Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాంగ్రెస్‌ పాలనలో రైతుల గోస

కాంగ్రెస్‌ పాలనలో రైతుల గోస

  • ఇది రైతు సర్కారు కాదు దోపిడీ చేస్తున్న సర్కారు
  • ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి
  • యూరియా, ఎరువులను సిద్ధంగా ఉంచాలి
  • మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌, మే 22 : రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్‌ పాలనలో రైతులు అరి గోస పడుతున్నారని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ ఆవేదన చెందారు. ఇది రైతు సర్కారు కాదని, రైతులను దోపిడీ చేస్తున్న, రైతు నోట్లో మట్టికొడుతున్న సర్కారు అని ధ్వజమెత్తారు. ఎన్నడూ లేనివిధంగా నాణ్యమైన ధాన్యాన్ని సైతం బీ గ్రేడ్‌ కింద చూపి క్వింటాలుకు దాదాపు 20 రూపాయలు ఆర్‌ఆర్‌ (రేవంత్‌రెడ్డి) టాక్స్‌ కట్టిస్తున్నారని విమర్శించారు. రోహిణి కార్తె దగ్గరకు వచ్చిందని, మళ్లీ సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారని, ఇంకెప్పుడు కొనుగోళ్లు పూర్తి చేస్తారని ప్రశ్నించారు. తక్షణమే కొనుగోళ్లు వేగవంతం చేయాలని, లేకపోతే బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు.

ధాన్యం కొనుగోళ్లలో సమస్యలపై శుక్రవారం కరీంనగర్‌ కలెక్టరేట్‌లో కలెక్టర్‌ చిత్రా మిశ్రాను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కొనుగోళ్లలో జాప్యంతో రైతులు పడుతున్న ఇబ్బందులను వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ పాలనలో ధాన్యం, మక్కల కొనుగోళ్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగాయని, వెంటవెంటనే డబ్బులు పడ్డాయని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్‌ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, ఆత్మహత్యలు చేసుకునే దుస్థితిని ప్రభుత్వం తీసుకొస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. వడ్లు యాభై రోజుల నుంచి కల్లాలలో ఉన్నా ఇప్పటి వరకు 40 శాతం కూడా కొనలేదని మండిపడ్డారు.

వ్యవసాయ శాఖ మంత్రి 50 శాతం ధాన్యం కొన్నామని చెబుతుంటే, సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం 80 శాతం కొన్నామంటున్నారని ఎద్దేవా చేశారు. వాస్తవానికి కొనుగోలు చేసింది 40 శాతం మాత్రమేనని చెప్పారు. రైస్‌ మిల్లర్లతో కుమ్మక్కైన ప్రభుత్వం వందల కోట్ల సాం చేస్తున్నదని ఆరోపించారు. ఇప్పటికే బస్తాకు 8 నుంచి 10 కిలోలు కటింగ్‌లు పెడుతున్నారని, మళ్లీ వర్షాలు వచ్చి ధాన్యం తడిస్తే మరో 10 కిలోలు నష్టపోవాల్సి వస్తుందన్నారు. గన్నీ సంచులు కొనుకొనే దౌర్భాగ్య స్థితిలో రైతులు ఉన్నారని వాపోయారు. లారీల డ్రైవర్లకు బస్తాకు రూ.2 నుంచి రూ.3 ఇస్తేనే లారీలు వస్తున్నాయని ఆరోపించారు. మక కొనుగోళ్లు కూడా సజావుగా జరగడం లేదని, నెల కిత్రం కొనుగోలు చేసిన మక్కలకు ఇప్పటి వరకు డబ్బులు రాలేదన్నారు.

ఎద్దు ఏడ్చిన ఇవుసం, రైతు ఏడ్చిన రాజ్యం గంగలో కలిసిపోతుందని, కాంగ్రెస్‌ కూడా పోవడం ఖాయమన్నారు. యూరియా బఫర్‌ స్టాక్‌ లేదని వ్యవసాయ శాఖ మంత్రి చెబుతున్నారని, ఎరువులు కూడా సరిపడా అందే పరిస్థితి కనిపించడం లేదన్నారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా యూరియా, ఎరువులు, జీలుగ, జనుము విత్తనాలు సరిపోయినన్ని అందుబాటులో ఉంచాలని కోరారు. ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరగాలని కలెక్టర్‌ను కలిశామని, పది రోజుల్లో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్లు ఏనుగు రవీందర్‌ రెడ్డి, పొన్నం అనిల్‌, చొప్పదండి నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana