- పరిహారం..ఫలహారం
- భూములకు నష్ట పరిహారం పేరిట కోట్లు కొల్లగొట్టేందుకు 'బిగ్’ స్కెచ్
- పనులోచోట, పరిహారం మరోచోట
- సర్కార్ భూములు టార్గెట్‌గా దందా
- 2 గ్రామాలను సైలెంట్ చేసిన ఘనులు
- దోచుకునే పరిహారం తమకు వద్దని ఎదురు తిరిగిన కుటుంబానికి కష్టాలు
- స్కామ్ వెనుక ఎమ్మెల్యే పీఏ, మామ క్యాంప్ ఆఫీస్‌లోనే సెటిల్‌మెంట్లు
- కాస్తులో లేకున్నా కాగితాల్లో వందల మంది కాంగ్రెస్ మద్దతుదారుల పేర్లు
నారాయణపేట మండలం పేరపళ్ల గ్రామానికి చెందిన నలుగురు దళిత రైతులు తాతల కాలం నుంచి ఆరెకరాల అసైన్డ్ భూమిని సాగు చేసుకొంటూ జీవనం గడుపుతున్నారు. ఉన్నట్టుండి తహసీల్దార్ కార్యాలయం నుంచి వారికో ఫోన్ కాల్ వచ్చింది. 'కొడంగల్ ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్ కింద మీ భూమి పోతున్నది. మీకు పరిహారంగా రూ.1.20 కోట్లు మంజూరయ్యాయి. వచ్చి తీసుకెళ్లండి' అని ఆ అధికారి చెప్పడంతో అవాక్కవడం అన్నదమ్ముల వంతైంది. 'మా భూములు లిఫ్ట్ పథకంలో పోవడమేంది?' అని ఆ సోదరులు ఆరా తీస్తే ఊరంతా ఇదే యవ్వారం నడుస్తున్నదని తెలిసింది. 'అప్పనంగా వచ్చే పరిహారం వద్దు.. మా భూమి ఇయ్యం' అని తేల్చిచెప్పిన ఆ బక్క రైతులకు కేసులు, వేధింపులే ఎదురయ్యాయి. ఆ కుటుంబం ఎదురు తిరగడంతోనే ఈ స్కామ్ బయటపడింది. ఎంఎన్‌కేఎల్‌ఐ స్కీమ్‌లో భాగంగా ఓ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అడ్డాగా సాగుతున్న భూ పరిహారం దందాపై 'నమస్తే తెలంగాణ' ప్రత్యేక కథనం.

మహబూబ్‌నగర్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకంలో (ఎంఎన్‌కేఎల్‌ఐఎస్) ప్రభుత్వ భూసేకరణలో ప్రక్రియలో భారీగా అవినీతి రాజ్యమేలుతున్నది. భూములకు నష్టపరిహారం పేరిట ప్రభుత్వ సొమ్మును అప్పనంగా ఫలహారం లెక్కన పంచుకొనేందుకు రంగం సిద్ధమైంది. అధికార పార్టీ నేతలు అందినకాడికి దండుకొనేందుకు భారీ స్కెచ్ వేశారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి మానస పుత్రికగా చెప్పుకొంటున్న ఈ పథకాన్ని 2024లో ఆయన శంకుస్థాపన చేశారు. ఈ పథకంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.20 లక్షల పరిహారంగా ప్రకటించింది.
సీఎం సొంత నియోజకవర్గానికి సాగు, తాగునీటి సరఫరాకు ఉద్దేశించిన ఈ పథకం కోసం ఏకంగా భూసేకరణ చట్టంలో వెసులుబాటు కల్పించి మరీ పరిహారం చెల్లిస్తున్నారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఈ పథకం కోసం మక్తల్, ఊట్కూర్, నారాయణపేట, దామరగిద్ద మండలాల్లో 3,602 మంది రైతుల నుంచి మొత్తం 2,738.13 ఎకరాలను సేకరించడానికి నోటిఫికేషన్లు విడుదల చేశారు. తొలుత పరిహారం ఇవ్వకుండానే పనులు చేపడితే రైతులు అడ్డుకొన్నారు.
ఎక్కడైతే పనులు జరుగుతున్నాయో? అక్కడి రైతులకు పరిహారం చెల్లించి పనులు మొదలుపెట్టారు. మిగిలిన చోట రైతులకు అందిస్తున్న భూపరిహారంలో కాంగ్రెస్ నేతలు అందినకాడికి దోచుకునేందుకు రంగం సిద్ధంచేస్తున్నారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లో ముంపునకు గురికాని, ఒక్క అంగుళం కూడా సంబంధంలేని ప్రభుత్వ భూములనే టార్గెట్ చేసి భారీ అవినీతికి పాల్పడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుట్టలు, బీడు భూములకు కూడా రికార్డులు సృష్టించి భారీ ఎత్తున పరిహారం దోచుకునేందుకు అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు.

ఎమ్మెల్యే మామ, పీఏ గుటకాయ స్వాహా
ఓ ఎమ్మెల్యే మేనమామ.. సమీప బంధువైన పీఏ సహకారంతో రికార్డులనే తారుమారు చేయిస్తున్నారు. అసలు పహాణీ, ఆర్‌వోఆర్‌లో పాసుబుక్కులే లేని కాంగ్రెస్ కార్యకర్తలను రైతులుగా సృష్టించి రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. ఉన్నతాధికారులతో సహా కిందిస్థాయి రెవెన్యూ అధికారులకు వాటాలిచ్చి పరిహారం స్వాహా చేస్తున్నారు. దీనికోసం తమకు అనుకూలంగా ఉన్న తహసీల్దార్లను, సర్వేయర్లను నియమించుకొని మరీ.. భూసేకరణ అధికారులు అడ్డుతగలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఎమ్మెల్యే మేనమామ చుట్టూ తిరిగే ఓ కాంగ్రెస్ నాయకుడికి ఆయన బంధువుల పేరిట దాదాపు 10 ఎకరాలకు పైగా రికార్డుల్లో ఎక్కించి భూసేకరణ జాబితాలోకి చేర్చినట్టు వెల్లడైంది. మరోవైపు భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వడంలో అక్రమాలు చోటుచేసుకొంటున్నాయని ఓ చోట గ్రామస్తులంతా ఎదురు తిరిగారు. 'మీదేం పోతుంది? అంతా మేము చూసుకుంటాం. సర్పంచ్ సహా అందరికీ పరిహారం వచ్చేలా చూస్తాం. అందరం పంచుకుందాం' అంటూ సెటిల్‌మెంట్ చేయడంతో మొత్తం గప్‌చుప్ అయ్యారు.
రికార్డులన్నీ తారుమారు
రెవెన్యూ రికార్డుల్లో లేని రైతులను సృష్టించి అధికార పార్టీ నేతలు పరిహారం దండుకొనే ప్రయత్నం చేస్తున్నారు. తమకు అనుకూలంగా ఉన్న అధికారులకు పోస్టింగ్‌లు ఇప్పించి మరీ ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తున్నది. కిందిస్థాయి సిబ్బందిని కూడా లోబరుచుకొని భారీ ఎత్తున పరిహారం స్వాహా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే జిల్లాలో తమకు అనుకూలంగా ఉన్న ఓ ఉన్నతాధికారిని రప్పించడంతో పనులు చక్కబెడుతున్న సమయంలోనే సదరు అధికారి కాసులకు కక్కుర్తిపడి ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. ఓ మండలంలో తహసీల్దార్‌గా పనిచేస్తూ అక్కడ రికార్డులన్నీ చక్కదిద్దిన సదరు అధికారికి మరోచోట పోస్టింగ్ ఇప్పించి భారీ అక్రమాలకు తెరలేపారు.
కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు ఫలహారం
నారాయణపేట మండలం పేరపళ్ల గ్రామంలో నిర్మిస్తున్న పంప్‌హౌస్ అప్రోచ్ చానల్, జయమ్మ చెరువు కట్ట స్థిరీకరణ కోసం నాలుగు భాగాలుగా భూసేకరణ నోటిఫికేషన్లను విడుదల చేశారు. ఇందులో పంప్‌హౌస్ కోసం 44 ఎకరాల తొమ్మిది గుంటలు, అప్రోచ్ చానల్ కోసం 3.27 గుంటలు, జాయమ్మ చెరువు కట్ట కోసం 326.34 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. పేరపళ్లతో పాటు దామరగిద్ద మండలం దామరగిద్ద తండా శివారులోనూ పనులు నడుస్తున్నాయి. ఇందులో సుమారు 150 నుంచి 200 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉన్నది. ఈ ప్రభుత్వ భూమిలో కొందరికి పట్టాలతోపాటు పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయి.
కొంతమంది రైతులు వర్షాధార పంటలను కూడా అక్కడక్కడా సాగు చేస్తున్నారు. పనులు జరుగుతున్న చోట గుట్టలు, బీడు భూమి ఎక్కువగా ఉండటంతో ఇక్కడే అక్రమాలకు తెరలేపారు. నోటిఫికేషన్లలో కూడా ప్రభుత్వ భూముల్లో పట్టాదారుల పేర్లను ఉటంకిస్తూ కాస్తుదారులను కూడా తెరమీదికి తీసుకొచ్చారు. ఇంతవరకు సేద్యం చేయని కొన్ని ప్రభుత్వ భూముల్లో కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు (సర్వేనంబర్లను బై నంబర్లుగా మార్చి) కేటాయించి ఏకంగా రైతులుగా సృష్టించారు. ఈ గ్రామంలో సర్వేనంబర్ 87, 82, 111లో సుమారు ఈ రెండు గ్రామాల చుట్టుపక్కల 1,000 ఎకరాల వరకు ఉంటుంది. ఇందులో కొంతమందికి మాత్రమే పట్టాలు ఉన్నాయి. దీన్ని ఆసరాగా చేసుకొని తమకు అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను రైతులుగా చూపించి పరిహారం నొక్కేయడానికి రంగం సిద్ధం చేశారు.
రూ.3 లక్షలిస్తే రికార్డుల్లోకి ఎకరం ఎక్కిస్తం
ఓ ఎమ్మెల్యే మేనమామతోపాటు పీఏ అండదండలతో కొందరు కాంగ్రెస్ నాయకులు పేరపళ్ల గ్రామంలోని రైతులకు పరిహారం కోసం రూ.3 లక్షలు తీసుకొని ఒక ఎకరం పొలం ఉన్నట్టు రికార్డుల్లోకి ఎక్కించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎప్పుడూ ఆ మేనమామ చుట్టూ ఉండే కాంగ్రెస్ నాయకుడికి ఏకంగా వాళ్ల బంధువుల పేరిట దాదాపు 10 ఎకరాల భూమి ఉన్నట్టు రికార్డులు సృష్టించారు. సదరు రైతుల పేరు మీద గతంలో సెంటు భూమి కూడా లేకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నది.
అంతేగాకుండా కొంతమంది కాస్తులో ఉన్నా రికార్డుల్లో లేకపోవడంతో వారి వద్ద కూడా డబ్బులు దండుకుని రైతులుగా నష్టపరిహారం జాబితాలో చేర్చారు. రైతులు కానటువంటి ఎంతోమందికి కూడా పరిహారం వచ్చేలా చక్రం తిప్పారు. బినామీ పేర్లతో రైతులను జాబితాలోకి చేర్చి పరిహారం ఇస్తున్నారని తెలిసి గ్రామ సర్పంచ్ సహా గ్రామస్తులంతా అధికారులను నిలదీశారు. ఏమైందో ఏమో కానీ సదరు ఎమ్మెల్యే పీఏ రంగంలోకి దిగి గ్రామస్తులతో మాట్లాడి సెటిల్‌మెంట్ చేసేశారు. దీంతో అంతా సైలెంట్ అయిపోయారు. అందరి పేర్లు రికార్డుల్లోకి ఎక్కిపోయాయి. ఒక్కొక్కరికీ రూ.20 లక్షల పరిహారం కావాలంటే సదరు పీఏకు రూ.10 లక్షలు ముట్టజెబితేనే చెక్కులు ఇస్తామని ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తున్నది.

5,000 ఎకరాల భూసేకరణకు డీపీఆర్
ఎంఎన్‌కేఎల్‌ఐఎస్ పథకం ద్వారా మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల్లో సుమారు లక్ష ఎకరాలకు నీళ్లు అందించేందుకు డిజైన్ చేశారు. రెండు దశల్లో సుమారు 5,000 ఎకరాల వరకు భూములను సేకరించేందుకు డీపీఆర్‌ను సిద్ధంచేశారు. మక్తల్ మండలం కాట్రేవుపల్లి, ఉట్కూరు మండలం పెద్ద చెరువు, నారాయణపేట మండలం పేరపళ్ల, దామరగిద్ద మండలం కాన్‌కుర్తి గ్రామాల వద్ద పంప్‌హౌస్‌లను ఏర్పాటు చేస్తున్నారు. భీమా ప్రాజెక్ట్‌లోని అంతర్భాగంగా భూత్పూర్ రిజర్వాయర్ నుంచి ఈ నీటిని ఎత్తిపోస్తారు.
మొత్తం పైప్‌లైన్ల ద్వారా చెరువుల్లోకి ఎత్తిపోసి అక్కడ నుంచి నేరుగా కొడంగల్ నియోజకవర్గానికి సాగు, తాగునీరు అందిస్తారు. ఇక్కడే భూమాయ మొదలైంది. పనులు జరిగే చోట భూసేకరణ చేయాల్సిందిపోయి.. సంబంధం లేని సమీప భూములను కూడా సేకరిస్తూ భారీ ఎత్తున అక్రమాలకు తెర లేపారు. దీనికి తోడు ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన డిజైన్‌ను రెవెన్యూ అధికారుల సహాయంతో తమకు అనుకూలంగా మార్చుకొన్న కాంగ్రెస్ నాయకులు భారీ పరిహారం కొట్టేసే దోపిడీ తెరలేపారు.
పరిహారం మాకొద్దు బాబోయ్!
నారాయణపేట మండలం పేరపళ్ల గ్రామానికి చెందిన పొట్ట కిష్టప్ప, పొట్ట చిన్న బాలప్ప, పొట్ట బాలప్ప, పొట్ట లాలప్ప అనే దళిత కుటుంబం 111 సర్వే నంబర్‌లో తాతల కాలం నుంచి అసైన్డ్ భూమిని సాగు చేసుకుని జీవిస్తున్నది. 1954 కాసు పహాణి నుంచి ఇప్పటివరకు వీళ్ల కుటుంబం అంతా పహాణీలు, ఆర్‌వోఆర్‌లతో రికార్డుల్లో ఉన్నది. పాస్ పుస్తకాలు కూడా వారి పేరిటే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సర్వేనంబర్ కొడంగల్ ఎత్తిపోతల పథకం చేపట్టే ప్రాంతానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
విచిత్రంగా వీరి కాస్తులో ఉన్న భూమి పంప్‌హౌస్‌లో కోల్పోయినట్టు రికార్డులకు ఎక్కించారు. 'మీ అన్నదమ్ములది మొత్తం ఆరు ఎకరాలు భూమి కోల్పోతారని, రూ.1.20 కోట్ల పరిహారం వచ్చింది తీసుకుపోండి' అంటూ తహసీల్దార్ కార్యాలయం నుంచి వారికి ఫోన్ వచ్చింది. దీంతో అవాక్కైన ఆ కుటుంబం 'మా భూములు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్‌లో పోవడం ఏమిటి?' అంటూ ఆరా తీశారు. చివరకు గ్రామంలో మొత్తం ఇలాంటి వ్యవహారమే నడుస్తున్నదని, చూసీచూడనట్టు ఉండాలని కొందరు సలహా ఇచ్చారు.
అయినా అప్పనంగా వచ్చిన సర్కార్ సొమ్ము తమకు అక్కర్లేదని నిజాయితీ ప్రదర్శించిన ఆ కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. క్యాంపు కార్యాలయానికి ఆ సోదరులను పిలిపించి వచ్చిన డబ్బు తీసుకోండి సగం సగం పంచుకుందాం.. అంటూ ఆఫర్లు ఇచ్చారు. ఉన్న భూమి కాస్త పోతే తమకు దిక్కేదని ఎదురు తిరిగారు. బేరసారాలకు దిగి వచ్చిన డబ్బుతో వేరేచోట భూమి కొనుక్కోమంటూ ఉచిత సలహా ఇచ్చారు. ఒప్పందం ప్రకారం వీళ్లు పరిహారం తీసుకొని పక్కకు జరిగితే 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న వీళ్ల భూమిలోకి వేరే వారిని రికార్డుల్లో ఎక్కిస్తామని ఏకంగా అడ్వకేట్లతో బాండ్లు కూడా రాయించి సిద్ధంగా ఉంచారు.
అయినా ఆ కుటుంబం పరిహారం తీసుకోవడానికి వెనుకా, ముందు ఆలోచనలో పడింది. మొత్తం వ్యవహారం చెడిపోతుందని భావించిన సదరు ఎమ్మెల్యే మేనమామ, పీఏ కలిసి పరిహారం తీసుకోకుండా పనులను అడ్డుకుంటున్నారని నోటీసులు పంపించారు. ఆ పరిహారం మొత్తాన్ని కోర్టులో జమచేసి వీరిపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. దీంతో విసిగిపోయిన ఆ కుటుంబం కోర్టుల చుట్టూ తిరుగుతున్నది. తమ భూమి తమకు కావాలని, పరిహారం అక్కర్లేదని బాధిత కుటుంబం జిల్లా కలెక్టర్‌తోపాటు ఏకంగా సీఎల్‌ఏ అధికారులకూ మొరపెట్టుకొన్నది. దీంతో వారికి బెదిరింపులు ఎక్కువయ్యాయి. అన్యాయంగా వచ్చే పరిహారం తమకు అక్కర్లేదని ఆ కుటుంబం ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నది.


