- గత ఏడాదితో పోలిస్తే 15 రోజులు ముందుగానే..
- తుంగభద్రకు సైతం ఆశాజనకంగా వరదలు
- జూరాల నుంచి ఇప్పటికే శ్రీశైలానికి 123 టీఎంసీలు రాక
మహబూబ్‌నగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కృష్ణా బేసిన్‌లో వరద ఉధృతి కొనసాగుతున్నది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 15 రోజులు ముందుగానే ఎగువ నుంచి జూరాలకు వరదలు వచ్చాయి. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్టుల నుంచి ముందస్తుగానే నీటిని విడుదల చేయడంతో జూరాల గేట్లు ఎత్తి శ్రీశైలానికి నీటిని విడుదల చేశారు. ఈ ఏడాది జూన్ ఒకటినుంచి సోమవారం నాటికి జూరాల ప్రాజెక్టుకు 137.477 టీఎంసీల ఇన్‌ఫ్లో నమోదైంది. జూరాల నుంచి ఇప్పటికే శ్రీశైలానికి 64.138 టీఎంసీలను వదిలారు. ఇక విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 59.267 టీఎంసీలను శ్రీశైలానికి విడుదల చేశారు. గేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా 123.405 టీఎంసీలను జూరాల నుంచి దిగువకు వదిలారు. మరోవైపు జూరాలతోపాటు ప్రాజెక్టుపై ఆధారపడిన అన్ని సాగునీటి పథకాలకు కలిపి ఇప్పటికే 11 టీఎంసీల నీటిని వినియోగించారు.
గత ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా కృష్ణానదికి వరదలు ఆశాజనకంగా ఉండటంతో అన్నదాతలు ఆనందంగా వ్యవసాయం పనుల్లో నిమగ్నమయ్యారు.
శ్రీశైలంలో వేగంగా పెరుగుతున్న నీటిమట్టం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కృష్ణా పరిధిలోని ప్రాజెక్టులకు సోమవారం కూడా వరద ఆశాజనకంగా ఉన్నది. ఆల్మట్టికి 1.30 లక్షల క్యూసెక్కులు, నారాయణపురకు అంతే మొత్తం లో వరద నమోదైంది. కాగా జూరాలకు మాత్రం 1.95 లక్షల ఇన్‌ఫ్లో, శ్రీశైలానికి 1,87,698 క్యూసెక్కుల వరద వస్తున్నది. ఈ క్రమంలో శ్రీశైలంలో నీటిమట్టం వేగంగా పెరుగుతున్నది. సాయంత్రానికి జలాశయంలో 860.50 అడుగుల నీటిమట్టంతో నిల్వ 107.45 టీఎంసీల వరకు చేరుకున్నది. నాగార్జునసాగర్‌కు తెలంగాణ జెన్‌కో కరెంటు ఉత్పత్తి ద్వారా విడుదల చేస్తున్న 38 వేల పైచిలుకు ఇన్‌ఫ్లో మాత్రమే వస్తున్నది. కాగా కృష్ణా బేసిన్‌లో ఎగువ నుంచి దిగువ దాకా అన్నిచోట్లా కరెంటు ఉత్పత్తి కొనసాగుతున్నది.

