Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Etela Rajender | లక్ష కోట్ల అవినీతి అనేది అబద్ధం.. కాళేశ్వరం నీళ్లు ఎత్తాల్సిందే: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌

Etela Rajender | లక్ష కోట్ల అవినీతి అనేది అబద్ధం.. కాళేశ్వరం నీళ్లు ఎత్తాల్సిందే: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌

Etela Rajender | హైదరాబాద్‌, జూలై 10 (నమస్తే తెలంగాణ): 'లక్ష కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందనడం పచ్చి అబద్ధం..నిరాధార ఆరోపణలు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డికి బుద్ధి ఉన్నదా?'అంటూ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ నిప్పులు చెరిగారు.

'లక్షకోట్లు తిన్నరని మీరంటే నేను అట్లనే మాట్లాడాల్నా? మీకేమైనా జ్ఞానమున్నదా?' అని సూటిగా ప్రశ్నించారు. 'గింత నీచంగా బదనాం చేస్తే ప్రజలు హర్షిస్తరని అనుకుంటే నీ మూర్ఖత్వం.. బండకేసి కొడ్తరు జర జాగ్రత్త' అని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ బరాజ్‌ ఒక్కటే కాదని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, మిడ్‌ మానేర్‌, అనంతసాగర్‌, రంగనాయక్‌సాగర్‌, మల్లన్నసాగర్‌, కొండ పోచమ్మసాగర్‌, బస్వాపూర్‌ ఇలా వందల టీఎంసీల కెపాసిటీ కలిగిన రిజర్వాయర్లు.. వందల కిలోమీటర్ల కాలువలు.. పదుల సంఖ్యలో పంప్‌హౌస్‌లు, మోటర్లు అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. 'ముఖ్యమంత్రి బదనాం చేసుడు కాదు.. ఆ ప్రాజెక్టును వాడుకొని రైతాంగాన్ని ఆదుకోవాలె' అని హితవు పలికారు.

ఎగువ రాష్ర్టాల్లో విస్తారంగా వానలు కురిసి తెలంగాణ ప్రాజెక్టుల్లోకి నీళ్లు వస్తున్నా, రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కాళేశ్వరం మోటర్లను ఆన్‌చేయకుండా అన్నదాతలను అష్టకష్టాలు పెడుతున్నదని మండిపడ్డారు. భేషజాలు బంద్‌పెట్టి మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఉత్తమంగా ఆలోచించాలె' అని సూచించారు. వానకాలం పంటలకు నీళ్లులేక రైతులు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు, తాజా రాజకీయ పరిస్థితులపై తనదైన పంథాలో నిర్మోహమాటంగా అభిప్రాయాలు వెలిబుచ్చారు. 'తెలంగాణ రాకముందు పల్లేపల్లెనా పల్లేర్లు మొలిచినవని మా గోరటి వెంకన్న పాటపాడిన్రు..వానమ్మ వానమ్మా ఒక్కసారి వచ్చిపోవమ్మా అని పాడుకునే దుస్థితి ఉండేది' అని గుర్తుచేశారు. 'రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి కడుపునిండా నీరందించాలని కంకణం కట్టుకున్నది. రాజకీయాలు, సిద్ధాంతాలు ఏవైనా ఉండొచ్చు.. కానీ సిద్ధాంతాలు మరచిపోయిన వ్యక్తి మనిషే కాదు' అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

నీళ్ల జంక్షన్‌లా మిడ్‌ మానేరు

మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు తరలించేందుకు ప్రాజెక్టులను గత ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని ఈటల స్పష్టంచేశారు. అప్పటి సర్కార్‌ జల అనుకూల విధానాలతో 29 టీఎంసీల కెపాసిటీ కలిగిన మిడ్‌ మానేర్‌ను నీళ్లతో నిండుకుండలా మార్చిందని చెప్పారు. 'రైల్వే జంక్షన్‌కు కాజీపేట ఎలాంటిదో ఉత్తర తెలంగాణకు మిడ్‌ మానేర్‌ నీళ్ల జంక్షన్‌’ అని వ్యాఖ్యానించారు. పోచంపాడులో 90 టీఎంసీలు, ఎల్‌ఎండీలో 24 టీఎంసీల నీళ్లున్నా గతంలో హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఒక్క పంటకు కూడా నీరందేది కాదని స్పష్టంచేశారు. 'కాళేశ్వరం లింక్‌ పూర్తయిన తర్వాతే హుజూరాబాద్‌తో పాటు పూర్వపు కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాలతో పాటు నల్లగొండ జిల్లాలోని కొంత భాగానికి నీరంతరాయంగా నీరందుతుండటంతో రెండు పంటలు పండుతున్నది వాస్తవం కాదా? దీనిని ఎవరైనా కాదనగలరా?' అని సూటిగా ప్రశ్నించారు.

మరమ్మతులపై సర్కార్‌ నిర్లక్ష్యం

కాంగ్రెస్‌ నాయకులు కాళేశ్వరం కట్టడమే తప్పన్నట్టుగా మాట్లాడటం దుర్మార్గమని ఈటల నిప్పులు చెరిగారు. కాళేశ్వరం పరిధిలోని ప్రాజెక్టులను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని నిలదీశారు. ఎల్‌ నినో కారణంగా భయంకరమైన కరువు వస్తుందని తెలిసి కూడా నిర్లక్ష్యం చేయడం తగదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజకీయాల కోసం రైతులను బలిపెట్టవద్దని హితవుపలికారు. ఎస్సారెస్పీ కాలువల కింద, బోర్లు, బావులు లేకుండా పూర్తిస్థాయిలో సాగు చేయడం సాధ్యంకాదని స్పష్టంచేశారు. ఇది నీళ్లు, వ్యవసాయంపై అవగాహన ఉన్నవారికి మాత్రమే తెలుస్తుందని పరోక్షంగా సీఎంపై సెటైర్లు విసిరారు. రైతుల జీవితాలతో ఆడుకుంటే ఊరుకొనేది లేదని హెచ్చరించారు.

ఊర్లళ్ల భగీరథ నీళ్లే తాగుతున్నరు

మిషన్‌ భగీరథ వచ్చిన తర్వాత ఊర్లల్లో ప్రజలు బోర్లు..బావుల నీళ్లు తాగడం లేదని ఈటల స్పష్టంచేశారు. 'ఎక్కడో ఎల్‌ఎండీల బటన్‌ ఆన్‌చేస్తే వందల ఊర్లకు తాగునీరు అందే పరిస్థితి వచ్చింది..ఇది నిజం' అని తేల్చిచెప్పారు. ప్రజలకు గోదావరి, లేదంటే కృష్ణా నీళ్లు అవసరమని, రేవంత్‌రెడ్డి ఈ సోయి ఉంచుకొని ప్రజలకు నీరందించాలని హితవు పలికారు.

నాకు తెలంగాణ ఫస్ట్‌..పార్టీ నెక్స్ట్‌

'నేను పక్కా ఈ మట్టిబిడ్డను.. నాకు తెలంగాణ ఫస్ట్‌.. పార్టీ నెక్స్‌.. పర్సనల్‌ లాస్ట్‌’ అని ఈటల నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. తాను ఎవరో పలికిస్తే వ్యక్తిని కాదని, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ చదివేవాడిని కాదు.. స్వయంప్రకాశకులం.. సొంత అవగాహన ఉన్నవాళ్లం' అని స్పష్టంచేశారు. 'ఈ అవగాహన నాపై ఆరోపణలు చేస్తున్న నీచులకు ఉండాలె' అని తూర్పారబట్టారు. తప్పుగా మాట్లాడితే అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తానని, అయినా వినకుంటే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోనని.. చీల్చిచెండాడుతానని తీవ్రస్వరంతో హెచ్చరించారు.

కన్నెపల్లి వద్ద మోటర్లు మునిగినా నీళ్లు తీసుకోవచ్చు

కన్నెపల్లి పంప్‌హౌస్‌లు లోలెవల్‌లో ఉంటాయని ఈటల చెప్పారు. 'ప్రాణహిత, గోదావరి పారేటప్పుడు నీళ్లు వంపు తిరుగుతయ్‌.. ఆ పాయింటే కన్నెపల్లి పంప్‌హౌస్‌’ అని స్పష్టంచేశారు. 'అక్కడ మోటర్ల ఫుట్‌బాల్‌ మునిగినా చాలు.. ఈ రోజు అక్కడ 90 వేల క్యూసెక్కుల నీళ్లు వస్తున్నయ్‌.. ఏడు నుంచి ఎనిమిది టీఎంసీల నీళ్లు పోతున్నయ్‌.. మనకు కావాల్సింది రెండు టీఎంసీలే కదా? ఎందుకు తీసుకుంటలేవ్‌?' అని ప్రశ్నించారు. 'ఎన్డీఎస్‌ఏ చెప్పిన దాంతో విభేదిస్తలేను.. ప్రాజెక్టుల్లో నీళ్లు నిల్వ చేయాలని అనడంలేదు.. కానీ పారుతున్న నీటినే ఎత్తిపోయాలె' అని డిమాండ్‌ చేశారు.

కాళేశ్వరం లింక్‌ పూర్తయిన తర్వాతే హుజూరాబాద్‌తో పాటు పూర్వ కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాలు, నల్లగొండ జిల్లాలోని కొంత భాగానికి నీరంతరాయంగా నీరందుతున్నది.. రెండు పంటలు పండుతున్నయి. ఇది వాస్తవం కాదా? దీన్ని ఎవరైనా కాదనగలరా?

– ఈటల రాజేందర్‌

నేను పక్కా ఈ మట్టిబిడ్డను.నాకు తెలంగాణ ఫస్ట్‌.. పార్టీ నెక్స్‌ ..పర్సనల్‌ లాస్ట్‌. నేను ఎవరో పలికిస్తే పలికే వ్యక్తిని కాదు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ చదివేవాడిని కాదు.. స్వయంప్రకాశకులం.. సొంత అవగాహన ఉన్నవాళ్లం.

– ఈటల రాజేందర్‌

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana