తాజావార్తలు
కామెడీ ఎప్పుడూ బోర్ కొట్టదు

హాస్య చిత్రాల పట్ల ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పుకనిపిస్తోంది. ఇప్పుడు సెటిల్డ్ కామెడీని ఇష్టపడుతున్నారు. తర్కానికి అందకుండా సాగే వినోదాన్ని తిరస్కరిస్తున్నారు. ఈ అంశాల్ని దృష్టిలో పెట్టుకొని కథల్ని ఎంచుకుంటున్నా' అన్నారు అల్లరి నరేష్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'బంగారు బుల్లోడు'. ఇ.వి.వి.గిరి దర్శకుడు. ఈ నెల 23న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా అల్లరి నరేష్ పాత్రికేయులతో పంచుకున్న సంగతులివి..
'బంగారు బుల్లోడు' చేసే హంగామా ఎలా ఉండబోతుంది?
ఈ సినిమాలో నేను బంగారు ఆభరణాలు తయారుచేసే గోల్డ్‌స్మిత్ పాత్రలో కనిపిస్తాను. ఓ గ్రామీణ బ్యాంకులో బంగారు తాకట్టు విభాగంలో పనిచేస్తూ ఆభరణాల నాణ్యత ఏమిటో నిర్ధారించడం నా పని. ఈ చిత్ర కథ మొత్తం బంగారం చుట్టూ తిరుగుతుంది కాబట్టి 'బంగారు బుల్లోడు' అనే టైటిల్‌ను చక్కగా సరిపోయింది. దాదాపు ముప్పైకిపైగా టైటిల్స్‌ను పరిశీలించి చివరకు కథానుగుణంగా దీనిని ఖరారు చేశాం.
కథాపరంగా ఇందులో ఉన్న కొత్తదనమేమిటి?
గ్రామీణ నేపథ్యంలో హాస్యప్రధాన చిత్రాలు ఈ మధ్య తక్కువైపోయాయి. గత ఐదేళ్లుగా నేను సిటీకేంద్రంగా నడిచే కామెడీ సినిమాల్ని చేశాను. దాంతో ఈ సినిమాలోని పల్లెటూరి నేపథ్యం కొత్తగా అనిపించింది. రాజమండ్రిలో జరిగిన ఓ యథార్థ సంఘటన స్ఫూర్తితో దర్శకుడు గిరి ఈ కథను రాసుకున్నారు. నకిలీ బంగారాన్ని నిజమైన బంగారంగా నమ్మించి బ్యాంకును మోసం చేసిన యువకుడి కథ ఆధారంగా దర్శకుడు ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకున్నాడు.
మీకు స్వతహాగా బంగారం అంటే ఇష్టమేనా?
నేను బంగారం కంటే ప్లాటినమ్‌ను బాగా ఇష్టపడతా(నవ్వుతూ). ఓ గ్రామ్ గోల్డ్ రేటెంతో కూడా నాకు తెలియదు. అవన్నీ లేడీస్ డిపార్ట్‌మెంట్ విషయాలు కాబట్టి నేను సైలెంట్‌గా ఉంటాను.
గోల్డ్‌స్మిత్ పాత్ర కోసం ఎలాంటి కసరత్తులు చేశారు?
పల్లెలకు వెళ్లినప్పుడు బంగారు ఆభరణాలు తయారుచేసేవాళ్లను చూసేవాణ్ణి. వృత్తిపరంగా వారి పనితీరు ఎలా ఉంటుందో ఎప్పుడూ గమనించలేదు. ఈ సినిమాలో తనికెళ్ల భరణిగారు నాకు తాత పాత్రలో కనిపిస్తారు. షూటింగ్ టైమ్‌లో ఆయన 'గోల్డ్‌స్మిత్ పాత్ర కోసం ఆ విద్య గురించి కొంచెం తెలుసుకుంటే మంచిది' అని సూచించారు. దాంతో ఆ వృత్తినిపుణుడి సమక్షంలో బంగారానికి మెరుగులుదిద్దడం, అతుకులు వేయడం వంటి పనుల్ని నేర్చుకున్నా. తెలుగులో హీరో పూర్తిస్థాయి గోల్డ్‌స్మిత్ పాత్రలో కనిపించే తొలి సినిమా ఇదే అనుకుంటున్నా.
ప్రస్తుతం వినోదరంగంలో ఓటీటీల ప్రాభవం ఎక్కువగా కనిపిస్తోంది. మీరు ఆ వేదికల్లో నటించే అవకాశం ఉందా?
మంచి కథ వస్తే తప్పకుండా ఓటీటీలో సిరీస్, సినిమాలు చేస్తాను. లాక్‌డౌన్ కారణంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ప్రజలకు బాగా చేరువయ్యాయి. మల్టీస్టారర్స్, ఓటీటీ చిత్రాలు చేసే విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. కథ నచ్చితే మల్టీస్టారర్ సినిమాలు మరిన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నా.
'బంగారు బుల్లోడు'వంటి కామెడీ ఎంటర్‌టైనర్ చేస్తూనే మరోవైపు 'నాంది' వంటి సీరియస్ సినిమాలో నటించారు. ఈ వైవిధ్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
కెరీర్ ఆరంభంలో 'నేను' 'ప్రాణం' 'గమ్యం' వంటి సినిమాలతో ప్రయోగాలు చేశాను. అప్పటికి నటుడిగా నాకు ఎలాంటి ఇమేజ్ లేదు. 'గమ్యం' తర్వాత 'నరేష్ నవ్వించడమే కాదు..ఏడిపిస్తాడు కూడా' అని ప్రేక్షకులు నమ్మడం మొదలుపెట్టారు. 'గమ్యం' 'మహర్షి' వంటి సినిమాల్ని చూసి 'నరేష్ పర్‌ఫార్మెన్స్ బాగుంది' అని మెచ్చుకున్నారు. అందుకే కామెడీ సినిమాలతో పాటు మధ్యలో సీరియస్ కథల్ని ఎంచుకుంటూ కెరీర్‌ను బ్యాలెన్స్ చేస్తున్నా.
కథల ఎంపికలో మీ దృక్పథంలో ఏమైనా మార్పులొచ్చాయా?
కామెడీ కథల్లో కూడా కొత్తదనం ఉండాలని కోరుకుంటున్నా. రొటీన్ వినోదం కాకుండా హిందీ 'అంధాదున్' వంటి డార్క్‌హ్యూమర్ సబ్జెక్ట్స్ కూడా చేయాలని ఉంది. ఏడాదికి మూడు సినిమాలు చేస్తే అందులో ఒకటి తప్పకుండా సీరియస్ సబ్జెక్ట్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నా. సీరియస్ పాత్రలు నటుడిగా పేరు తెస్తాయి కానీ ఆ సినిమాల్ని పదేపదే చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించరు. అదే కామెడీ సినిమాలు తీసుకుంటే ఎప్పుడూ బోర్ కొటవు. ఏ సందర్భంలో అయినా ప్రేక్షకులు వినోదాన్ని ఆస్వాదిస్తారు.