Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Konda Surekha | రాజీనామా చేసే ఆలోచనలో మంత్రి కొండా సురేఖ..! నేడు హైదరాబాద్‌లో తమ అనుచరులతో కొండా దంపతుల భేటీ

Konda Surekha | రాజీనామా చేసే ఆలోచనలో మంత్రి కొండా సురేఖ..! నేడు హైదరాబాద్‌లో తమ అనుచరులతో కొండా దంపతుల భేటీ

Konda Surekha | రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ చివరి దశకు వచ్చినట్లు కనిపిస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కుట్రలను పసిగట్టిన మంత్రి సురేఖ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నది.

తన కూతరు కొండా సుస్మిత సీఎం రేవంత్ పై చేసిన అవినీతి ఆరోపణలపై తనను బలిపశువును చేస్తున్నారని గ్రహించిన కొండా దంపతులు అధిష్ఠానంతో తాడోపేడో తేల్చుకునేందుకు సమాయత్తమవుతున్నారు. అధిష్ఠానం నిర్ణయం కంటే ముందే రాజీనామా ప్రకటించే ఆలోచనలో కొండా సురేఖ ఉన్నట్లు తెలిసింది. పార్టీలో ఉండాలా లేదా అనే అంశంపై తన అనుచరులతో చర్చించాక నిర్ణయం ప్రకటించనున్నారు.

ఈ మేరకు మంత్రి కొండా సురేఖ దంపతులు నేడు(శుక్రవారం) హైదరాబాద్‌లో తమ అనుచరులతో భేటీ కానున్నారు. ఇటీవల ఢిల్లీలో హైకమాండ్‌తో జరిగిన చర్చలు, తదుపరి కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. సాయంత్రం మీడియా సమక్షంలో ఢిల్లీ పరిణామాలపై కొండా దంపతులు స్పందించనున్నట్లు సమాచారం. కాగా, తనపై జరుగుతున్న కుట్రలను ముందే పసిగట్టిన కొండా సురేఖ మొన్న ఢిల్లీ గడ్డపైనే ప్రతిఘటనకు దిగారు. రాజధాని వేదికగా మీడియా చిట్‌చాట్‌లో ఆమె మాట్లాడిన మాటలు కాంగ్రెస్‌ నేతల మీద తూటాల్లా సంధించారు. తన కూతురు మాట్లాడిన దాంట్లో అక్షరం పొల్లు పోలేదని, అకడ జరుగుతున్న వాస్తవాలనే నిర్భయంగా చెప్పిందని సురేఖ బాహాటంగానే సమర్థించుకున్నారు. అంతేకాదు, ప్రభుత్వంలో మంత్రుల కమీషన్ల దందా, నిధుల మళ్లింపులు, కొందరు మంత్రులపై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలపై పార్టీ అధిష్ఠానం ఎందుకు మౌనంగా ఉన్నదని సూటి గా ప్రశ్నించారు.

బీసీ వర్గానికి చెందిన మహిళా మంత్రిపై చిన్న మాటకు కూడా క్రమశిక్షణా అస్త్రాలు ఝుళిపించే నాయకులు, కోట్లాది రూపాయల ఆరోపణలు ఎదురొంటున్న ఇతర మంత్రుల వద్దకు వచ్చేసరికి ఎందుకు కళ్లు మూసుకుంటారని నిలదీశారు. బీసీలకో న్యాయం, బడా వర్గాలకో న్యాయమా అంటూ పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలకు లేఖల ద్వారా సమగ్ర విషయాలను చేరవేసినట్టు తెలిసింది. మరోవైపు కొండా ఎపిసోడ్‌ వెనుక త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ సమీకరణలు అత్యంత బలంగా పనిచేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. క్యాబినెట్‌ నుంచి కొండా సురేఖను తప్పించడం ద్వారా ఖాళీ అయ్యే ఆ ఒక మంత్రి పదవిని ఆశావహులకు ఎరగా చూపి, పార్టీలో ఎగిసిపడుతున్న అసమ్మతి గళాలను తొకిపెట్టాలనేది ప్రభుత్వ పెద్దల ప్రధాన వ్యూహంగా ఉన్నట్లు గాంధీభవన్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఇప్పుడు కొండా సురేఖ రాజీనామా చేస్తారనే వార్తలు హాట్ టాఫిక్‌గా మారాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana