KNRUHS : వైద్య విద్యనభ్యసించాలనకుంటున్న విద్యార్థులకు గుడ్‌న్యూస్. 2026-27 విద్యా సంవత్సరానికి తెలంగాణలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో మేనేజ్‌మెంట్ కోటా కింద బీడీఎస్( BDS), ఎంబీబీఎస్(MBBS) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (KNRUHS) పునఃప్రారంభించింది.
అభ్యర్థుల నుంచి వచ్చిన పలు విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వవిద్యాలయం వెల్లడించింది.
ఆగస్టు 20వ తేదీన ముగిసిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సెప్టెంబర్ 2వ ఉదయం 6.00 గంటల నుంచి సెప్టెంబర్ 4వ తేదీ మధ్యాహ్నం 2.00 గంటల వరకు తిరిగి అందుబాటులో ఉంటుందని కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పేర్కొంది. NEET-UG 2026లో నిర్ణయించిన కటాఫ్ స్కోర్ లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులు నిర్దేశిత గడువులోగా.. MBBS/BDS మేనేజ్‌మెంట్ కోటా ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్ సూచించింది.
మేనేజ్‌మెంట్ కోటా కోసం ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించిన అభ్యర్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల అప్‌లోడ్ చేసుకునేందుకు సెప్టెంబర్ 2 ఉదయం 6.00 గంటల నుంచి సెప్టెంబర్ 4 మధ్యాహ్నం 2.00 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది. అభ్యర్థులు https://tspvtmedadm.tsche.in వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపింది. ఇతర వివరాల కోసం ఆగస్టు 12వ తదీనన కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్ వెబ్‌సైట్‌లో విడుదల చేసిన సంబంధిత నోటిఫికేషన్, ప్రాస్పెక్టస్‌ను పరిశీలించాలని అభ్యర్థులకు విశ్వవిద్యాలయం సూచించింది.

