Sunday, 06 Aug, 12.38 pm నమస్తే తెలంగాణ

బతుకమ్మ
కాకతీయుల తొలితరం నాయకులు

కాకతీయ వంశానికి సంబంధించి ఇప్పటి వరకూ లభ్యమైన శాసనాల్లో మొట్టమొదటిది క్రీ.శ. 956 నాటి మాంగల్లు శాసనం. తూర్పు చాళుక్య రాజు దానార్ణవుడు దానిని జారీ చేశాడు. ఇందులో కేవలం నాలుగు తరాల కాకతీయ వంశస్థుల పేర్లు మాత్రమే ఉన్నాయి. 1966లో ఖమ్మం జిల్లాలోని బయ్యారం చెరువు శాసనం వెలుగు చూశాక కాకతీయుల 14 తరాల వరకు సమాచారం లోకానికి తెలిసింది. పెద్ద నల్లస్తంభం నాలుగు వైపులా చెక్కి ఉన్న ఈ శాసనాన్ని క్రీ. శ. 1220లో గణపతిదేవ చక్రవర్తి సోదరి మైలమ (మైలాంబ) వేయించింది. బయ్యారమనే గ్రామాన్ని నిర్మించి అక్కడ ధర్మకీర్తి సముద్రమనే పెద్ద చెరువు తవ్వించింది. ఈ సందర్భంగా ఆ జలాశయం ఒడ్డున కాకతీయుల వంశచరిత్రను తెలిపే శిలాశాసనాన్ని వేయించింది. ఈ శాసన పరిష్కర్త పి. వి. పరబ్రహ్మశాస్త్రి. గణపతిదేవునికి ముందున్న పదకొండు తరాల కాకతీయ పూర్వీకుల వంశావళినందించే శాసనం ఇదొక్కటే. ఈ శాసనాన్ని ఆధారంగా చేసుకుని ఇందులో పేర్కొనకుండా వదిలేసిన వారిని, మరికొన్ని శాసనాల్లో కన్పించే మరికొంత మందిని కలుపుకొని ఆయన ఓ సంపూర్ణ వంశవృక్షాన్ని సరిపోల్చారు. ఉదాహరణకు మాంగల్లు దానపత్రం కాకతీయ కుటుంబ సభ్యుడు బేతియను పేర్కొంటుంది. ఇతణ్ని బయ్యారం శాసనంలో పిండి గుండన లేక నాలుగవ గుండనగా పరబ్రహ్మశాస్త్రి గుర్తించారు. ఇలాగే ఇతర శాసనాల్లో ప్రస్తావనకు వచ్చిన వారినీ సమన్వయ పరుస్తూ కాకతీయుల వంశవృక్షాన్ని ఇలా సూచించారు.

-నగేష్ బీరెడ్డి, 91827 77177

1. కాకతి వెన్నయ :

దుర్జయ వంశంలో వెన్న నృపుడు జన్మించాడు. ఈయనే కాకతీయ వంశ స్థాపకుడు. కాకతి పురాన్ని తన నివాస స్థానంగా, పృథ్విని పాలించాడని బయ్యారం శాసనం ఆధారంగా తెలుస్తున్నది. చాళుక్య గాంగ కుమార సోమేశ్వరుడు క్రీ.శ. 1124లో వేయించిన గూడూరు శాసనంలో కూడా వెన్నయ గురించి ఉన్నది. కాకతీయులు నాడు రాష్ట్రకూటుల సామంతులుగా ప్రస్థానం మొదలుపెట్టారు. వెన్నయ రాష్ట్రకూట రాజైన దంతిదుర్గుని సామంతునిగా తెలంగాణ ప్రాంత పరిపాలకుడిగా ఉన్నాడు.

2. మొదటి గుండన:

ఈయన గురించిన సమాచారం ఇప్పటి వరకూ ఏ శాసనాల్లోనూ లభించలేదు.

3. రెండవ గుండన:

మొదటి గుండన కొడుకైన రెండవ గుండన సమాచారం కూడా దొరకడంలేదు.

4. మూడవ గుండన:

రాష్ట్రకూటుల సేనా నాయకులలో ప్రసిద్ధుడైన మూడవ గుండన గురించి దానార్ణవుని మాంగల్లు శాసనంలో ఉంది. చాళుక్య రాజు మొదటి భీముని (క్రీ.శ. 982-922) పరిపాలనా కాలంలో, రాష్ట్రకూట రాజు రెండవ కృష్ణుడు (క్రీ.శ. 880-912) ఎన్నోసార్లు వేంగి దేశంపై దాడులు చేశాడు. రెండవ కృష్ణుడు విజయవాడపై జరిపిన ఒక దండయాత్రలో ఈ గుండన వీరమరణం పొందాడు.

5. ఎర్రయ :

మూడవ గుండన తర్వాత వచ్చిన వాడు ఎర్రయ. బయ్యారం శాసనం ప్రకారం ఇతడు కుఱ్ఱవాడి (కురవి), ఆ పరిసర ప్రాంతాల పాలకుడు. ఈ కురవి రాజ్యం రాష్ట్రకూట రాజ్యానికి, వేంగి రాజ్యానికి మధ్యలోని చిన్న ప్రాంతం. చాళుక్యులు గెలిచినప్పుడు ఈ కురవి రాజ్యం ముదిగొండ చాళుక్య రాజుల చేతిలోకి, రాష్ట్రకూటులు గెలిచినప్పుడు కాకతీయుల చేతిలోకి మారుతూ ఉండేది. మూడవ గుండన కొడుకైన ఎర్రయ నాయకుడు తండ్రి వలె రాష్ట్రకూట రాజైన కన్నర బల్లాహుడి (రెండవ కృష్ణుడు) సేనాని. చాళుక్యులతో జరిపిన యుద్ధంలో వారి రాజైన చాళుక్య భీముడ్ని ఓడించి వేంగి రాజ్యాన్ని తన ప్రభువు బల్లాహుడికి కానుకగా అందించాడు. దీనికి సంతోషించిన ఆ రాజు ఎర్రయకు కురవి రాజ్యాన్ని బహుకరించాడు.

6. బేతియ :

ఈ రాజు ప్రస్తావన దానార్ణవుడి మాంగల్లు శాసనంలో మాత్రమే ఉంది. బయ్యారం శాసనంలో కనిపించదు. ఎర్రయ కొడుకు బేతియ. ఇతనికి కుటుంబచరిత్రలో ప్రముఖ పాత్ర ఉన్నట్లుగా కనిపించదు.

7. నాలుగవ గుండన (క్రీ.శ. 955-995):

బేతియ కొడుకు నాలుగవ గుండన. ఈయనకే పిండి గుండన అనే మరో పేరు కూడా ఉంది. ఇతడు రాష్ట్రకూట రాజైన మూడవ కృష్ణుడికి సామంతుడు. వేంగి సింహాసనంపై దానార్ణవుడిని కూర్చోబెట్టడంలో నాలుగవ గుండన (కాకత్య గుండన) కీలక పాత్ర పోషించాడు. (ఆ కథనం జూలై 23, 2017న ఇదే శీర్షికలో ఇచ్చాం). అటు తర్వాత రాష్ట్రకూట రాజ్యం పతనమై ఆ స్థానంలో చాళుక్య రాజైన రెండవ తైలపుడు కళ్యాణి చాళుక్య (పశ్చిమ చాళుక్యుల) రాజ్యాన్ని స్థాపించాడు. రాష్ట్రకూటుల పూర్వపు సామంతులు తైలపుని ప్రాపకం సంపాదించారు. కానీ, నాలుగవ గుండన తైలపుడికి లొంగిపోకుండా ముదిగొండ పాలకులను ఓడించి హనుమకొండ రాజ్యం పక్కనే ఉన్న కురవి రాజ్యాన్ని తమ స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నారు. పదే పదే చేజారిపోతున్న రాజ్యాన్ని ఎలాగైనా గెలుచుకోవాలనే కాంక్షతో ముదిగొండ నాయకులు రెండవ తైలపుని సహాయాన్ని అర్థించారు. క్రీ.శ. 995లో జరిగిన యుద్ధంలో నాలుగవ గుండన ఓడిపోయాడు.

8. మొదటి బేతయ :

నాలుగవ గుండన కురవి రాజ్యాన్ని కోల్పోయిన సమయంలో ఆయన కొడుకైన గరుడ బేతయ బాల్యదశలో ఉన్నాడు. అప్పుడు కాకతీయుల విశ్వాసపాత్రులైన విరియాల వంశస్థులు బేతయకు ఆశ్రయమిచ్చారు. గరుడ బేతయనే మొదటి బేతరాజు అంటారు. బయ్యారం శాసనం ఇతణ్ని గరుడాంతక బేతయగా అభివర్ణించింది. విరియాల వంశస్థుడు ఎర్రయ రెండవ తైలపుడి వద్ద సేనా నాయకుడు. ఆయన భార్య కామవసాని కాకతీయులకు బంధువు. కాకతి రాజ్య వారసుడు ఆ స్థితిలో ఉండడం ఆమె సింహచలేక తన భర్త ద్వారా చక్రవర్తిని దర్శించుకుని కాకతీయ వంశ విశిష్టతను తెలిపి గరుడ బేతరాజును పరిచయం చేసింది. అందుకు ప్రసన్నుడైన తైలపుడు కురవి సీమను కాకుండా వేల్పుకొండ రాజ్యాన్ని ఇచ్చాడు. ఇంతటితో కాకతీయులు రాష్టకూటుల పతనానంతరం పశ్చిమ చాళుక్యులకు సామంతులుగా మారారు.

9. మొదటి ప్రోలుడు (1052-1076) :

గరుడ బేతయ కొడుకు ప్రోలుడు. ఇతడే మొదటి ప్రోలరాజు. చిన్నప్పటి నుంచే తండ్రితో కలిసి అనేక యుద్ధాలలో పాల్గొన్నాడు. కంచిపై జరిగిన భీకర యుద్ధంలో కూడా ప్రోలుడు చిన్నప్పుడే పాల్గొన్నాడు. బయ్యారం శాసనం ఇతడిని అరిగజ కేసరి (ఏనుగుల వంటి శత్రు సైన్యానికి సింహం లాంటి వాడు) అనే బిరుదుతో సంబోధించింది. చక్రవర్తికి ఎదురు తిరిగిన ఎంతోమంది సామంతులను దారికి తెచ్చిన ఘనత మొదటి ప్రోలరాజుది. ఇతని శౌర్య ప్రతాపాలకు గుర్తింపుగా చక్రవర్తి అనుమకొండను శాశ్వత మాన్యంగా ఇచ్చాడు. కేసముద్రంలో కేసరి తటాకాన్ని తవ్వించింది ఇతడే.

10. రెండవ బేతరాజు (క్రీ.శ. 1076-1108) :

ఇతనికి త్రిభువన మల్లుడు అనే పేరు కూడా ఉంది. ఇది ఆయన బిరుదు. పశ్చిమ చాళుక్య విక్రమాదిత్యునికి ఇతడు మహా సామంతుడు (క్రీ.శ. 1032 నాటి బానాజీపేట, క్రీ.శ. 1090 నాటి శనిగరం శాసనాల ప్రకారం). ఈ విక్రమాదిత్యుడే బేతరాజుకు త్రిభువనమల్లు అనే బిరుదు ప్రదానం చేశాడు. శివపురమనే బస్తీని నిర్మంచి అక్కడ తన పేరు మీదుగా బేతేశ్వరాలయాన్ని కట్టించాడు. కాకతీయ రాజ్య పతనానంతరం ఈ ఆలయాన్ని కూల్చివేసి ముస్లిం పాలకులు అక్కడొక దర్గా నిర్మించారిని, అదే ఇప్పటి ఖాజీపేట దర్గా అని చరిత్రకారులు చెబుతున్నారు.

11. దుర్గరాజు (క్రీ.శ. 1108-1116):

తండ్రి (రెండవ బేతరాజు) అనారోగ్యం కారణంగా ఆయన జీవించి ఉన్న కాలంలోనే దుర్గరాజు పరిపాలన చేశాడు. తండ్రి సమక్షంలోనే రామేశ్వర పండితుడి ద్వారా పట్టాభిషిక్తుడై త్రిభువనమల్లు, చలమర్తి గండ బిరుదులతో పాలన సాగించినట్లు ఖాజీపేట శాసనం చెబుతున్నది.

12. రెండవ ప్రోలుడు (క్రీ.శ. 1116-1157) :

దుర్గరాజు ప్రజారంజక పాలనలో విఫలం అవ్వడంతో అతని సోదరుడు రెండవ ప్రోలరాజు సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతను గొప్పవీరుడు. దుర్గరాజు వల్ల నష్టపోయిన కాకతీయ రాజ్యాన్ని రక్షించుకుని శత్రువులను తుదముట్టించాడు. చాళుక్య రెండవ జగదేకమల్లుని రాజ్యాన్ని పటిష్టం చేయడంలో కూడా ముఖ్య పాత్ర పోషించాడు. ఈయన కాలంలోనే భావి కాకతీయ సామ్రాజ్యానికి పునాదులు పడ్డాయి.
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana
Top