Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేసీఆర్‌పై అభిమానం.. పరిశోధనా గ్రంథం అంకితం

కేసీఆర్‌పై అభిమానం.. పరిశోధనా గ్రంథం అంకితం

  • వృద్ధుల వినికిడి సమస్యలు, జీవన నాణ్యతపై అధ్యయనం
  • వినూత్నంగా గౌరవించిన అలీయావర్‌ జంగ్‌ జాతీయ విద్యార్థి

కొండమల్లేపల్లి, సెప్టెంబర్‌ 25: నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం గుడితండా గ్రామానికి చెందిన ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడు నేనావత్‌ రాంబాబు నాయక్‌ కుమారుడు నేనావత్‌ అరవింద్‌బాబు సికింద్రాబాద్‌లోని అలీ యావర్‌ జంగ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ డిసేబిలిటీస్‌లో ఎమ్మెస్సీ ఆడియోలజీ విద్యనభ్యసిస్తూ వృద్ధుల వినికిడి సమస్యలు, జీవన నాణ్యతపై కీలక అధ్యయనం చేసి తన పీజీ కీలక పరిశోధనా గ్రంథాన్ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అంకితమిచ్చి అభిమానాన్ని చాటుకున్నారు.

వృద్ధుల జీవన ప్రమాణాలపై లోతైన అధ్యయనం, వృద్ధుల వినికిడి పరికరాల వినియోగంతో కలిగే ప్రయోజనాలు, వినియోగదారు అనుభవం, జీవన నాణ్యతకు సంబంధించి ఫలితాల అంచనా అనే సామాజిక ప్రాధాన్యతా అంశంపై పరిశోధన సాగింది. వృద్ధుల్లో వినికిడి లోపం వల్ల కలిగే ఒంటరితనం, మానసిక కుంగుబాటును అధిగమించడంలో ఆధునిక శ్రవణ యంత్రాలు ఏ విధంగా తోడ్పతున్నాయనే అంశాన్ని శాస్త్రీయంగా విశ్లేషించారు.

మెరుగైన వినికిడి ద్వారా వృద్ధుల్లో ఆత్మవిశ్వాసం, కుటుంబంలో క్రియాశీలత పెరుగుతుందని ఈ అధ్యయనం స్పష్టం చేయడమే లక్ష్యమని అరవింద్‌బాబు తెలిపారు. దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం విప్లవాత్మక పథకాలు అమలు చేసి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన నేత కేసీఆర్‌ అని అరవింద్‌బాబు కొనియాడారు. మానవీయ కోణంలో సమాజానికి దిశానిర్దేశం చేసిన ఉద్యమ నేతపై గల కృతజ్ఞతతో, సమాజ హితం కోరే తన విద్యా సంబంధిత తొలి పరిశోధనా గ్రంథాన్ని ఆయనకు అంకితమిచ్చినట్టు పేర్కొన్నారు. ఈ పరిశోధన సమాజంలో వినికిడి సమస్యలతో బాధపడే వృద్ధులకు మేలైన అవగాహన కల్పిస్తుందని అధ్యాపక వర్గం ఆ విద్యార్థిని ప్రశంసించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana