Tuesday, 11 Aug, 3.57 am నమస్తే తెలంగాణ

తాజావార్తలు
కయ్యాలమారి ఏపీ..

  • పిలిచి పీట వేసి అన్నం పెడితే.. కెలికి కయ్యం పెట్టుకుంటున్నారు
  • హక్కులకు లోబడే కృష్ణా, గోదావరిపై ప్రాజెక్టులు
  • ఆ ప్రాజెక్టులన్నీ ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైనవే
  • వాటిపై ఏపీ రాద్ధాంతం.. వంతపాడుతున్న కేంద్రం
  • కేంద్రం వైఖరినీ యావత్‌ దేశానికి తెలియజేస్తాం
  • అపెక్స్‌ వేదికగా తిరుగులేని సమాధానమిస్తాం
  • ఎవరూ నోరెత్తి మాట్లాడలేని పరిస్థితి కల్పిస్తాం
  • సాగునీటి వివక్షకు వ్యతిరేకంగానే స్వరాష్ట్ర ఉద్యమం
  • అన్యాయాన్ని సవరించేందుకే ప్రాజెక్టుల రీడిజైనింగ్‌
  • జల వనరులశాఖ అధికారులతో సమీక్షలో సీఎం
  • కేంద్రం, ఏపీ ప్రభుత్వాల వైఖరిపై కేసీఆర్‌ ఆగ్రహం

'నా అంతట నేనే ఏపీ ప్రభుత్వ పెద్దలను పిలిచి పీటేసి అన్నం పెట్టి మరీ మాట్లాడాను. రెండు రాష్ర్టాల రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించుకుందామని స్నేహ హస్తం అందించాం. బేసిన్లు లేవు.. భేషజాలు లేవు.. అని మన వైఖరిని చాలా స్పష్టంగా చెప్పాం. సహజ సరిహద్దు రాష్ర్టాలు అయినందున స్నేహంగా మెదిలి, అంతిమంగా రైతులకు సాగునీరు అందించే లక్ష్యం సాధించాలని ప్రతిపాదించాం. సముద్రం పాలవుతున్న నీటిని పొలాలకు మళ్లించే కార్యాచరణ అమలు చేద్దామని చెప్పాం. అయినా.. ఏపీ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటున్నది. తెలంగాణ ప్రాజెక్టులపై అర్థంలేని వాదనలు, నిరాధార ఫిర్యాదులు చేస్తున్నది. అపెక్స్‌ కమిటీ భేటీలో ఏపీ ప్రభుత్వం నోరు మూయించేలా సమాధానం చెప్తాం.

- ముఖ్యమంత్రి కేసీఆర్‌

మా నీళ్లు మా హక్కు

'శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసే విషయంలో కూడా కేంద్రం అనవసరంగా అభ్యంతరం పెడుతున్నది. వాస్తవానికి నాగార్జునసాగర్‌ నింపిన తర్వాతనే మిగిలిన ప్రాజెక్టులు నిండాలి. అసలు శ్రీశైలం ప్రాజెక్టు నీటిపారుదల ప్రాజెక్టు కాదు. అది జల విద్యుత్‌ ప్రాజెక్టు. ఇన్ని వాస్తవాలు పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం అభ్యంతరాలు వ్యక్తంచేయడం సమంజసం కాదు. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా తప్పిదమే.

తెలంగాణకు ఉన్న నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. తెలంగాణ ఏర్పడేనాటికే నీటి కేటాయింపులు జరిగి, అనుమతులు పొంది, ఖర్చు కూడా జరిగిన ప్రాజెక్టుల విషయంలో అభ్యంతరాలు వ్యక్తంచేయడం ఏమాత్రం సరికాదు. ఒక రాష్ట్రంగా తెలంగాణకు కూడా హక్కులుంటాయి. తనకున్న హక్కు ప్రకారం ప్రాజెక్టులు నిర్మిస్తున్నది. ఈ విషయంలో రాష్ర్టాల హక్కులను హరించేలా కేంద్రం వ్యవహరించడం తగదు. కేంద్ర వైఖరిని కూడా యావత్‌ దేశానికి తెలిసేలా చేస్తాం.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆంధ్రప్రదేశ్‌కు స్నేహ హస్తం అందిస్తే కెలికి కయ్యాలు పెట్టుకుంటున్నదని, కేంద్రం కూడా వాస్తవాలు తెలుసుకోకుండా వ్యవహరిస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులపై అర్థంపర్థంలేని ఫిర్యాదులు చేస్తే.. కేంద్ర ప్రభుత్వం వాస్తవాలు తెలుసుకోకుండా అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నదని మండిపడ్డారు. త్వరలో జరుగనున్న అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో ప్రాజెక్టుల నిర్మాణాలపై పూర్తి వాస్తవాలు, సంపూర్ణ సమాచారం వెల్లడించి.. ఆంధ్రప్రదేశ్‌, కేంద్ర ప్రభుత్వాల నోరు మూయిస్తామని సీఎం వ్యాఖ్యానించారు. సమర్థ వాదనలతో తెలంగాణ ప్రాజెక్టులపై నోరెత్తి మాట్లాడలేని పరిస్థితిని కల్పిస్తామని స్పష్టంచేశారు. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో అనుసరించాల్సిన వైఖరిని ఖరారు చేసేందుకు సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో సోమవారం జల వనరులశాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల పూర్వాపరాలను సీఎం క్షుణ్ణంగా పరిశీలించారు. కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైఖరిపై చర్చించారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అర్థంపర్థంలేకుండా, నిరాధారమైన ఆరోపణలు చేస్తూ, అనవసర రాద్ధాంతం చేస్తున్నదని అన్నారు. కేంద్రం కూడా తప్పుడు విధానం అవలంబిస్తున్నదని మండిపడ్డా రు. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో గట్టిగా వాదనలు వినిపించాలని నిర్ణయించారు.

ఏపీ ఫిర్యాదులపై సీఎం అసంతృప్తి

తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఏపీప్రభుత్వం ఫిర్యాదులు చేయడంపై సీఎం కేసీఆర్‌ తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 'నా అంతట నేనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పెద్దలను పిలిచి పీటేసి అన్నం పెట్టి మరీ మాట్లాడాను. రెండు రాష్ర్టాల రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించుకుందామని స్నేహహస్తం అందించాం. బేసి న్లు లేవు.. బేషజాలు లేవు.. అని మన వైఖరిని చాలా స్పష్టంగా చెప్పాం. సహజ సరిహద్దు రాష్ర్టాలు అయినందున స్నేహపూర్వకంగా మెదిలి, అంతిమంగా రైతులకు సాగునీరు అందించే లక్ష్యం సాధించాలని ప్రతిపాదించాం. వృథాగా సముద్రం పాలవుతున్న నీటిని రైతుల పొలాలకు మళ్లించే కార్యాచరణ అమలు చేద్దామని చెప్పాం. అయినా సరే.. ఏపీప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటున్నది. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అర్థంలేని వాదనలతో, నిరాధారమైన ఆరోపణలతో ఫిర్యాదు చేస్తున్నది. అపెక్స్‌ కమిటీ సమావేశంలో ఏపీ నోరు మూయించేలా, వారి అర్థరహిత వాదనలను తిప్పికొట్టేలా సమాధానం చెప్తాం. తెలంగాణ ప్రాజెక్టులపై మరోసారి నోరెత్తి మాట్లాడలేని పరిస్థితి ఏపీ ప్రభుత్వానికి కల్పిస్తాం' అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

ఉమ్మడి ఏపీలో మంజూరైన ప్రాజెక్టులే

ఉమ్మడి ఏపీలో మంజూరైన ప్రాజెక్టుల నిర్మాణాన్నే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. 'గోదావరి, కృష్ణా బేసిన్లలో తెలంగాణకు ఉన్న హక్కుల ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. రాష్ట్రం ఏర్పడే నాటికే ఇప్పుడు నిర్మిస్తున్న ప్రాజెక్టు లు మంజూరయ్యా యి. వాటికి నీటికేటాయింపులు జరిగాయి. కేంద్ర జలసంఘం సహా ఇతరసంస్థల నుంచి అనుమతులు వచ్చాయి. దాదాపు రూ.23వేల కోట్ల మేర నిధుల వ్యయం, 31,500 ఎకరాల భూసేకరణ జరిగింది. ఇంత జరిగాక ఇప్పుడు వీటిని కొత్త ప్రాజెక్టులు అనడం అర్థరహి తం, అవివేకం. ఉమ్మడి ఏపీలో మంజూరైనప్పటికీ వాటిని పూర్తిచేయలేదు. పైగా తక్కువ నీటితో ఎక్కువ ఆయకట్టును ప్రతిపాదించారు. దీనివల్ల సాగునీటి అవసరా లు సంపూర్ణంగా తీరవు. చాలా ప్రాజెక్టుల డిజైన్‌ రాష్ట్ర అవసరాలకు తగ్గట్లుగా చేయనందున తెలంగాణ వచ్చిన తర్వాత మనకున్న హక్కులు, అవసరాలు, నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ చేపట్టి నిర్మిస్తున్నాం. దీన్ని తప్పుపట్టడంలో అర్థంలే దు. ఉమ్మడి రాష్ట్రంలో నీటి కేటాయింపులు జరిపి, ప్రతిపాదించిన ప్రాజెక్టులు కట్టడం లేదనే అసంతృప్తితోనే, నీటిపారుదల రం గంలో జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగానే తెలంగాణ ఉద్యమం వచ్చింది' అని సీఎం వివరించారు.

గత అపెక్స్‌లో నిర్ణయానికి భిన్నంగా..

గతంలో జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ మొదటి సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అభ్యంతరం వ్యక్తం చేసిందని, తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రలో చేపట్టిన ముచ్చుమర్రిని ప్రస్తావించిందని సీఎం కేసీఆర్‌ గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో రెండింటినీ కొనసాగించాలని నిర్ణయం జరిగినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ మళ్లీ ఆ అంశాన్ని లేవనెత్తడగం సరికాదని సీఎం పేర్కొన్నారు. అయినప్పటికీ పాలమూరు-రంగారెడ్డి విషయంలో కూడా వాస్తవాలను మరోసారి వివరిస్తామన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్‌ చేసి కాళేశ్వరం, కంతనపల్లి ప్రాజెక్టును రీడిజైన్‌ చేసి సమ్మక్క సాగర్‌, రాజీవ్‌సాగర్‌-ఇందిరాసాగర్‌ రీడిజైన్‌తో సీతారామ ప్రాజెక్టు, దుమ్ముగూడెం ప్రాజెక్టును రీడిజైన్‌ చేసి సీతమ్మసాగర్‌ నిర్మిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. పెన్‌గంగ ప్రాజెక్టులకు 1975 లోనే ఒప్పందం కుదిరి, ట్రిబ్యునల్‌ అవార్డు కూడా పూర్తయిందన్నారు. ఈ ప్రాజెక్టులు ఎప్పుడు మంజూరయ్యాయి? ఏయే అనుమతులు సాధించారు? తెలంగాణ వచ్చే నాటికే ఎంత ఖర్చు చేశారు? ఎంత భూమి సేకరించారు? విడుదల చేసి న జీవోలు, తదితర వాస్తవాలను అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం సందర్భంగా బహిరంగపరిచి, ఫిర్యాదులు చేసినవారికి, సందేహాలు వెలిబుచ్చినవారికి తిరుగులేని సమాధానం చెప్పాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. 'మంచినీటి అవసరాల కోసం వాడే నీటిలో 20 శాతాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ట్రిబ్యునల్‌ చెప్పింది. దాని ప్రకారం తెలంగాణ రాష్ట్రం మంచినీటి కోసం వాడే 110 టీఎంసీల్లో 22 టీఎంసీలను మాత్రమే లెక్కకు తీసుకోవాలి' అని సీఎం కేసీఆర్‌ చెప్పారు.

గోదావరి మిగులులో వెయ్యి టీఎంసీ వాటా

రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణకు దక్కిన నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు. వాస్తవానికి ఇంకా తెలంగాణకు నీటి అవసరం ఉన్నదని తెలిపారు. గోదావరికి తెలంగాణలోనే క్యాచ్‌మెంట్‌ ఏరియా ఎక్కువ ఉన్నదని, నది ఎక్కువగా ప్రవహించేది తెలంగాణలోనేనని, ఇక్కడి అవసరాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో సముద్రంలో కలిసే రెండువేల టీఎంసీల్లో తెలంగాణకు కనీసం వెయ్యి టీఎంసీలు కేటాయించాలని కేంద్రాన్ని కోరా రు. 'సాగునీటి రంగంలో తెలంగాణకు మొదట్నుంచీ అన్యాయం జరిగింది. ఏలేశ్వరం దగ్గర కట్టాల్సిన నాగార్జునసాగర్‌ ప్రాజెక్టును 17 కిలోమీటర్ల దిగువన కట్టడంవల్ల అన్యాయం జరిగింది. సమైక్యఏపీ కారణంగా ఎగువ కృష్ణ, తుంగభద్ర, భీమా ప్రాజెక్టులు పోయా యి. నీటివాటాల కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని సాక్షాత్తు బచావత్‌ ట్రిబ్యునల్‌ పేర్కొన్నది. ఉమ్మడి ఏపీ తన నీటి వాటాను అడిగే సందర్భంలో తెలంగాణను పరిగణనలోకి తీసుకోలేదని స్వయంగా ట్రి బ్యునల్‌ గ్రహించి, తెలంగాణకు ప్రత్యేకంగా నీటిని కేటాయించింది. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన జూరాలతోపాటు నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్‌సాగర్‌లాంటి ప్రాజెక్టులను తెలంగాణ వచ్చాకే పూర్తి చేసుకున్నాం. ఆర్డీఎస్‌ తూములను ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు బాంబులు పెట్టి పేల్చడం వల్ల.. గ్రావిటీ ద్వారా ఎలాంటి ఖర్చులేకుండా తెలంగాణకు రావాల్సిన నీళ్లు రాలేదు. ఆర్డీఎస్‌ ఆయకట్టును స్థిరీకరించడానికి ఎంతో వ్యయం చేసి తుమ్మిళ్ల లిఫ్టు నిర్మించుకోవాల్సి వచ్చింది. ఇలా సాగునీటి రంగం లో అంతులేని అన్యాయం జరిగింది' అని సీఎం కేసీఆర్‌ వివరించారు. సమావేశంలో జల వనరులశాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌, ఓఎస్డీ శ్రీధర్‌రావుదేశ్‌పాండే, ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యే సురేందర్‌, ఈఎన్సీ బీ నాగేందర్‌రావు, డిప్యూటీ ఈఎన్సీ అనిత తదితరులు పాల్గొన్నారు.

రాష్ర్టాల హక్కులు హరించేలా కేంద్ర వైఖరి

తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కేంద్రం వైఖరిని సీఎం కేసీఆర్‌ తప్పుపట్టారు. రాష్ర్టానికి ఉన్న నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని చెప్పా రు. తెలంగాణ ఏర్పడేనాటికే నీటి కేటాయింపులు జరిగి, అనుమతులు పొంది, ఖర్చుకూడా జరిగిన ప్రాజెక్టుల విషయం లో అభ్యంతరాలు వ్యక్తంచేయడం ఏ మాత్రం సరికాదన్నారు. 'శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసేవిషయంలో కూడా కేంద్రం అనవసరంగా అభ్యంతరం పెడుతున్న ది. వాస్తవానికి సాగర్‌ నింపిన తర్వాతే మిగిలిన ప్రాజెక్టులు నిండాలి. అసలు శ్రీశైలం ప్రాజెక్టు నీటిపారుదల ప్రాజెక్టు కాదు. అది జలవిద్యుత్‌ ప్రాజెక్టు. ఇన్ని వాస్తవాలు పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం అభ్యంతరాలు వ్యక్తంచేయడం సమంజసం కాదు. ఒక రాష్ట్రంగా తెలంగాణకు కూడా హక్కులుంటాయి. రాష్ర్టా ల హక్కులను హరించేలా కేంద్రం వ్యవహరించడం తగదు. కేంద్రవైఖరిని కూడా యావత్‌దేశానికి తెలిసేలా చేస్తాం' అని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana
Top