Friday, 23 Apr, 1.40 am నమస్తే తెలంగాణ

తాజావార్తలు
జాగ్రత్తే రక్ష!

వేగంగా కరోనా వ్యాప్తి
ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న కేసులు
పట్టణాల్లో తీవ్రత ఎక్కువ
స్వీయ నియంత్రణతోనే కట్టడి
111 కేంద్రాల ద్వారా ముమ్మరంగా వ్యాక్సినేషన్‌
కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో అందుబాటులో 250 బెడ్స్‌

సంగారెడ్డి, ఏప్రిల్‌ 21 (నమస్తే తెలంగాణ)/ సిద్దిపేట జోన్‌: కొరోనా రెండో దశ హడలెత్తిస్తున్నది. వేగంగా వైరస్‌ వ్యాప్తి చెందుతున్నది. ఫలితంగా సంగారెడ్డితో పాటు సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో కేసులు బాగా పెరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో వారం రోజుల్లో 3,037 పైచిలుకు కేసులు నమోదు కావడం కరోనా తీవ్రతను తెలియజేస్తున్నది. భౌతిక దూరం పాటించక పోవడం, గుంపులుగా సంచరించడం, నిర్లక్ష్యం వహించడం తదితర కారణాలతో పట్టణాల్లో తీవ్రత ఎక్కువగా ఉంటున్నది. కాగా, పలు గ్రామాలు, పట్టణాల్లో స్వచ్ఛందంగా పాక్షిక లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలు మధ్యాహ్నం వరకే కొనసాగిస్తున్నారు. దీంతో పాటు రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తుండడం కరోనా కట్టడికి కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. జీపీలు, బల్దియాల ఆధ్వర్యంలో వీధులు, కాలనీల్లో హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 38, మెదక్‌లో 24, సిద్దిపేటలో 39 సెంట్లర ద్వారా వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా చేపడుతున్నారు. టీకాకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. గురువారం మెదక్‌ కలెక్టరేట్‌లో కరోనా హెల్ప్‌లైన్‌ సెంటర్‌ను కలెక్టర్‌ ప్రారంభించారు. ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చూడడంతో పాటు మహమ్మారి నియంత్రణకు అధికార యంత్రాంగం అన్నిరకాలుగా చర్యలు చేపడుతున్నది.

కరోనా రెండో దశ ప్రజలను హడలెత్తిస్తున్నది. కరోనా మొదటి దశలో కేసులు వేగంగా వ్యాప్తి చెందలేదు. ప్రస్తుతం రెండో దశలో కరోనా విజృంభిస్తున్నది. ఫలితంగా సంగారెడ్డితో పాటు సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. కరోనా వైరస్‌ మ్యుటేషన్‌ మార్పుతోనే రెండో దశలో వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. మొదటి దశ సింగిల్‌ మ్యూటెంట్‌ వైరస్‌ ఉండటంతో కరోనా వ్యాప్తి ఎక్కువగా జరగలేదు. సెకండ్‌ వేవ్‌ డబుల్‌ మ్యూటెంట్‌ వైరస్‌ కారణంగా వేగంగా వ్యాపిస్తోంది. సెకండ్‌ వేవ్‌లో బీ.1.617 డబుల్‌ మ్యూటెంట్లు కనిపిస్తున్నట్లు ఐసీఎంఆర్‌ వెల్లడించిందని, డబుల్‌ మ్యూటెంట్‌లోని ఈ484క్యూ, ఎల్‌452ఆర్‌ వేరియంట్లతో కరోనా వేగంగా వ్యాప్తి చెందడంతో పాటు ప్రాణాంతకంగా మారుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. డబుల్‌ మ్యూటెంట్‌ కారణంగా జిల్లాలోనూ కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. వారం రోజులుగా సంగారెడ్డి జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు బాగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలతో పాటు ప్రభుత్వ యంత్రాంగంలోనూ ఆందోళన నెలకొంది. వైద్య ఆరోగ్యశాఖ ఓవైపు కరోనాకు కళ్లెం వేసే ప్రయత్నం చేస్తూనే, మరోవైపు కరోనాపై ప్రజలను అప్రమత్తం చేస్తూ అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నది. కరోనాకు చెక్‌పెట్టేందుకు వ్యాక్సినేషన్‌ చురుగ్గా చేపడుతున్నది. సంగారెడ్డి జిల్లాలో 38 కేంద్రాల ద్వారా వైద్య ఆరోగ్యశాఖ టీకాలు వేస్తున్నది. మెదక్‌లో 24, సిద్దిపేటలో 39 సెంట్లర ద్వారా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. టీకాకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది.

వేగంగా పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు
సంగారెడ్డితో పాటు మెదక్‌ ,సిద్దిపేట జిల్లాల్లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నది. పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు కరోనా నిబంధనలను పాటించకపోవడం, గుంపులుగా సంచరించడం, భౌతిక దూరం పాటించక పోవడం తదితర కారణాలతో కేసులు ఎక్కువగా పెరుగున్నాయి. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్‌, పటాన్‌చెరు, జోగిపేట, నారాయణఖేడ్‌, రామచంద్రాపురం, మెదక్‌, రామాయంపేట, తూప్రాన్‌, సిద్దిపేట వంటి ప్రాంతాల్లో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. కరోనా మొదటి దశలో కుటుంబంలో ఒక్కరికి పాజిటివ్‌ వచ్చిన పక్షంలో అతను ఐసొలేషన్‌లో ఉండి చికిత్స పొందితే సంపూర్ణంగా కోలుకునే వాడు. తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో కుటుంబ సభ్యులకు కరోనా సోకలేదు. కానీ, ప్రస్తుతం రెండో దశలో కుటుంబంలో ఒక్కరికి కరోనా పాజిటివ్‌ వస్తే, అతని ద్వారా మిగతా కుటుంబ సభ్యులకు వేగంగా సోకుతున్నది. దీంతో కేసులు పెరుగున్నాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో వారం రోజుల్లో 3,037 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో 1,563 కేసులు నమోదు కాగా, సిద్దిపేట జిల్లాలో 840, మెదక్‌ జిల్లాలో 634 కేసులు నమోదు కావడం తీవ్రతను తెలియజేస్తున్నది.

అప్రమత్తంగా ఉండాలి..
కరోనా మొదటి దశలో కంటే వేగంగా సెకండ్‌వేవ్‌లో ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతున్నది. ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. మాస్కు ధరించడంతో పాటు భౌతిదూరం పాటించాలి. శానిటైజేషన్‌ తప్పనిసరి. స్వీయ నియంత్రణ పాటించడం ద్వారా కరోనా నుంచి దూరంగా ఉండవచ్చు. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్ష చేయించుకోవాలి. అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి.

  • గాయత్రీదేవి, ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో సంగారెడ్డి మెదక్‌ కలెక్టరేట్‌లో కరోనా హెల్ప్‌లైన్‌ సెంటర్‌
    మెదక్‌, ఏప్రిల్‌ 22 : కరోనా తీవ్రరూపం దాల్చడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు మెదక్‌ కలెక్టరేట్‌లో కరోనా హెల్ప్‌లైన్‌ సెంటర్‌ను గురువారం కలెక్టర్‌ హరీశ్‌ ప్రారంభించారు. కరోనా వైరస్‌ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాక్సినేషన్‌, తదితర అన్ని వివరాలు, సలహాలు, సూచనలు పొందవచ్చని కలెక్టర్‌ తెలిపారు. కరోనా వచ్చిన వారితో పాటు హోం ఐసొలేషన్‌లో ఉన్న వారు, ప్రజలు ఫోన్‌ నంబర్‌ 08452-223360కు ఫోన్‌ చేసి తమ సందేహాలను, అవసరమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చని కలెక్టర్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఒక్కరోజులో దేశంలో వెలుగుచూసిన కరోనా కేసులు 3,14,835

ఇండియాకు సాయం చేయడానికి సిద్ధం: చైనా

మహేశ్ బాబు ముఖ్యమైన సందేశం

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana
Top