Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జీహెచ్‌ఎంసీ డీజిల్‌ పక్కదారి

జీహెచ్‌ఎంసీ డీజిల్‌ పక్కదారి

  • సబ్‌కాంట్రాక్టర్‌తో పాటు నలుగురు అరెస్ట్‌
  • 15 వేల లీటర్ల డీజిల్‌ స్వాధీనం

సిటీబ్యూరో, జూలై 28 (నమస్తే తెలంగాణ): జీహెచ్‌ఎంసీ లారీలకు పోయాల్సిన డీజిల్‌ను పక్కదారి పట్టిస్తున్న ఓ సబ్‌కాంట్రాక్టర్‌ను, అతడికి సహకరిస్తున్న ముఠాను రాచకొండ ఎల్బీనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీపీ మహేశ్‌భగవత్‌ కథనం ప్రకారం.. అమీర్‌పేట్‌కు చెందిన నాదేండ్ల కోటేశ్వర్‌రావు జీహెచ్‌ఎంసీ వాహనాలకు సంబంధించిన డీజిల్‌ను అందించే కవాడిగూడ, ఖైరతాబాద్‌, మలక్‌పేటలోని ఫ్యూయల్‌ స్టేషన్లకు డీజిల్‌ను సరఫరా చేసేందుకు అయూబ్‌ అలీ బేగ్‌ వద్ద సబ్‌కాంట్రాక్టర్‌గా గత ఏడాది జనవరి నుంచి పనిచేస్తున్నాడు. ఈ ఫ్యూయల్‌ స్టేషన్లలో 20 వేల డీజిల్‌ పట్టే సామర్థ్యం ఉంది.

చర్లపల్లిలోని ఐఓసీఎల్‌ నుంచి అవసరమైన డీజిల్‌ తెచ్చి జీహెచ్‌ఎంసీకి అందజేస్తున్నాడు. అయితే ఈ ఫ్యూయల్‌ స్టేషన్లలో ఆటోమెటిక్‌ సిస్టమ్‌తో ట్యాంకులను నింపే వ్యవస్థ ఉన్నప్పటికీ ఆరు నెలలుగా పనిచేయడం లేదు.

దీన్ని ఆసరాగా చేసుకున్న కోటేశ్వర్‌రావు ఖైరతాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ వాహనాల డంపింగ్‌ యార్డులో నింపాల్సిన 20 వేల లీటర్ల డీజిల్‌లో, కేవలం 5 వేలు మాత్రమే నింపాడు. రికార్డుల్లో మాత్రం 20 వేల లీటర్లు డీజిల్‌ పోసినట్లు రాశాడు. మిగతా 15 వేల లీటర్ల డీజిల్‌ను ఘటకేసర్‌కు చెందిన తన అనుచరుడైన బోత వేణుమాదవ్‌రావు సహకారంతో బండరావిరాళ్లలో ఉన్న బీఎన్‌ఆర్‌ స్టోన్‌ క్రషర్‌కు తరలిస్తున్నాడు. అందుకు క్రషర్‌ సూపర్‌వైజర్‌ అనుగు సుధాకర్‌రెడ్డితో డీల్‌ కుదుర్చుకున్నాడు. దీనికి చాంద్రాయణగుట్టకు చెందిన మహ్మద్‌ అవైస్‌, ఉప్పల్‌కు చెందిన కొత్తూరు వెంకటయ్యలు సహకారం అందించారు. ఇదిలాఉండగా విశ్వసనీయ సమాచారంతో ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ బృందం, అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులతో కలిసి దాడి చేసి లారీతో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన కాంట్రాక్టర్‌ అయూబ్‌ అలీ బేగ్‌తో పాటు లారీ యజమాని అశోక్‌రెడ్డి, మరో వ్యక్తి షకీల్‌ పరారీలో ఉన్నారు. నిందితులతో పాటు 15 వేల లీటర్ల డీజిల్‌, రూ. 23 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana