Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జెన్‌-జీపై ఎఫ్‌ఐఆర్‌ల రద్దు

జెన్‌-జీపై ఎఫ్‌ఐఆర్‌ల రద్దు

నీట్‌ పరీక్షల లీకేజీలు, అవకతవకలపై కదం తొక్కిన జెన్‌-జీ ఆందోళనకారులపై దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను సుప్రీంకోర్టు రద్దు చేయడం స్వాగతించాల్సిన విషయం.

ఆ ఎఫ్‌ఐఆర్‌లపై ఎలాంటి విచారణ జరుపరాదని, దాఖలైన ఉద్దేశాలు, లక్ష్యాలతో ప్రమేయం లేకుండా వాటిని మొత్తంగా మూసేయాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ తీర్పు నేపథ్యంలో ఆందోళనకారులు ఈ నెల 5న జరుపతలపెట్టిన మార్చ్‌ను రద్దు చేసుకోవడం ముదావహం. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142 కింద లభించిన ప్రత్యేకాధికారాలను వినియోగించుకుని న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించడం గమనార్హం. ఆర్టికల్‌ 142 అనేది సుప్రీంకోర్టుకు అన్ని నిబంధనలకు అతీతంగా 'సంపూర్ణ న్యాయం' సాధించేందుకు విస్తృతమైన అధికారం కల్పిస్తుంది. సాధారణ న్యాయపద్ధతుల్లో సాధ్యంకాని సందర్భాల్లో సమగ్ర న్యాయం అందించేందుకు ఈ అధికారం ఉపయోగపడుతుంది. నిరసనలు వ్యక్తం చేయడం ప్రజాస్వామ్య హక్కు అని, దానిని అణచివేయడానికి చట్టాలను ఆయుధాలుగా వాడకూడదని సర్వోన్నత న్యాయస్థానం ఈ అసాధారణ చర్య ద్వారా ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చిందని భావించవచ్చు.

విద్యార్థుల నిరసనలు దేశ భద్రతకు ముప్పుగా లేదా సామాజిక శాంతి భద్రతలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో జరిగినవి కావు. అవి భవిష్యత్తుపై వారిలో ఏర్పడిన ఆందోళనకు, పరీక్షా వ్యవస్థపై కోల్పోయిన నమ్మకానికి అద్దం పట్టాయి. అయితే ప్రభుత్వాలు ఈ ఆవేదనను అర్థం చేసుకోవడానికి బదులు, పోలీసు కేసులతో అణచివేయాలనే ప్రయత్నం చేయడం తీవ్రమైన తప్పిదం. నిరసనలను క్రిమినలైజ్‌ చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతం. ఈ కేసులోనే కాకుండా ఇటీవల పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు ప్రజల నిరసన హక్కును బలంగా సమర్థించడం విశేషం. నిజానికి ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వాలు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. కానీ పోలీసు చర్యలు, కేసులతో విద్యార్థులను భయపెట్టరాదని కోర్టు చెప్పకనే చెప్పింది. ఇటీవలి కాలంలో నిరసనలను అణచివేయడానికి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం ఒక సాధారణ ధోరణిగా మారుతున్నది. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. సుప్రీం తీర్పు కేవలం విద్యార్థులకే కాకుండా, దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేసే ప్రతి పౌరుడికీ వర్తిస్తుంది. అదే సమయంలో, ఇది ప్రభుత్వాలు కూడా ప్రజల స్వరాన్ని వినాలి, అణచివేయకూడదనే ఒక హెచ్చరికను కూడా జారీ చేస్తున్నది.

విద్యార్థుల ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి మొదటి నుంచీ రెండు నాల్కల ధోరణిలోనే ఉండటం గమనార్హం. ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా కేసులను ఎత్తివేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే అది 'జాతీయ ప్రయోజనాల కోసం' అని చెప్పడం విడ్డూరం. ఆందోళన సాగుతున్న రోజుల్లో ప్రభుత్వం విద్యార్థులను 'జాతివ్యతిరేక శక్తులు'గా ముద్రవేయడం తెలిసిందే. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్‌ కూడా యువత ఆందోళనలో జాతివ్యతిరేక శక్తులు చేరాయని వ్యాఖ్యానించడం తెలిసిందే. ఇక ప్రధాని నరేంద్ర మోదీ అయితే నీట్‌ తప్పులకు సూటిగా క్షమాపణలు చెప్పాల్సింది పోయి ఆందోళనకారులు తనను తిడుతున్నారని, అందుకు వారిని క్షమిస్తున్నానని చెప్పడం మరీ విడ్డూరం. మొత్తమ్మీద ప్రభుత్వం మెడలు వంచి తన బాధ్యతను గుర్తుచేయడంలో జెన్‌-జీ సఫలమైంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana