Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కష్టార్జితం కాంగ్రెస్‌ కబ్జా.. నిషేధిత ఆస్తులు 50వేల ఎకరాలు

కష్టార్జితం కాంగ్రెస్‌ కబ్జా.. నిషేధిత ఆస్తులు 50వేల ఎకరాలు

  • పటాన్‌చెరు సభలో మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్‌
  • పిచ్చోడి చేతిలో రాయిలా రేవంత్‌ పాలన
  • పేదలను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆగ్రహం
  • 22ఏ బాధితులకు భరోసా కల్పించిన బీఆర్‌ఎస్‌
  • కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం.. వంటావార్పు చేస్తాం

పటాన్‌చెరు నియోజకర్గంలో ప్రజల కష్టార్జితాన్ని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కబ్జా చేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న 50,565 ఎకరాలను తొలగించకపోతే కలెక్టరేట్‌ను ముట్టడించి అక్కడే వంటా వార్పు చేస్తామని ఆయన హెచ్చరించారు. పటాన్‌చెరులో 50వేల ఎకరాలకు పైచిలుకు భూములు, లక్ష ఇండ్లను 22ఏ జాబితాలో పెట్టిన సర్కార్‌.. పేద, మధ్యతరగతి కుటుంబాలను మానసిక క్షోభకు గురిచేస్తోందని హరీశ్‌ మండిపడ్డారు. పటాన్‌చెరు పట్టణంలోని జీఎంఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన 22ఏ భూబాధితుల నిరసన సభకు హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. 22ఏ జాబితాలో భూములు ఉన్న బాధితుల కన్నీళ్లు చూస్తుంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థమవుతోందన్నారు.

– పటాన్‌చెరు టౌన్‌, ఆగస్టు 29

రాష్ట్రముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా తయారైందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. 1980లో లే అవుట్‌ చేసి 46 ఏళ్లుగా నివసిస్తుంటే ఇప్పడు వాటిని నిషేధిత జాబితాలో పెట్టి పిల్లల పెళ్లిళ్లు, చదువులకు ఆటంకం కలిగిస్తున్నారని, బ్యాంక్‌లోన్‌లు రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. పైసా పైసా కూడబెట్టుకుని ఇల్లు కట్టుకుంటే రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో పెట్టి మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హుడా పర్మిషన్లు, మున్సిపల్‌ పర్మిషన్లు, కరెంటు, నల్లా కనెక్షన్లు ఇచ్చి ప్రాపర్టీ టాక్స్‌లు వసూలు చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు మీ ఆస్తులు 22ఏలో ఉన్నాయని ఇళ్లను కూల్చడం దుర్మార్గమన్నారు. పటాన్‌చెరు పరిధిలోని ఓ ఎమ్మార్వో ఏకంగా 2 కోట్లు లంచం అడిగాడని, హైకోర్టు అక్షింతలు వేసినా పట్టించుకోకుండా ఇల్లు కూలగొట్టి తనను రోడ్డున పడేశారని ఓ బాధితుడు కన్నీరు మున్నీరుగా చెబుతుంటే రేవంత్‌ రెడ్డికి చీమ కుట్టినట్లు కూడా లేదా అని హరీశ్‌రావు ప్రశ్నించారు.

వేల ఎకరాలు నిషేధిత జాబితాలో..

గుమ్మడిదలలో 12,430 ఎకరాలు, అమీన్‌పూర్‌లో 3,266 ఎకరాలు, రామచంద్రాపురంలో 8,360 ఎకరాలు, పటాన్‌చెరులో 12,593 ఎకరాలు, జిన్నారంలో 13,916 ఎకరాల భూములు నిషేధిత జాబితాలో పెట్టారని తెలిపారు. వాటికి సంబంధించిన భూ వివరాలను బాధితులు.. ఎమ్మెల్యే హరీశ్‌రావుకు చూపించారు. పటాన్‌చెరు అంటేనే మధ్యతరగతి, పేద ప్రజలు, చిరుద్యోగుల ఉండే ప్రాంతం అని అన్నారు. ఏ పాపం తెలియని వీరి మీద కాంగ్రెస్‌ ఎందుకు ఇంత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ప్రశ్నించారు. భూములు నిషేధిత జాబితాలో పెడితే వారికి రైతుబంధు, రైతుబీమా రాదన్నారు.

ఈ దుర్మార్గం కేవలం పటాన్‌చెరుకు మాత్రమే పరిమితం కాలేదని జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, కత్బుల్లాపూర్‌, మలక్‌పేట, ఉప్పల్‌ ఇలా హైదరాబాద్‌ చుట్టుపక్కల ఏ ప్రాంతానికి వెళ్లినా.. లక్షల ఆస్తులు 22ఏ జాబితాలో పెట్టారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇండ్లు 22ఏ జాబితా నుంచి తొలగించినట్లుగానే ప్రజలందరి భూములను తొలగించాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

పొంగులేటిని బర్తరఫ్‌ చేయాలి..

మంత్రి పొంగులేటి తప్పు చేస్తే ప్రజలు ఎందుకు శిక్షను అనుభవించాలని అన్నారు. 22ఏ దందాతో మీకు సంబంధం లేకపోతే వెంటనే పొంగులేటిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. అధికారులే పొరపాటు చేస్తే వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. జీవో 58, 59 కింద ఒక్క పటాన్‌ చెరులో 9వేల మందికి పైగా పేదలకు ఇండ్ల పట్టాలు ఇచ్చి రూపాయి ఖర్చు లేకుండా వాళ్లను కేసీఆర్‌ ఓనర్లను చేశారని అన్నారు. సూర్యుని చుట్టూ భూమి తిరిగినట్లు రేవంత్‌ రెడ్డి కేవలం భూముల చుట్టూనే తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజల పక్షాన సంగారెడ్డి కలెక్టర్‌ను హెచ్చరిస్తున్నామని వారం రోజుల్లో 50వేల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని, లేదంటే బాధితులతో కలిసి బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామన్నారు. వంటావార్పు చేసి అక్కడే బైఠాయిస్తామన్నారు.

22ఏను తొలగించాలి : ఎమ్మెల్యే గూడెం

పటాన్‌చెరు నియోజకవర్గంలో 22ఏ నిషేధిత జాబితాలో పెట్టిన 50 వేల ఎకరాలను తక్షణమే తొలగించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో 40 సంవత్సరాల క్రితం నాటి భూములను కూడా ఈ ప్రభుత్వం కావాలనే నిషేధిత జాబితాలో పెట్టిందన్నారు. బాధితులకు బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని, భూములు నిషేధిత జాబితా నుంచి తొలగించే వరకు అండగా ఉండి పోరాటం చేస్తామన్నారు. అనంతరం గూడెం యాదమ్మ, గూడెం కల్పన మహిళానాయకురాళ్లతో కలిసి హరీశ్‌రావుకు రాఖీ కట్టారు.

ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రొళ్ల శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ ఆదర్శ్‌ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు కుమార్‌యాదవ్‌, అంజయ్యయాదవ్‌, అమీన్‌పూర్‌ మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ పాండురంగారెడ్డి, మాజీ వైస్‌ చైర్మన్‌ నర్సింహగౌడ్‌, మాజీ వ్యవసాయ కమిటీ చైర్మన్‌ విజయ్‌కుమార్‌, అమీన్‌పూర్‌ మాజీ ఎంపీపీ దేవానంద్‌, జిన్నారం మున్సిపల్‌ చైర్మన్‌ జనార్దన్‌, మాజీ జెడ్పీటీసీలు గడీల శ్రీకాంత్‌గౌడ్‌, కొలను బాల్‌ రెడ్డి, సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు యాదగిరియాదవ్‌, శ్రీశైలంయాదవ్‌, కొలను రవీందర్‌రెడ్డి నాయకులు.. సోమిరెడ్డి, వెంకటేశంగౌడ్‌, నర్రాభిక్షపతి, గోవర్దన్‌రెడ్డి, శ్రీధర్‌చారి, పృథ్వీరాజ్‌, రాజ్‌కుమార్‌, మేరాజ్‌ఖాన్‌, మోటె శ్రీకాంత్‌యాదవ్‌, కార్యకర్తలు, 22ఏ బాధితులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana