తెలంగాణ
జూన్ వరకు సీతారామ కాల్వలు

- ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి
- 10 లక్షల ఎకరాలకు సాగునీరందాలి
- అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. కొత్త ఆయకట్టును సృష్టించడంతోపాటు, సాగర్ టెయిలెండ్ ఆయకట్టును కూడా కలుపుకొని పది లక్షల ఎకరాలకు సాగు నీరందించే ఈ ప్రాజెక్టును అత్యంత ముఖ్యమైనదిగా భావించాలని సూచించారు. సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ గురువారం ప్రగతిభవన్‌లో సమీక్షించారు.
'అటు గోదావరి, ఇటు కృష్ణా నదుల మధ్య ఉన్న ఖమ్మం జిల్లాను సస్య శ్యామలం చేయడానికి ప్రభుత్వం సీతారామ ఎత్తిపోతల పథకాన్ని మంజూరుచేసింది. దుమ్ముగూడెం పాయింట్ వద్ద గోదావరి నదిలో ఏడాది పొడవునా పుష్కలంగా అందుబాటులో ఉండే నీటితో యావత్ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సాగునీటిని అందించవచ్చు. దుమ్ముగూడెం నుంచి నీటిని ఎత్తిపోసి అటు ఇల్లెందు వైపు, ఇటు సత్తుపల్లి వైపు.. మరోపక్క పాలేరు రిజర్వాయర్‌కు లిఫ్టు కాల్వల ద్వారా నీటిని తరలించాలి. సత్తుపల్లి, ఇల్లెందు వైపువెళ్లే కాల్వలకు సంబంధించి మిగిలిన పనుల సర్వేను వెంటనే పూర్తిచేసి, టెండర్లు పిలవాలి. మున్నేరు, ఆకేరు వాగులపై అక్విడక్టులను నిర్మించి, పాలేరు రిజర్వాయర్ వరకు కాల్వల నిర్మాణాన్ని జూన్ వరకు పూర్తిచేయాలి.
కృష్ణానదిలో నీళ్లు ఎప్పుడుంటాయో, ఎప్పుడుండవో తెలియదు. అంత అనిశ్చితి ఉంటుంది. కృష్ణా ద్వారా నీరందని సమయంలో గోదావరి నుంచి సాగర్ ఆయకట్టుకు నీరందించే ఏర్పాట్లు పూర్తిచేయాలి' అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్‌రెడ్డి, హరిప్రియానాయక్, సండ్ర వెంకటవీరయ్య, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్, నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్, ఈఎన్సీలు మురళీధర్‌రావు, హరేరాం, సీఈలు వెంకటకృష్ణ, శంకర్‌నాయక్, మధుసూదన్‌రావు, ఎస్‌ఈ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
related stories
-
హోం Mission Bhagiratha: వరంగల్ లో నత్తనడకన మిషన్ భగీరథ పనులు
-
ప్రధాన వార్తలు ఫలాలకు దీటుగా పునరావాసం
-
పశ్చిమ గోదావరి పోలవరం ప్రాజెక్టు సందర్శన