Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జస్టిస్‌ ఎమ్మార్వో!

జస్టిస్‌ ఎమ్మార్వో!

  • రావల్‌కోల్‌.. గోల్‌మాల్‌
  • సివిల్‌ కోర్టు తీర్పును తనకు తానే ఇచ్చేసుకున్న తహసీల్దార్‌
  • హైకోర్టులో స్టే ఉండగానే ఆర్డీవో ఓఆర్‌సీ ప్రొసీడింగ్స్‌ జారీ
  • ఇది కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందంటున్న న్యాయ నిపుణులు
  • వినతులేవీ లేకుండానే 275 ఎకరాల వ్యవహారంలోకి సీసీఎల్‌ఏ
  • 1993 నాటి ఫైల్‌ను వెంటనే డిస్పోజ్‌ చేయాలని ఆర్డీవోకు ఆదేశం
  • పెద్దల కోసం రంగంలోకి దిగిన 'భూ'వ్యవహారాల ఉన్నతాధికారి
  • ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న సీఎంవో ఉన్నతాధికారులు
  • తుది అంకాన్ని వెంటనే ముగించాలంటూ పెద్దల 'సింహ'గర్జన
  • ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన సివిల్‌ సర్వెంట్స్‌ 'రాజీ'కీయం
  • రావల్‌కోల్‌ 275.12 ఎకరాల భూదందాలో అన్నీ ఉల్లంఘనలే

అధికారిక వ్యవహారాల్లో ఎవరు ఏ పని చేయాలనే దానిపై చట్టాలున్నాయి. అమలుకు నిబంధనలూ ఉన్నాయి. బ్యూరోక్రాట్లు ఏం చేయాలి? జ్యుడీషియరీ ఏం చేయాలి? అనే దానిపైనా రాజ్యాంగంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. కానీ, సర్కార్‌ పెద్దల్ని సంతృప్తి పరిచేందుకు ఎవరేం చేసినా నడుస్తుందా? ఇది ముమ్మాటికీ న్యాయపరంగా ఉల్లంఘన కిందికే వస్తుందని న్యాయ నిపుణులు తేల్చి చెప్తున్నారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మేడ్చల్‌ మండలం రావల్‌కోల్‌ గ్రామంలోని 275.12 ఎకరాల 'భూ'మంత్రుల్‌ వ్యవహారంలో ఇలాంటి ఉల్లంఘనలకు కొదువ లేదు.

హైదరాబాద్‌ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్‌ 17 (నమస్తే తెలంగాణ): రావల్‌కోల్‌ భూదందాను 'నమస్తే తెలంగాణ' వెలుగులోకి తెచ్చినప్పటి నుంచి రోజుకో కొత్త ఉల్లంఘనలు తెరపైకి రావడమే కాకుండా తెరవెనుక సర్కార్‌ పెద్దలు ప్రభుత్వ భూమిని తాము అనుకున్న ప్రైవేట్‌ వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు ఏస్థాయిలో రెవెన్యూశాఖ అధికారులను ప్రభావితం చేశారనే అంశాలు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఇనాందారు వారసులంటూ 275.12 ఎకరాలను ఫలహారంలా ఐదుగురి పేరిట పంచుతూ కీసర ఆర్డీవో జారీ చేసిన ఓఆర్‌సీ ప్రొసీడింగ్స్‌లో 'వారసులను తేల్చిన తీరు'పై న్యాయ నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సివిల్‌ కోర్టు తేల్చాల్సిన అంశాన్ని ఏకంగా ఒక తహసీల్దార్‌తో నిర్ధారించి… దాని ఆధారంగా రూ.5 వేల కోట్ల భూమిని ప్రైవేట్‌ వ్యక్తులపరం చేయడంపై న్యాయవర్గాల్లో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నది. ఇదే కాదు… సర్కార్‌ పెద్దలు ఈ భూ దందాను ముగించేందుకు ఇష్టానుసారంగా అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వడంతో పాటు వాళ్లపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తూ అడుగడుగునా ఉల్లంఘనలకు పాల్పడినట్లు అనేక ఆధారాలు కనిపిస్తున్నాయి.

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మేడ్చల్‌ మండలం రావల్‌కోల్‌ గ్రామ పరిధిలోని సర్వేనెంబరు 4-18, 20, 22, 25ల్లోని 275.12 ఎకరాల భూమిని ఐదుగురి పేరిట గత నెల 27వ తేదీన కీసర ఆర్డీవో రాజేశ్‌కుమార్‌ ఓఆర్‌సీ ప్రొసీడింగ్స్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. గతంలోని జాయింట్‌ కలెక్టర్‌ ఇచ్చిన ఉత్తర్వుల్ని విస్మరించడంతో పాటు సర్కార్‌ పెద్దలు సూచించిన వ్యక్తులకు ఓఆర్‌సీలు ఇచ్చేందుకు ఆగమేఘాలపై ప్రక్రియ ముగించాలనే ఉద్దేశంతో ఆయన అనేక ఉల్లంఘనలకు పాల్పడినట్టు స్పష్టమవుతుంది. ఇదే భూ వ్యవహారంపై రాజేశ్‌కుమార్‌ కంటే ముందు పని చేసిన అధికారి అసలు ఇనామ్‌దారు వారసులపై కీలకమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.

ఈ మేరకు ఎవరైతే తాము వారసులం అని, 275.12 ఎకరాలకు ఓఆర్‌సీలు ఇవ్వాలని దరఖాస్తుదారులు అడిగారో.. దానికి 2025, మే 9న ఓ మెమో జారీ చేశారు. అందులో స్పష్టంగా 1993 నుంచి పెండింగులో ఉన్న ఓఆర్‌సీ ఫైల్‌ ముందుకు కదలాలంటే సంబంధిత కోర్టు నుంచి వారసులంటూ ధృవీకరణ పత్రాలను సమర్పించాలని అందులో సూచించారు. ముఖ్యంగా వారసుల పేర్లు, అసలు ఇనామ్‌దారులకు ఉన్న బంధు త్వం, సంబంధిత కోర్టు సీల్‌ సహా సర్టిఫికెట్లను సమర్పిస్తేగానీ ఫైల్‌ ముందుకుపోదని అందు లో స్పష్టం చేశారు. కానీ ఇప్పటివరకు కూడా సదరు వారసులం అంటున్న వాళ్లు కోర్టు నుం చి సర్టిఫికెట్లు పొందకపోవడం గమనార్హం.

అప్పటి ఆర్డీవో బదిలీ అందుకే..
ఈ భూదందాపై మరింత లోతుగా విచారిస్తే… 2026, జనవరి 7వ తేదీ వరకు ఉన్న సదరు ఆర్డీవో ఇలాంటి కీలక అంశం తేలే వరకు తాను ఫైల్‌ను ముందుకు తీసుకుపోనని భీష్మించుకు కూర్చున్నట్టు తెలిసింది. సర్కార్‌ పెద్దలు రంగంలోకి దిగి బదిలీ చేస్తామని హెచ్చరించినా వినకపోవడంతో ఆయన్ని బదిలీ చేసి గత నెల 30వ తేదీన ఉద్యోగ విరమణ చేసిన రాజేశ్‌కుమార్‌కు జనవరి 8న అక్కడ పోస్టింగ్‌ ఇచ్చినట్లు తెలిసింది. అనంతరం ఆర్డీవో రాజేశ్‌కుమార్‌ ఉద్యోగవిరమణ చేసేలోపు ఓఆర్‌సీ ప్రొసీడింగ్స్‌ ఇచ్చేలా తీవ్రస్థాయిలో సర్కార్‌ పెద్దలు ఒత్తిడి తెచ్చారు.

ఈ క్రమంలో గత ఆర్డీవో లేవనెత్తిన కీలక అభ్యంతరాన్ని సైతం రాజేశ్‌కుమార్‌ విస్మరించడం ఒకవంతైతే… ఆ ప్రక్రియను మేడ్చల్‌ తహసీల్దార్‌ భుజాన వేయడం గమనార్హం. తహసీల్దార్‌ నివేదిక ఇచ్చేందుకూ చాలాకాలం మొండికేసినట్టు తెలిసింది. చివరకు అతను సెలవులో వెళ్లినా ఒత్తిడి తెచ్చి, కేవలం ఈ నివేదిక ఇచ్చేందుకు పిలిపించినట్టు సమాచారం. ఈ క్రమంలో ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో తహసీల్దార్‌ తాను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి 275.12 ఎకరాల్లో అసలైన ఇనామ్‌దారుల వారసులు ఐదుగురు అంటూ తేల్చడంతో పాటు వాళ్లే 1.11.1973 నుంచి ఇప్పటివరకు కబ్జాలో ఉన్నారంటూ నివేదిక ఇచ్చారు. దీని ఆధారంగా ఆర్డీవో ప్రొసీడింగ్స్‌ జారీ చేశారు.

హైకోర్టు స్టే ఉన్నప్పటికీ ప్రొసీడింగ్స్‌ జారీ
రావల్‌కోల్‌లోని 275.12 ఎకరాల వ్యవహారం సుదీర్ఘ కాలం పెండింగులో ఉన్న తర్వాత 2023లో తిరిగి ఆర్డీవో విచారణలు మొదలుపెట్టారు. అయితే ఇందులో కక్షిదారులు విచారణకు హాజరైన సందర్భంలో ఒక కక్షిదారు ఆర్డీవో విచారణపై హైకోర్టును ఆశ్రయించారు. వాస్తవానికి 2011లో అప్పటి జాయింట్‌ కలెక్టర్‌ ఈ ఫైల్‌ను పరిష్కరించకుండా డీనోవ్‌ ఎంక్వైరీ అంటూ ఆర్డీవోకు సూ చించడాన్ని సవాల్‌ చేశారు. న్యాయ వ్యవస్థలో ఎగువ కోర్టులు కింది కోర్టులకు కేసుల్ని పంపే అధికారం ఉంటుందేగానీ కార్యనిర్వాహక వ్యవస్థలో ఉన్నతాధికారులు తాము నిర్వర్తించాల్సిన బాధ్యతను దిగువ అధికారులకు పంపిణీ చేసే అధికారంలేదనేది ఆ సవాల్‌ సారాంశం.

అంటే 2011 కంటే ముందుగానే ఇనామ్‌ రద్దు చట్టం-1955లోని సెక్షన్‌-4 కింద దరఖాస్తు చేయడం, సెక్షన్‌-10 కింద విచారణ పూర్తయిన తర్వాత ఓఆర్‌సీలు జారీ చేశారు. వాటిని జేసీ రద్దు చేశారు. ఈ క్రమం లో జాయింట్‌ కలెక్టర్‌ పరిధిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, తిరిగి ప్రక్రియను ఆర్డీవో పరిధిలోకి నెట్టివేయడమేంటని హైకోర్టును ఆశ్రయించడంతో 2025లో హైకో ర్టు స్టేటస్‌ కో విధిస్తూ కౌంటర్‌ దాఖలు చేయాలని సం బంధిత అధికారులను ఆదేశించింది. కానీ ఇప్పటివరకు కౌంటర్‌ దాఖలు చేయకపోగా.. గత నెల 27వ తేదీన ఏకంగా ఆర్డీవో ఓఆర్‌సీ ప్రొసీడింగ్స్‌ జారీ చేయడమేమిటని కక్షిదారులు ప్రశ్నిస్తున్నారు. కాగా రావల్‌కోల్‌ గ్రామ పరిధిలోని సర్వేనెంబరు 4-18, 20, 22, 25ల్లో వాస్తవానికి 546.24 ఎకరాల భూమి హైదర్‌అలీ సిద్దిఖీ పేరిట ఉంది.

ఆయన వారసులు రియాసత్‌ అలీ, జాహిద్‌ అలీ కాగా… ఇందులో జాహిద్‌ అలీ భాగ పంపిణీలో భాగంగా వచ్చిన 275.12 ఎకరాలను గతంలోనే ఓఆర్‌సీ తీసుకొని విక్రయించారని కక్షిదారుడు ఒకరు తెలిపారు. కానీ తాజాగా కీసర ఆర్డీవో జారీ చేసిన ఓఆర్‌సీ ప్రొసీడింగ్స్‌లో రియాసత్‌ అలీకి చెందిన నలుగురు వారసులతోపాటు జాహిద్‌ అలీకి చెందిన ఒక వారసుడికి 55 ఎకరాలకు ఓఆర్‌సీ ఇవ్వడమేందని పలువురు ప్రశ్నిస్తున్నారు. రావల్‌కోల్‌ 275.12 ఎకరాల భూదందాలో ప్రైవేట్‌ వ్యక్తు ల వివాదాలు ఇలా ఉంటే.. 2003లో అప్పటి జేసీ రవిచంద్ర స్పష్టంగా ఇవి గ్రేసింగ్‌ ల్యాండ్స్‌ (పచ్చికబయళ్లు) అంటూ ఇచ్చిన ఉత్తర్వుల్ని సర్కార్‌ పెద్దల ఒత్తిడితో ఇప్పుడు అధికారులు విస్మరిస్తుండటం అందరినీ విస్మయానికి గురి చేస్తున్నది. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన ప్రభుత్వ పెద్దలు, సివిల్‌ సర్వెంట్స్‌, రెవెన్యూ అధికారులు ఉల్లంఘనలకు పాల్పడి ప్రైవేట్‌కు ధారాదత్తం చేస్తుండటంతో ప్రజలకు చెందాల్సిన భూముల్ని కాపాడెవరు? అనే ఆందోళన వ్యక్తమవుతుంది.

'డిస్పోజ్‌ ఆఫ్‌’.. అర్థమే మార్చేసి!
1993నాటి ఈ వివాదంపై ఉన్నట్టుండి రాత్రికిరాత్రి సీసీఎల్‌ఏ ఉన్నతాధికారులు ఎందుకు దృష్టిసారించారు? ఈ క్రమంలో 'డిస్పోజ్‌ ఆఫ్‌’ అనే ఆదేశాలు ఎందుకొచ్చా యి? ఎందుకు ఆగమేఘాలపై ఈ కేసును ఆర్డీవో పరిష్కరించాల్సి వచ్చింది? అనే ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. డిస్పోజ్‌ ఆఫ్‌.. అంటే ప్రభుత్వ నిబంధనలకు, చట్టాలకు, కోర్టు తీర్పులకు అనుగుణంగా అన్ని పరిశీలించి, నిర్ణయం తీసుకోవాలని అర్థం. అంతేతప్ప, అన్నింటినీ ఉల్లంఘించి పిటిషనర్లకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడమని కాదు.

'అయితే, ఇక్కడ కోర్టు తీర్పులను తుంగలోతొక్కి ప్రభుత్వ భూములను ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టేలా చర్యలు తీసుకున్నారెందుకు?' అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఫార్ములా-ఈ వ్యవహారంలో రూ.54 కోట్లకు సంబంధించి చిన్న విధానపరమైన లోపం జరిగితే, నానా హంగామా చేసి సిట్‌ వేసిన ప్రభుత్వం.. ఇక్కడ వందల కోట్ల విలువైన భూముల విషయంలో లెక్కకు మించి విధానపరమైన లోపాలు జరిగితే సర్కార్‌ ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు? కనీసం ఒక ప్రకటన ఎందుకు విడుదల చేయట్లేదని పలువురు విమర్శిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana