర్షన్‌లో కొన్ని దేశాల్లో పరీక్షిస్తున్నారు. మెక్సికో, జపాన్, ఫిలిప్పైన్స్‌లో ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ ప్లస్ నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నవారికోసమే కొన్ని ప్రత్యేక ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. వాటిలో ముఖ్యమైంది అనానిమస్ స్టోరీ వ్యూ. అంటే ఇతర యూజర్లకు తెలియకుండానే వారి స్టోరీలను చూడవచ్చు. ఒకవేళ మీరు ఈ ప్లాన్ తీసుకుంటే ఇతర యూజర్లకు తెలియకుండా ఇన్‌స్టాలో వారి స్టోరీ చూడవచ్చు. అలా ఎంతమంది స్టోరీ అయినా రహస్యంగా చూడొచ్చు. ఆ విషయం వారికి తెలియదు. అలాగే మీ స్టోరీని, ఎవరు ఎన్నిసార్లు చూశారో కూడా తెలుసుకోవచ్చు. అలాగే, స్టోరీ చూసేందుకు అపరిమితమైన ఆడియెన్స్ లిస్ట్ తయారు చేయొచ్చు. ప్రస్తుతం స్పెషల్ స్టోరీలకు సంబంధించి ఏదైనా ఒక ఫ్రెండ్స్ లిస్ట్ మాత్రమే తయారు చేయవచ్చు. అలాగే, స్టోరీలను మరో 24 గంటలపాటు అదనంగా ఉంచుకోవచ్చు.

వారానికో స్టోరీని స్పాట్‌లైట్‌లో ఉంచవచ్చు. అలాగే, స్టోరీలకు యానిమేటెడ్ సూపర్ లైక్స్ సెండ్ చేయొచ్చు. ఇక, ఈ ఫీచర్ ఇప్పటివరకు క్రియేటర్లకు, బిజినెస్ అకౌంట్లకు ఉన్న వెరిఫైడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌కు భిన్నమైంది. ఇది సెపరేట్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్. దీని ధరలకు సంబంధించి స్పష్టమైన సమాచారం లేనప్పటికీ, ఇతర దేశాల్లో సగటున రూ.200 వరకు నెలవారీ ఛార్జ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి వస్తుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana