Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో హైదరాబాదీల హవా.. నాలుగో ర్యాంకు సాధించిన మోహిత్‌ శేఖర్‌

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో హైదరాబాదీల హవా.. నాలుగో ర్యాంకు సాధించిన మోహిత్‌ శేఖర్‌

  • ఐదో ర్యాంకుతో సత్తాచాటిన కుచి సందీప్‌
  • ఆలిండియా టాపర్‌గా ఢిల్లీ జోన్‌ విద్యార్థి శుభమ్‌
  • నేటి నుంచి జ్యోసా కౌన్సెలింగ్‌ షురూ

హైదరాబాద్‌, జూన్‌ 1 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు సత్తాచాటారు.

హైదరాబాద్‌ నగరానికి చెందిన మోహిత్‌ శేఖర్‌ శుక్లా ఆలిండియా 4వ ర్యాంకుతో సత్తాచాటాడు. మోహిత్‌ టాప్‌-5 ర్యాంకులో చోటు దక్కించుకోవడమే కాకుండా ఐఐటీ మద్రాస్‌ జోన్‌ టాపర్‌గా నిలిచాడు. నగరానికి చెందిన మరో విద్యార్థి కుచి సందీప్‌ ఆలిండియా ఐదో ర్యాంకుతో సత్తాచాటాడు. టాప్‌-5 ర్యాంకుల్లో రెండు ర్యాంకులు హైదరాబాదీలే దక్కించుకోవడం గమనార్హం. ఐఐటీల్లోని బీటెక్‌ కోర్సుల్లో సీట్ల భర్తీకి మే 17న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఫలితాలు ఆదివారం అర్ధరాత్రి విడుదలయ్యాయి. ఐఐటీ ఢిల్లీ జోన్‌ విద్యార్థి శుభమ్‌ కుమార్‌ 330 మార్కులతో ఆలిండియా టాపర్‌గా నిలిచాడు.

కబీర్‌ చిల్లర్‌ 329 మార్కులతో 2వ ర్యాంకు, జతిన్‌ చాహార్‌ 319 మార్కులతో 3వ ర్యాంకు సాధించారు. ఇదే జోన్‌ విద్యార్థిని ఆరోహి దేశ్‌పాండే ఆలిండియా మహిళా టాపర్‌గా నిలిచింది. ఈమె దేశవ్యాప్తంగా 77వ ర్యాంకు సాధించింది. ఈ ఏడాది క్వాలిఫై అయిన వారిలో అబ్బాయిలే అధికంగా ఉన్నారు. ఈసారి 46,773 మంది అబ్బాయిలు క్వాలిఫై అయితే, అమ్మాయిలు కేవలం 10,107 మంది మాత్రమే అర్హత సాధించారు. పీడబ్ల్యూడీ కోటాలో 887 మంది క్వాలిఫై అయ్యారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు1,87,389 మంది రిజిస్టర్‌ చేసుకోగా 1,79,694 మంది ఎగ్జామ్‌ రాశారు. వీరిలో 56,880 మంది క్వాలిఫై అయ్యారు.

టాప్‌లో మద్రాస్‌ జోన్‌

ఐఐటీ మద్రాస్‌ జోన్‌ నుంచి రికార్డుస్థాయిలో విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. మొత్తం ఏడు జోన్లు ఉండగా, మద్రాస్‌ నుంచి ఈసారి రికార్డుస్థాయిలో 14,294 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. ఐఐటీ మద్రాస్‌ జోన్‌ పరిధిలో తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలున్నాయి. అడ్వాన్స్‌డ్‌లో టాప్‌-10, టాప్‌-100లోనూ మనోళ్లు సత్తాచాటారు.

కుచి సందీప్‌నకు మోదీ ప్రశంసలు

జేఈఈ మెయిన్‌లో 99 పర్సంటైల్‌ వచ్చిందని సందీప్‌ తెలిపాడు. నిరంతరం ప్రశ్నపత్రాలను సాధన చేయడం, కఠినమైన ప్రాక్టికల్‌ శిక్షణ పొందడం ద్వారా రాటుదేలానని.. నారాయణ విద్యాసంస్థల్లో శిక్షణ పొందడం.. విభిన్న పాఠ్య పుస్తకాలు చదువడం కలిసొచ్చిందని తెలిపాడు. ఐఐటీ బాంబేలోనే చేరుతానని తన మనసులోని మాట బయటపెట్టాడు. అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో సత్తాచాటిన కుచి సందీప్‌ పేరిట ఓ రికార్డు ఉంది. ప్రధాని నరేంద్రమోదీ మన్‌ కీ బాత్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రశంసించారు.

ఆరు విడతల్లో జోసా కౌన్సెలింగ్‌

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదల కావడంతో ఐఐటీలు, ఎన్‌ఐటీల్లోని సీట్ల భర్తీకి నిర్వహించే జోసా కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలయ్యింది. మంగళవారం నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రారంభంకానున్నది. ఆరు విడతల్లో సీట్లు భర్తీచేస్తారు. నాలుగు విడతల సీట్ల కేటాయింపు తర్వాత తుది విడతలో ఐఐటీలు, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో సీట్లను భర్తీచేయనుండగా, ఆరో విడతలో కేవలం ఎన్‌ఐటీల్లోని సీట్లను మాత్రమే భర్తీచేస్తారు. ఈ నెల 13న మొదటి విడత సీట్లను కేటాయించనుండగా, జూన్‌ 30న రెండో విడత, జూలై 6న మూడో విడత, జూలై 10న నాలుగో విడత, జూలై 16న తుది విడత సీట్లు కేటాయిస్తారు. ఎన్‌ఐటీల్లో సీట్ల భర్తీకి జూలై 16 నుంచి 24 వరకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు.

రోజుకు 6 గంటలు చదివాను: శుభమ్‌

మొదటి ర్యాంకర్‌ శుభమ్‌ మాట్లాడుతూ..'నేను రెండేండ్లుగా ప్రిపేర్‌ అయ్యాను. నా హార్డ్‌ వర్క్‌నే నమ్మాను. రోజుకు 6 గంటలు చదివాను. ఫస్ట్‌ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది' అని తెలిపాడు. రెండో ర్యాంకర్‌ కబీర్‌ మాట్లాడుతూ.. ఎక్కువ గంటలు చదవడం ముఖ్యం కాదని.. అటెన్షన్‌తో ప్రిపేర్‌ కావాలని తెలిపాడు.

గురుకుల విద్యార్థుల ప్రతిభ

ఫలితాల్లో ఎస్సీ, బీసీ గురుకుల విద్యార్థులు సత్తాచాటారు. ఎస్సీ సొసైటీ పరిధిలోని 37 సీఈవోల నుంచి 355 మంది దరఖాస్తు చేసుకోగా, 61 మంది సీటు పొందారు. 102 మంది ప్రిపరేటరీ ర్యాంకులు సాధించారు. బీసీ గురుకులం నుంచి 25 మంది అర్హత సాధించారు. ఫారూక్‌నగర్‌ కేజీబీవీ విద్యార్థిని అఖిల ఎస్టీ కోటాలో ఆలిండియా 831వ ర్యాంకు కైవసం చేసుకున్నది.

వాట్సాప్‌ తప్ప సోషల్‌ మీడియా వాడలే..

పరీక్ష రాయగానే మంచి ర్యాంకు వస్తుందని ఊహించా. ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ కోర్సులో చేరుతా. ఇంజినీరింగ్‌ తర్వాత ఉద్యోగంలోనే చేరుతా. ఒక్క వాట్సాప్‌ తప్ప సోషల్‌ మీడియా జోలికెళ్లలేదు. జేఈఈ కోసం రోజుకు 8-10 గంటలు కష్టపడ్డా.

-మోహిత్‌ శేఖర్‌ శుక్లా, ఆలిండిమా 4వ ర్యాంకు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana