Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాంటా రందితో కాటికి..!

కాంటా రందితో కాటికి..!

  • నెల రోజులుగా కొనుగోలు కేంద్రంలో ధాన్యం వద్దే పడిగాపులు
  • ఇన్ని రోజులైనా ధాన్యం కొంటలేరని నిత్యం తోటి రైతులతో మనోవేదన
  • 4 లక్షల అప్పు ఎలా కట్టాలని బెంగ..

ప్రభుత్వం ధాన్యం కొంటదేమోనని నెలరోజులుగా పడిగాపులు పడిన రైతు వెంకటాపురం శంకరయ్య వడ్లకుప్ప వద్దే కన్నుమూశాడు. శుక్రవారం మెదక్‌ జిల్లా చిన్నఘనపూర్‌ ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే ఆయన తనువు చాలించాడు.

కొల్చారం, మే 22: రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతన్నల మరణాలు ఆగడం లేదు. కాంటా ఎప్పుడు పెడుతరో తెలియకపోవడం.. తరుగు పేరిట దోచుకోవడం.. పెట్టుబడికి చేసిన అప్పులు కట్టేదెలా అనే మనోవేదన ఒకవైపు.. కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు లేకపోవడం ఎండలు దంచికొడుతుండటం వెరసి అన్నదాతల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. శుక్రవారం మెదక్‌ జిల్లా కొల్చారం మండలం చిన్నఘనపూర్‌ గ్రామానికి చెందిన రైతు వెంకటాపురం శంకరయ్య(54) శుక్రవారం ఉదయం పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న తన వడ్ల కుప్ప వద్దకు వెళ్లాడు. నెల రోజులుగా కేంద్రం నిర్వాహకుల వెంట పడుతున్నా తన వడ్లు తూకం వేస్తలేరని బాధపడుతూ కూర్చున్నాడు.

ఈ క్రమంలో ఉన్నట్టుండి ముందుకు తూళి పడి స్పృహ తప్పాడు. చుట్టూ ఉన్న తోటి రైతులు ఏమైందోనని శంకరయ్యను లేపి చూసే సరికి తనువు చాలించాడు. శంకరయ్య తనకున్న రెండెకరాలు, మరో ఎకరం కౌలుకు తీసుకుని వరి సాగుచేశాడు. నెల క్రితం ధాన్యం నూర్పిడి చేసి కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చాడు. సుమారు 200 పైచిలుకు బస్తాల ధాన్యం నెల రోజులుగా ఆరబెడుతూ పడిగాపులు కాస్తున్నాడు. ధాన్యం తూకం వేయాలని కొనుగోలు కేంద్రం నిర్వాహకులను అడిగితే, రేపు పెడ్తామంటూ ప్రతి రోజూ దాటవేస్తూ వచ్చారు.

చివరకు బెంగతో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే కుప్పకూలి రైతు వెంకటాపురం శంకరయ్య మరణించాడు. శంకరయ్యకు భార్య లక్ష్మి, ఇద్దరు కూతుళ్లు విజయ, మహేశ్వరి, కుమారుడు ఉన్నారు. కూతుళ్ల వివాహానికి, పంట పెట్టుబడికి చేసిన రూ.4 లక్షల అప్పు ఎలా తీర్చాలా అని రైతు శంకరయ్య తనలో తాను మదనపడుతూ ఉండేవాడు. ఈ పంట అమ్మితే కొంత అప్పు తీర్చొచ్చని దగ్గరివాళ్లతో చెబుతుండేవాడు. సకాలంలో తూకం జరిగి ఉంటే శంకరయ్య ప్రాణాలతో ఉండేవాడని గ్రామస్తులు ఆగ్రహం పేర్కొన్నారు. శంకరయ్య కుటుంబానికి రాష్ట్ర సర్కారే న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana