Tuesday, 03 Aug, 8.37 pm నమస్తే తెలంగాణ

Breaking Telangana
కరీంనగర్‌లో మాస్క్‌ నిబంధన తప్పనిసరి.. ఉల్లంఘనదారులకు రూ.వెయ్యి జరిమానా

కరీంనగర్‌ : కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో కరీంనగర్‌ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కొవిడ్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయనున్న యంత్రాంగం బుధవారం నుండి ఏవరైనా ఫేస్‌ మాస్క్‌ లేకుండా కనిపిస్తే జరిమానా విధించనుంది. అదేవిధంగా కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించి సమావేశాలు, ఫంక్షన్లు నిర్వహిస్తే అధికారులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. సాధారణ తనిఖీలకు తోడు ర్యాండమ్‌ టెస్టులు నిర్వహించనున్నట్లు కరీంనగర్‌ మార్కెట్‌లో బుధవారం నుంచి ఈ డ్రైవ్‌ ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు.

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించి రాజకీయ పార్టీలు, నాయకులు ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తే అధికారులు కఠిన చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, సీపీ వి. సత్యనారాయణ తెలిపారు. ప్రాణాంతక వైరస్‌ నుంచి రక్షించుకునేందుకు ప్రజలు ఫేస్‌ మాస్కులు ధరించడం, తరచుగా చేతులను శానిటైజ్‌ చేసుకోవడం, భౌతికదూరం వంటి చర్యలను పాటించాల్సిందిగా కలెక్టర్‌ కోరారు. ఇప్పటికే 85 శాతం మంది ప్రజలు తమ మొదటి డోస్‌ పొందినప్పటికీ వైరస్‌ వ్యాప్తి నివారణకు కొవిడ్‌ నిబంధనలు పాటించాల్సిందిగా తెలిపారు. ఫేస్‌ మాస్కులు, భౌతికదూరం పాటించనివారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని కలెక్టర్‌ హెచ్చరించారు.

గడిచిన పది రోజుల్లో కరోనా పరీక్షలను రెట్టింపు చేసినట్లు చెప్పారు. అంతకుక్రితం 5 వేలుగా ఉన్న కరోనా టెస్టుల సంఖ్యను 8 వేలకు పెంచినట్లు వెల్లడించారు. పాజిటివిటి రేటు తక్కువగా ఉన్నప్పటికీ వైరస్‌ వ్యాప్తి నివారణకు ముందస్తు జాగ్రత్త చర్యలు అవసరమన్నారు. జులై 1 నుండి ఆగస్టు 1 వరకు 2.14 లక్షల టెస్టులు నిర్వహించగా వీరిలో కేవలం 1.7 శాతం మందికి మాత్రమే వైరస్‌ పాజిటివ్‌గా తేలిందన్నారు. కేసులు ఎక్కువగా నమోదైన గంగాధర, కొత్తపల్లి, హుజూరాబాద్‌, సైదాపూర్‌, చిగురుమామిడి వంటి ప్రాంతాల్లో ఐసోలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాల్లో ఇంతవరకు 8.35 కరోనా టెస్టులు నిర్వహించగా వీటిలో 60 వేలు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. వీరిలో 97 శాతం మంది కోలుకున్నారు.కాగా ప్రస్తుతం 2,400 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలిపారు.

సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ.. కొవిడ్‌ నిబంధనల పాటింపుకు 50 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తీరు మార్చుకోని వ్యక్తులను సంబంధిత సెక్షన్ల కింద బుక్‌ చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు. 10 రోజుల పరిస్థితులను తిరిగి సమీక్షించనున్నట్లు వెల్లడించారు. మొబైల్‌ టెస్టింగ్‌ వెహికల్స్‌ ద్వారా ర్యాండమ్‌ చెకింగ్స్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. హుజూరాబాద్‌లో రాజకీయ పార్టీలు ర్యాలీల సమయంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana
Top