Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జూబ్లీలో పాగాకు స్కెచ్‌

జూబ్లీలో పాగాకు స్కెచ్‌

  • సీఐ పోస్టింగ్‌ ఇప్పిస్తానని ముఖ్యనేత సోదరుడి హామీ
  • గతంలో గురువుగా భావించే ఓ కీలక అధికారి చొరవతో కోరుకున్న చోట పోస్టింగ్‌
  • 'ఆది'లోనే ఆశలు సన్నగిల్లి 'కొండ'పై గురి
  • జూబ్లీహిల్స్‌లో పోస్టు ఖాళీతో మళ్లీ ఆశలు.. వెంటనే గురువును ఆశ్రయించిన ఆ పోలీస్‌
  • ఇప్పుడే వద్దనడంతో రూట్‌ మార్చిన శిష్యుడు
  • ఆ పోలీస్‌ యత్నాలపై గుర్రుమన్న కీలకాధికారి
  • రేపో, మాపో పోస్టింగు ఖరారయ్యే చాన్స్‌

హైదరాబాద్‌ సిటీబ్యూరో ఆగస్ట్‌ 29 (నమస్తే తెలంగాణ)//బంజారాహిల్స్‌: 'అధికారమున్నోడికి అవసరమైతే ఎక్కడో ఉన్న ఉద్యోగికి కూడా అనుకొన్నచోట పోస్టింగ్‌ వచ్చినట్టే' ఇది మార్చిన సామెత అయినా ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. ఇప్పటికే తన గురువైన ఓ కీలక పోలీస్‌ అధికారి చొరవతో రెండుసార్లు కోరుకున్న చోటుకు వెళ్లిన ఓ ఇన్‌స్పెక్టర్‌.. ఇప్పుడు ఏకంగా ముఖ్యనేత సోదరుడి పైరవీ ద్వారానే నగరం నడిబొడ్డులోని ఠాణాకు వచ్చేందుకు కుతూహలంతో ఉన్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. దీనిపై రుసరుసలాడుతూ ఆ శిష్యుడి రాకను చెక్‌ పెట్టాలని ఆ గురువు పంతం పట్టినట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో శిష్యుడి పైరవీ గెలుస్తుందా? గురువు పట్టు నిలుస్తుందా? అన్న చర్చ పోలీస్‌ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్నది.

నెలరోజుల క్రితం జరిగిన పోస్టింగుల్లో కీలకమైన నగర శివారు పోస్టింగ్‌ సంపాదించి రియల్‌ ఎస్టేట్‌ వ్యవహారాల్లో కాసుల పంట పండించుకోవచ్చనుకున్న ఆ ఇన్‌స్పెక్టర్‌.. తీరా అక్కడికి వెళ్లాక రియల్‌ బూమ్‌ లేకపోవడంతో తీవ్రనిరాశకు గురయ్యారు. గతంలో కమిషనరేట్‌లోని ఐటీ విభాగంలో కీలక పోస్టింగులో ఉండి ముఖ్య అధికారికి తలలో నాలుకలా 'తాను చెప్పిందే కమాండ్‌.. తాను చేసిందే కంట్రోల్‌’ అన్నట్టు నగరంలో ఏ పోలీసు కదలికనైనా శాసించగలిగే స్థాయిలో ఉన్నతాధికారికి షాడోలా వ్యవహరించారని ప్రచారం జరిగింది. ఆ సేవలకు నజరానాగా ఐటీ నుంచి కొత్తగా కమిషనరేట్‌ పరిధిలో చేరిన శివారు ప్రాంతంలోని కీలక ఠాణాలో తన శిష్యుడికి ఇన్‌స్పెక్టర్‌గా ఆ కీలకాధికారి పోస్టింగ్‌ సాధించాడు. అప్పటి నుంచి తనతోపాటు తన గురువు జేబులు కూడా నింపవచ్చనుకొని ప్రణాళికలు వేసుకుని రయ్‌మంటూ ఆ పోస్టింగులో వెంటనే చేరిపోయారు. తీరా అక్కడికి వెళ్లాక 'ఆది'లోనే హంసపాదు అన్నట్టు అసలు విషయం బోధపడటంతో ఏం చేయాలో పాలుపోక మరో అవకాశం కోసం వేచిచూస్తున్నారు.

'ఆది'లో కంగుతిని కొండల్లో పాగా కోసం!

జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ ప్రతీసారి వార్తల్లోకెక్కుతున్నది. గత రెండేండ్లుగా నలుగురు ఇన్‌స్పెక్టర్లు వేర్వేరు పరిస్థితుల్లో మారిపోయారు. తాజాగా పోస్టింగ్‌ కోసం హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో కసరత్తు సాగుతున్నది. చాలామంది ఇన్‌స్పెక్టర్లు ఈ స్టేషన్‌కు రావడానికి నిరాసక్తత కనబరుస్తుంటే, గురువును మించిన శిష్యుడైన ఆ ఇన్‌స్పెక్టర్‌ మాత్రం తన ఐటీ బుర్రతో నెలరోజుల్లోనే మరోసారి పోస్టింగు కోసం ప్రయత్నాలు జోరుగా చేస్తున్నారట. ఇటీవల సుమంత్‌ కేసు వ్యవహారంతో జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ముత్తూయాదవ్‌పై సస్పెన్షన్‌ వేటుపడటంతో ఆ శిష్యుడికి చాన్స్‌ దొరికినట్టయింది. వెంటనే తనకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తన గురువును పరోక్షంగా సంప్రదిస్తే.. ఆయన దగ్గరి నుంచి ఇప్పుడే ఎందుకన్నట్టుగా సమాధానం వచ్చింది.

ముఖ్యనేతపై విధేయతతో బిగ్‌స్కెచ్‌!

గత ఎన్నికల్లో తాను పనిచేసినప్పుడు ప్రస్తుత రాష్ట్ర 'ముఖ్య'నేతపై చూపించిన విధేయత ఆధారంగా తన స్వామిభక్తికి తగిన ప్రతిఫలం పొందడానికి ఆ ఇన్‌స్పెక్టర్‌ బిగ్‌స్కెచ్‌ వేశాడు. తనకున్న పరిచయాలతోపాటు నేరుగా ముఖ్యనేతను కలిసే ప్రయత్నం చేసినా అవకాశం దక్కలేదు. ఆయనకంటే మరింత సాన్నిహిత్యం ఉన్న ఆ ముఖ్యనేత సోదరుడిని కలిసి 'కొండ'లపై పాగా వేయడానికి అవకాశమిస్తే గతంలో చేసిన దానికంటే రెట్టింపు సేవలు చేసుకొని తరిస్తానంటూ మోకరిల్లినట్టు సమాచారం. దీంతో అతని స్వామిభక్తి, తమ ప్రయోజనాలు కలగలిపి జూబ్లీలో తమ పెత్తనం కొనసాగాలన్నా, తాము చెప్పిందే జరుగాలన్నా.. ఇలాంటి అస్మదీయులు ఉండాలని ఆ ముఖ్యనేత సోదరుడు భావించి వెంటనే నగర ముఖ్య అధికారికి ఫోన్‌ చేసినట్టు చర్చ జరుగుతున్నది.

తన గురువును వదిలేసి 'ముఖ్య'దారిలో..

అసలు కథ ఇక్కడే మొదలైంది. అసలే తనకు అనుంగు శిష్యుడు, అంతకుమించి తనతో నిరంతర సాన్నిహిత్యం కలిగిన ఆ ఇన్‌స్పెక్టర్‌ ఇలా పైనుంచి చెప్పించుకొనే సరికి సారుగారికి తెగ కోపం వచ్చింది. వెంటనే అతనిపై కస్సుబుస్సులాడుతూ తన కార్యాలయానికి పిలిచి తెగ తిట్లు తిట్టినట్టు కమిషనరేట్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ముత్తూయాదవ్‌తో, అంతకుముందు శ్రీనివాసరెడ్డితో తలబొప్పి కట్టించుకొని.. తనపై అధికారులు, ముఖ్యనేతలతో చీవాట్లు తిని మంటమీద ఉన్న సమయంలోనే ఈ పోస్టింగ్‌ పైరవీ తన వద్దకు రావడంతో అరికాలుపై అంతెత్తున లేచినట్టు పోలీస్‌వర్గాల్లో చర్చ జరుగుతున్నది. జూబ్లీహిల్స్‌లో పోస్టింగ్‌ ఇకపై ముఖ్య అధికారి చేతుల్లో కాకుండా ముఖ్యనేత కుటుంబం తమ చేతుల్లోకి తీసుకొన్నదని చర్చించుకుంటున్నారు. త్వరలోనే అదే ప్రాంతంలో తనకు అడ్డుగా ఉన్న ఓ నిఘా విభాగపు కీలక అధికారి కూడా త్వరలోనే వేరేచోటుకు తరలిపోయే అవకాశం ఉన్నట్టు సమాచారం ఉండటంతో పట్టువదలని విక్రమార్కుడిలా పోస్టింగు కోసం ఆ ఇన్‌స్పెక్టర్‌ తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇవాలో, రేపో జూబ్లీహిల్స్‌లో ఇన్‌స్పెక్టర్‌ నియామకం జరుగనున్న నేపథ్యంలో ఈ శిష్యుడి పైరవీ గెలుస్తుందా? అతనికి గురువైన ఆ పెద్దసారు పట్టు నిలుస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana