Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Iran Missile Strike | కువైట్‌ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్‌ దాడి.. అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్‌

Iran Missile Strike | కువైట్‌ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్‌ దాడి.. అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్‌

  • ఒక భారతీయుడి మృతి..
  • కువైట్‌, బహ్రెయిన్‌పై ఇరాన్‌ క్షిపణి, డ్రోన్‌ దాడులు

న్యూఢిల్లీ, జూన్‌ 3 : కువైట్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్‌ బుధవారం జరిపిన క్షిపణి దాడిలో ఒక భారతీయుడు మరణించగా మరో 63 మంది గాయపడినట్లు కువైట్‌ అధికారులు ప్రకటించారు.

కువైట్‌, బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి, డ్రోన్‌ దాడులు ప్రారంభించినట్లు ఇరాన్‌ బుధవారం తెలిపింది. ఇరాన్‌ టెలికమ్యూనికేషన్‌ ఆంటెనాను, చమురు ట్యాంకర్‌ను లక్ష్యంగా చేసుకుని ఖేష్మ్‌ ద్వీపం, హొర్ముజ్‌ జలసంధి సమీపాన అమెరికా ఇదివరకు జరిపిన దాడులకు ప్రతీకారంగా ఈ దాడులు చేపట్టినట్లు ఇరాన్‌ సాయుధ దళాలు ప్రకటించాయి. భిన్నమైన, మరింత తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుందని తాము చేసిన గతంలో చేసిన హెచ్చరిక ఈ ఆపరేషన్‌తో పూర్తయినట్లు ఇరాన్‌ తెలిపింది. పర్షియన్‌ గల్ఫ్‌, హొర్ముజ్‌ జలసంధి, ఖేష్మ్‌ ద్వీపంలో అమెరికా చేపట్టిన శత్రు చర్యల కారణంగానే కువైట్‌లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్‌ ప్రభుత్వ ప్రసార సంస్థ ఐఆర్‌ఐబీ పేర్కొన్నది. తమ టెలికమ్యూనికేషన్‌ ఆంటెనా, చమురు ట్యాంకర్‌పై అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగా తాము అమెరికా నౌకాదళాన్ని, అమెరికా వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నామని ఇరాన్‌ సాయుధ దళాలు తెలిపాయి.

ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌ ధ్వంసం

అంతర్జాతీయ విమానాశ్రయం, దౌత్య మిషన్లుసహా కువైట్‌లోని పౌర సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్‌ జరిపిన దాడుల్లో ఒక భారతీయుడు మరణించినట్లు అంతర్గత రక్షణ మంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. అయితే ఏ దౌత్య మిషన్లకు నష్టం వాటిల్లిందన్న వివరాలను వెల్లడించలేదు. ఏప్రిల్‌ 8న ఇరాన్‌ యుద్ధంలో కాల్పుల విమరణ ప్రకటించినప్పటి నుంచి ప్రశాంతంగా ఉన్న గల్ఫ్‌ దేశానికి ఈ దాడి ఉద్రిక్తతను మరింత పెంచింది. అమెరికాకు సన్నిహిత మిత్రదేశమైన కువైట్‌పై, అలాగే ఇతర గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించింది. కువైట్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై తెల్లవారుజామున జరిగిన దాడిలో పలువురు గాయపడ్డారని, దీంతో విమానాలను దారి మళ్లించాల్సి వచ్చిందని ప్రభుత్వ వార్తా సంస్థ తెలిపింది. ఈ దాడి వల్ల విమానాశ్రయం టెర్మినల్‌ 1 భవనానికి తీవ్ర నష్టం వాటిల్లిందని జనరల్‌ సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీని ఉటంకిస్తూ వార్తాసంస్థ పేర్కొన్నది. కొద్దిసేపటికే నష్టాన్ని అంచనా వేసి భద్రతా చర్యలు తీసుకున్న అనంతరం దేశపు ప్రధాన విమానయాన సంస్థ టెర్మినల్‌-4 నుంచి విమాన సర్వీసులను పునఃప్రారంభించిందని సంస్థ పేర్కొన్నది.

క్షిపణులను అడ్డుకుంటున్నాం

తమ దేశంపై దూసుకువస్తున్న క్షిపణులు, డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకుంటున్నాయని కువైట్‌ సైన్యం ధృవీకరించింది. ఈ అడ్డుకునే క్రమంలో వెలువడుతున్న భారీ పేలుళ్ల శబ్దాలను స్థానికులు విన్నారని కువైటీ ఆర్మీ జనరల్‌ స్టాఫ్‌ తెలిపింది. శత్రు లక్ష్యాలను అడ్డుకున్న ఫలితంగా కింద పడిన క్షిపణి శకలాలను, మరే ఇతర గుర్తించలేని వస్తువులను తాకడం, లేదా సమీపానికి వెళ్లడం చేయవద్దని తన పౌరులను కువైట్‌ సైన్యం హెచ్చరించింది. బహ్రెయిన్‌ అంతర్గత రక్షణ మంత్రిత్వశాఖ ప్రజలను అప్రమత్తం చేస్తూ సైరన్లు
మోగించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana