Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Konda Surekha | కొండా సురేఖపై వేటుకు రేవంత్ మరో అస్త్రం.. కాంగ్రెస్ ఎంపీలతో లేఖ రాయించాలని నిర్ణయం

Konda Surekha | కొండా సురేఖపై వేటుకు రేవంత్ మరో అస్త్రం.. కాంగ్రెస్ ఎంపీలతో లేఖ రాయించాలని నిర్ణయం

Konda Surekha | హైదరాబాద్‌, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న వేళ, ఆమెపై వేటు వేయించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరో అస్ర్తాన్ని ప్రయోగిస్తున్నట్టు తెలిసింది.

ఇప్పటికే క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకొనేవిధంగా లాబీయింగ్‌ చేస్తున్న సీఎం శిబిరం తాజాగా తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలతో లేఖ రాయించాలని నిర్ణయించినట్టు సమాచారం.

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ విదేశీ పర్యటన ముగించుకొని మంగళవారం ఢిల్లీకి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ సహా పలువురు ముఖ్య నేతలు ఈ నెల 3న హస్తిన పర్యటనకు వెళ్తున్నారు. కొండా సురేఖ వ్యవహారంతోపాటు క్యాబినెట్‌ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ అంశాలపై కేసీ వేణుగోపాల్‌, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఈ బృందం ప్రత్యేకంగా భేటీ కానున్నది. సురేఖ అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై అధిష్ఠానంతో తుది చర్చలు జరుపనున్నారు.

తాను ఢిల్లీకి వెళ్లడానికి ముందే పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుల ద్వారా కొండా సురేఖకు వ్యతిరేకంగా అధిష్ఠానానికి లేఖ రాయించాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడం, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఎంపీల ద్వారా లేఖ పంపించడం వల్ల ఏఐసీసీపై మరింత ఒత్తిడి తీసుకొనిరావచ్చని భావిస్తున్నట్టు తెలిసింది. తద్వారా ఈ వ్యవహారం కేవలం రాష్ట్ర నాయకత్వానికి సంబంధించినది మాత్రమే కాదని, ఎంపీలు సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే సంకేతాన్ని ఢిల్లీ పెద్దలకు చేరవేయాలనేది ఈ వ్యూహం వెనుక ప్రధాన ఉద్దేశమని చెప్తున్నారు. ఎంపీలు లేఖ రాయడం నుంచి అది అధిష్ఠానానికి చేరే వరకు సమన్వయం చేసే బాధ్యత ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి అప్పగించినట్టు తెలిసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana