- ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాలు బేఖాతరు
- డిప్యుటేషన్లు, మౌఖిక ఆదేశాలు, స్పెషల్ అటాచ్‌మెంట్లలో ఇష్టారాజ్యం
- జిల్లా స్థాయిలోనే బదిలీ ఆర్డర్ల తయారీ
- స్పౌజ్, మెడికల్ దరఖాస్తుదారుల నిరీక్షణ
హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): ఎక్సైజ్ శాఖలో డిప్యుటేషన్లు, మౌఖిక ఆదేశాలు, స్పెషల్ అటాచ్‌మెంట్ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిబంధనల ప్రకారం కమిషనర్ అనుమతితో మాత్రమే జరగాల్సిన డిప్యుటేషన్లను కొందరు అధికారులు జిల్లా స్థాయిలోనే ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో వేలం పాటలను తలపించేలా రూ.లక్షలు వెచ్చించి కీలక పోస్టింగ్‌లు పొందిన కొందరు ఉన్నతాధికారులు, ఇప్పుడు తమ పెట్టుబడిని రాబట్టుకోడానికి తాతాలిక బదిలీలు, డిప్యుటేషన్లు, స్పెషల్ అటాచ్‌మెంట్లలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. లొసుగులను తమకు అనుకూలంగా వాడుకుంటున్నారని, అందుబాటులో ఉన్న ప్రతి మార్గాన్ని వినియోగించుకుంటున్నారని చెప్తున్నారు.
కమిషనర్ మెమో బుట్టదాఖలు
ఈ ఏడాది మార్చి 12న కమిషనర్ కార్యాలయం కొన్ని ఉత్తర్వులు విడుదల చేసింది. జిల్లాల్లో విచ్చలవిడిగా డిప్యుటేషన్లు ఇస్తున్నారని, ఇకపై కమిషనర్ ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి డిప్యుటేషన్లు, మౌఖిక ఆదేశాలు, స్పెషల్ అటాచ్‌మెంట్లు ఇవ్వొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. వీటిని ఉల్లంఘిస్తే సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించింది. ఇటీవల జరిగిన పలు డిప్యుటేషన్లు, తాతాలిక పోస్టింగ్‌లను పరిశీలిస్తే, అవసరం ఉన్న ఉద్యోగుల కంటే, సంబంధిత అధికారులకు సన్నిహితంగా ఉన్నవారికే అవకాశాలు కల్పిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇటీవల కుత్బుల్లాపూర్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌ను ఐఎంఎఫ్‌ఎల్ మేడ్చల్ డిపోకు తాతాలిక డిప్యుటేషన్‌పై పంపిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. డీటీఎఫ్ సికింద్రాబాద్‌లో సిబ్బంది కొరత ఉందంటూ అమీర్‌పేట, బంజారాహిల్స్, కాచిగూడ స్టేషన్ల నుంచి ముగ్గురు కానిస్టేబుళ్లను డిప్యుటేషన్‌పై తీసుకువచ్చారు. ఏసీ డిస్టిలరీస్ కార్యాలయం నుంచి ఇద్దరు కానిస్టేబుళ్లను చార్మినార్‌కు వారాల విధానంలో విధులు నిర్వహించాలని మౌఖికంగా ఆదేశించినట్టు ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. డీటీఎఫ్‌కు పంపిన ఇద్దరు కానిస్టేబుళ్లు గతంలో అదే అధికారితో కలిసి పనిచేసినవారేనని ఉద్యోగులు చెప్తున్నారు. అంటే సదరు అధికారి 'అవసరం' కోసమే డిప్యుటేషన్లు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తంఅవుతున్నాయి.
ఎదురుచూస్తున్న వారికి అన్యాయం
అధికారుల తీరుతో అర్హులకు అన్యాయం జరుగుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబాలకు దూరంగా పనిచేస్తున్నవారు, వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలు, వైద్య కారణాలతో దరఖాస్తులు చేసినవారు, మానసిక వైకల్యం గల పిల్లల చికిత్స కోసం సమీప పోస్టింగ్ కోరుతున్న ఉద్యోగులు నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. వారి వినతులను మానవతా దృక్పథంతో పరిశీలించడానికి కూడా అధికారులు అంగీకరించడం లేదని, కానీ తమను 'మెప్పించిన' వారికి డిప్యుటేషన్లు ఇస్తున్నారని చెప్తున్నారు.

