Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జల దోపిడీ!

జల దోపిడీ!

  • లక్షలు దండుకుంటున్న జలమండలి ఉద్యోగులు
  • ధనవంతుల ఇండ్లకు నిరంతర సరఫరాతో కాసుల పంట
  • అపార్ట్‌మెంట్ల నుంచి వసూళ్లకు క్షేత్రస్థాయి సిబ్బంది

సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ): నగరానికి తాగునీరందించే జలమండలిలో క్షేత్రస్థాయి అధికారుల నుంచి ఉన్నతాధికారుల దాకా అందినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఎవరి స్థాయికి వారు దొరికినంతా దండుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తతున్నాయి. ముఖ్యంగా ఎండాకాలమైన మార్చి, ఏప్రిల్‌,

మే నెలల్లోనే ఈ దందా ఎక్కువగా జరుగుతున్నట్లు సమాచారం. ట్యాంకర్లు, నీటి సరఫరాలో అవకతవకలు సృష్టిస్తూ నీటి జలగల్లా పట్టి పీడిస్తున్నారు. కమర్షియల్‌ కాంప్లెక్సులు, అపార్ట్‌మెంట్లు, ప్రైవేట్‌ హాస్టళ్లు, హైరైజ్‌ భవనాలున్న ప్రాంతాల్లో అధికారులు ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా ఉన్నట్లు తెలుస్తున్నది.

లైన్‌మెన్‌ స్థాయి నుంచి డైరెక్టర్‌ దాకా స్థాయిని బట్టి మెక్కుతున్నట్లు బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. జలమండలి నీటి దందాతో ఇష్టానుసారంగా దోపడీకి పాల్పడుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. నగర శివారులోని డివిజన్లు, కమర్షియల్‌ కనెక్షన్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ దందా మూడు పూవులు, ఆరు కాయల్లాగా సాగుతున్నది. క్షేత్రస్థాయి సిబ్బంది అయిన లైన్‌మెన్లు, సూపర్‌వైజర్లు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లను బినామీలుగా చేసుకుని అధికారులు ఈ దందా సాగిస్తున్నట్లు తెలుస్తున్నది. కింది స్థాయి సిబ్బందిని ఏండ్ల తరబడిగా ఒకేస్థానం నుంచి కదలనీయకుండా వసూళ్లకు వాడుకుంటున్నట్లు జలమండలి వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ స్థానచలనం జరిగినా గతంలో పనిచేసిన ప్రాంతంలోనే విధులు నిర్వర్తించేలా వెసులుబాటు కల్పిస్తున్నట్లు చెప్తున్నారు.

ఖరీదైన ప్రాంతాల్లోనే దందా..

నగరంలోని కమర్షియల్‌, ప్రైమ్‌ ఏరియాలకు తాగునీటి సరఫరా చేస్తూ లక్షలాది రూపాయలు దండుకుంటున్నారు. ముఖ్యంగా మాదాపూర్‌, కొండాపూర్‌, కొత్తగూడ, హైటెక్‌ సిటీ, కూకట్‌పల్లి, గచ్చిబౌలి ప్రాంతాల్లో పనిచేసే కిందిస్థాయి సిబ్బందిని వసూళ్లకు వినియోగిస్తున్నట్లు తెలుస్తున్నది. అదేవిధంగా ఒక్కో ఉద్యోగికి ఒక ప్రాంతంలోని కమర్షియల్‌ భవనాలు, హాస్టళ్లను అప్పగించి వసూళ్ల దందా సాగిస్తూ జేబులు నింపుకొంటున్నారని సమాచారం. అదేవిధంగా ట్యాంకర్లను తమకు అనుకూలమైన వ్యక్తులకు సకాలంలో పంపించేందుకు కొద్ది మంది ట్యాంకర్‌ యజమానులను తమ ఆధీనంలో ఉంచుకుని సరఫరా చేస్తున్నారని తెలుస్తున్నది.

సూపర్‌వైజర్లు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లను ఏండ్ల తరబడిగా ఒకే స్థానంలో కొనసాగిస్తూ దందా కొనసాగిస్తున్నట్లు సమాచారం. మరికొన్ని ప్రాంతాల్లో కృత్రిమ డిమాండ్‌ సృష్టించి ధనవంతుల దగ్గర లక్షలాది రూపాయలు దండుకుంటున్నారు. అధికారుల ధన దాహానికి కమర్షియల్‌ ప్రాంతాలను ఆనుకుని ఉన్న బస్తీలు, కాలనీల ప్రజలకు తాగునీరందక ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ దందాను గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. నగరానికి తాగునీరందించే జలమండలిపై అవినీతి ఆరోపణలు రాకుండా కట్టడి చేయాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana