Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాంగ్రెస్‌ పాలనలో రైతుల అరిగోస

కాంగ్రెస్‌ పాలనలో రైతుల అరిగోస

  • సంగమేశ్వర-బసవేశ్వర ఎత్తిపోతల ఎందుకు ఆపేశారు
  • రైతులతో కలిసి ఎత్తిపోతల కోసం ఉద్యమిస్తాం
  • మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
  • సర్‌, బీఆర్‌ఎస్‌ సభ్యత్వాలపై క్యాడర్‌ ప్రత్యేక దృష్టి పెట్టాలి
  • ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన మాజీ మంత్రి
  • సంగారెడ్డి జిల్లా అందోల్‌ మండలం సంగుపేటలో సర్‌,బీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదుపై అవగాహన

సంగారెడ్డి జూలై 8(నమస్తే తెలంగాణ), అందోల్‌: "సింగూరు కాల్వల మరమ్మతుల పేరుతో పంటలకు నీళ్లు ఇవ్వక రైతులు అరిగోస పడుతున్నారని, కాల్వలకు మరమ్మతులు ఇంకెన్నాళ్లు చేస్తారు..? పంటలు నష్టపోతున్న రైతులను పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి లేదా..? సింగూర్‌ ప్రాజెక్ట్‌ కింద వెంటనే క్రాప్‌ హాలిడే ప్రకటించి రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ ఇవ్వాలి" అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. బుధవారం సంగారెడ్డి జిల్లా అందోల్‌ మండలంలోని సంగుపేట లక్ష్మీనరసింహగార్డెన్‌లో మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ అధ్యక్షతన ఓటరు జాబితా సవరణ, బీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదుపై నియోజకవర్గ స్థాయి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సర్‌పై బీఎల్‌ఏలు, పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫారాలు నింపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఏ చిన్నపొరపాటు జరిగినా ఓటు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ సభ్యత్వాలను సైతం సీరియస్‌గా తీసుకోవాలన్నారు. సింగూర్‌ ప్రాజెక్టు కింద ఎప్పుడు చూసినా పచ్చని పంటలతో కళకళలాడేదని, ఇప్పుడు దారిపొడవునా పచ్చదనమే కనిపించడం లేదన్నారు. కాల్వల పనులు పూర్తి నాణ్యతతో చేయాలని, లేదంటే రైతుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందన్నారు.

రైతుల ఉసురుపోసుకుంటున్న ప్రభుత్వం

రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం, సీఎం రెవంత్‌రెడ్డి రైతుల ఉసురు పోసుకుంటున్నారని హరీశ్‌రావు అన్నారు. రైతుబంధు వేయక, రైతుబీమా ఇవ్వక, ఎరువులు, విత్తనాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్‌ తీసుకువచ్చిన కేసీఆర్‌కిట్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌,కల్యాణలక్ష్మి, గొర్రెల పంపిణీ, దళితబంధు, చేపల పంపిణీ పథకాలు బంద్‌ చేసినట్లు గుర్తుచేశారు. వ్యవసాయం చేయాలంటే భయపడే స్థాయికి రాష్ర్టాన్ని తీసుకువచ్చారన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు పంట రుణ మాఫీచేస్తాం, రైతుబీమా ఇస్తాం, ఎంతపంటనైనా కొంటామంటూ బీరాలు పలికి ఇప్పుడు కేంద్రం ఎంత తీసుకుంటామంటే అంతే కొంటామనడం ఎంతవరకు సమంజసమన్నారు. రూ. రెండు లక్షల కంటే ఎక్కువ బ్యాంకు రుణం ఉన్న రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే ఉన్నదని సీఎం, మంత్రులు చెప్పిన మాటలకు పొంతన లేదన్నారు. రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలకు గ్యారెంటీ లేదని ఎద్దేవాచేశారు.

ఎత్తిపోతల ఎందుకు ఆపేశారు

సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, అందోల్‌, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌ నియోజకవర్గాలో లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేద్దామనే లక్ష్యంతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంగమేశ్వర-బసవేశ్వర ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపథకాన్ని ఆపేసిందని హరీశ్‌రావు విమర్శించారు. ఈ పథకం పూర్తయితే నాలుగు నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా పచ్చని పంటపొలాలు దర్శనమిస్తాయన్నారు. ఇంతటి గొప్ప పథకాన్ని ఎందుకు పక్కన పెట్టారో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులు సమాధానం చెప్పాలన్నారు. సంగమేశ్వర-బసవేశ్వర పథకం పనులు వెంటనే ప్రారంభించాలని, అందుకోసం ఎంతటి ఉద్యమానికైనా సిద్ధమన్నారు.బసవేశ్వర-సంగమేశ్వర ఎత్తిపోతల సాధనకు ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు.

వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే

వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, అప్పుడు ఎవరినీ వదలమని అన్ని లెక్కలు రాసిపెట్టాలని కార్యకర్తలకు హరీశ్‌రావు సూచించారు. గత ప్రభుత్వంలో కేవలం ప్రజల సంక్షేమం, ప్రభుత్వ పథకాల అమలుపైనే పూర్తి దృష్టిపెట్టామని గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో పనిచేసిన కాంట్రాక్టర్లకు కాంగ్రెస్‌ నాయకులు బిల్లులు ఇవ్వ నివ్వండలేదని, సర్పంచ్‌లను పనులు చేయనివ్వడంలేదన్నారు. అక్రమ కేసులు పెడుతున్నారని పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు హరీశ్‌రావు దృష్టికి తీసుకువచ్చారు.

అక్రమ కేసులు పెట్టిన పోలీసులు, పనులు చేయని అధికారులు, ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్‌ నాయకుల వివరాలు రాసిపెట్టుకోవాలని పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపారు. అందోల్‌ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ కాదు..కాదు కాబోయే ఎమ్మెల్యే అనడంతో పార్టీ క్యాడర్‌ చప్పట్లు కొట్టారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ సర్కార్‌ కొలువుదీరి కేసీఆర్‌ సీఎం కావడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి బాలమల్లు, నియోజకవర్గం ఇన్‌చార్జి పట్నం మాణిక్యం మాట్లాడుతూ బీఎల్‌ఏలు, పార్టీ క్యాడర్‌ సర్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలన్నారు. అర్హులైన ఏ ఒక్కరు ఓటు హక్కు కోల్పోకుండా చూడాలన్నారు. దరఖాస్తులు నింపే ముందు క్షుణ్ణంగా అన్ని విషయాలు పరిశీలించాలన్నారు.

బీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక

మాజీ మంత్రి హరీశ్‌రావు సమక్షంలో మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ ఆధ్వర్యంలో వట్‌పల్లి మండలం గొరెకల్‌కు చెందిన పలు పార్టీల నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, మాజీ ఎంపీపీలు రామాగౌడ్‌, నారాయణ, బాలయ్య, కౌన్సిలర్లు శివశేఖర్‌, నాగరత్నంగౌడ్‌, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

' సర్‌’ పకడ్బందీగా నిర్వహించాలి

సర్‌ పకడ్బందీగా నిర్వహించాలి. బీఎల్‌ఏలు, బీఆర్‌ఎస్‌ క్యాడర్‌ సర్‌ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి. అర్హులైన ఏ ఒక్కరు ఓటు హక్కు కోల్పోకుండా చూడాలి. దరఖాస్తులు నింపే ముందు క్షుణ్ణంగా అన్ని విషయాలు పరిశీలించాలి. బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు సర్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలి.

-చింతా ప్రభాకర్‌, ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు

బీఎల్‌ఏలు జాగ్రత్తగా ఉండాలి

ప్రతి ఓటు ముఖ్యమే. బీఎల్‌ఏలు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పూర్తి అవగాహన కలిగి ఉండాలి. దరఖాస్తు ఫారాలు నింపే సమయంలో ఏమా త్రం అజాగ్రత్తగా ఉండొద్దు. ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. దరఖాస్తుదారుడి ఆధార్‌లో ఓటరు పూర్తివివరాలు సరిచూసుకోవాలి. అన్ని సరిగ్గా ఉన్న తర్వాతనే ఫామ్‌ నింపి సంతకాలు తీసుకోవాలి. చాలా మంది ఓటర్లకు దీనిపై సరిగ్గా అవగాహన లేదు.

-చంటి క్రాంతికిరణ్‌,మాజీ ఎమ్మెల్యే

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana