Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కొలనుపాక..అరుదైన చరిత!

కొలనుపాక..అరుదైన చరిత!

కొలనుపాక.. చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా ఎంతో ప్రాధాన్యమున్న నేల. రాష్ట్ర కూటుల నుంచి నిజాం వరకూ ఎందరో పరిపాలించిన గడ్డ ఇది.

చరిత్రకు ఆధారమైన ఎన్నో శాసనాలకు వేదిక ఇది. బౌద్ధ, జైన, వీర శైవ, శైవ మతాలతో పరిఢవిల్లిన ప్రాంతమిది. శిల్పకళా వైభవానికి, భారతీయ వారసత్వ సంపదకూ సాక్షీభూతంగా నిలుస్తున్న గ్రామమిది.

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నది కొలనుపాక. ఈ ప్రాంతాన్ని ఎనిమిది, తొమ్మిది శతాబ్దాలలో రాష్ట్ర కూటులు, పదీపదకొండు శతాబ్దాల్లో కల్యాణి చాళుక్యులు, పన్నెండు పదమూడు శతాబ్దాల్లో కాకతీయులు.. ఆ తర్వాత కుత్‌బ్‌షాహీలు, నిజాంలు పాలించారు. నాటి పాలనా తీరును.. సంస్కృతి, సంప్రదాయాలను తెలిపే అనేక శాసనాలు ఇక్కడ వెలుగు చూశాయి. ఇప్పటికీ కొలనుపాక చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో విగ్రహాలు, శాసనాలు లభ్యమవుతూనే ఉన్నాయి. పాలకుల రాజసాన్ని.. పాలన వైభవాన్ని కండ్లకు కట్టే చారిత్రక కట్టడాలు దర్శనమిస్తూనే ఉంటాయి. సార్వభౌములు చేపట్టిన నిర్మాణాలు, చెక్కించిన శిల్పాలు.. అలనాటి సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పడుతున్నాయి.

సర్వమత సమ్మేళనం:కొలనుపాకలో అనేక మతాలు పరిఢవిల్లాయి. అందుకే, విభిన్న ఆలయాలకు నిలయంగా ప్రసిద్ధిగాంచిందీ గ్రామం. దక్షిణ కాశీగా పేరుగాంచిన కొలనుపాక, నేటికీ గొప్ప శైవక్షేత్రంగా భాసిల్లుతున్నది. దేశంలోనే ఏడో ప్రసిద్ధ దేవాలయంగా ప్రఖ్యాతిగాంచిన జైన దేవాలయం ఇక్కడే ఉన్నది. మరోవైపు సోమేశ్వరాలయం, వీర నారాయణ ఆలయం, బుద్ధ విగ్రహాలు, 18 రకాల మఠాలు.. భిన్న ధర్మాల సహజీవనానికి ప్రతీకగా నిలుస్తున్నాయి.

అరుదైన విగ్రహాలు: శతాబ్దాల చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్న విగ్రహాలు, శాసనాలను భద్రపర్చేందుకు 1969లోనే ఇక్కడ సంగ్రహాలయం ఏర్పాటైంది. క్రీ.శ.ఐదు నుంచి పదిహేను శతాబ్దాల కాలం నాటి శిల్పాలు, గజలక్ష్మి ధ్వజస్తంభం, చాముండి, నటరాజు, భైరవుడు, నాగశిల్పం, సప్త మాతృకలు, వీరభద్రుడు, భద్రకాళి, ఆరో విక్రమాదిత్యుని శాసనాలు, 1085 నాటి తొండర చోళరాజు శాసనాలు ఇక్కడ దర్శనమిస్తాయి. హనుమంతుడి కొడుకుగా చెప్పే అరుదైన మత్స్యవల్లభుని విగ్రహం ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. బౌద్ధ, జైన మత స్థాపకులు.. బుద్ధుడు, మహావీరుడి విగ్రహాలూ ఇక్కడున్నాయి. చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యం కలిగిన కొలనుపాక, చరిత్ర పరిశోధకులకు ఓ అధ్యయన కేంద్రంగా విరాజిల్లుతున్నది. హైదరాబాద్‌ నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నదీ గ్రామం. రైలు, బస్సు మార్గాల్లో వచ్చేవారు హైదరాబాద్‌ – వరంగల్‌ మార్గంలోని ఆలేరులో దిగాలి. అక్కడి నుంచి కొలనుపాక ఆరు కిలోమీటర్లు. ఆటోలు, ప్రైవేట్‌ వాహనాల్లోనూ వెళ్లవచ్చు. కొలనుపాకలో బస చేయాలనుకొంటే, జైన ఆలయంలో గదులు అందుబాటులో ఉన్నాయి. ఈ పర్యటన చక్కని అనుభూతినిస్తుంది.

  • ప్రదీప్‌
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana