హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా చెప్పుకునే మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎన్నికల సంఘం ( Election Commission) తీరు దాదాపు నియంతృత్వ ధోరణిలోకి వెళ్తున్నదని బీఆర్‌ఎస్ ( BRS ) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) ఆందోళన వ్యక్తం చేశారు.
ముగ్గురు ఎన్నికల కమిషనర్లలో ఇద్దరు పదేపదే అభ్యంతరాలు ( Objections) వ్యక్తం చేస్తున్నప్పుడు, ఎన్నికల సంఘం పనితీరును సరిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ముగ్గురిలో ఇద్దరు ఒక నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు అది మెజారిటీ కాదా? ఇప్పటివరకు మెజారిటీ అంటే ఇదే కదా. ఇప్పుడు దాని నిర్వచనం కూడా మారుతున్నట్టుందని పేర్కొన్నారు.
ఓటర్ల నమోదు, తొలగింపు, తొలగించిన ఓట్లను తిరిగి చేర్చడం వంటి అంశాల్లో సందేహాలకు తావిచ్చేలా నిర్ణయాలు తీసుకుంటే, 'అసలు మనం ఇంకా ప్రజాస్వామ్యం లోనే ఉన్నామా? అంటూ అనుమానం వ్యక్తం చేశారు. దేశ భవిష్యత్తును ప్రజాస్వామ్య పరిరక్షణ బాధ్యత ఉన్న సంస్థ పునాదులే బలహీనపడుతున్న పరిస్థితిలో దాని నిర్ణయాలకు వదిలేయలేమని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాజకీయ పార్టీలు, రాజ్యాంగ సంస్థలు, పౌర సంఘాలు, ముఖ్యంగా సుప్రీంకోర్టు కలిసి ముందుకు రావాలని ఆయన ఆకాంక్షించారు.
తెలంగాణలో ఓట్ల తొలగింపుపైనా కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ' తెలంగాణలో అత్యధిక ఓట్ల తొలగింపులు బీఆర్‌ఎస్ గెలిచిన స్థానాల్లోనే ఉండటం ఆశ్చర్యం కలిగించలేద' అని అన్నారు.తెలంగాణలో ప్రస్తుతం ఒకే పోరాటం జరుగుతున్నదని, అది ' కేసీఆర్ వర్సెస్ అందరూ' అని కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీలు కలిసి అనైతిక, అక్రమ, బహిరంగంగా ప్రకటించని కుమ్మక్కుకు పాల్పడ్డాయని ఆరోపించారు. ఇప్పుడు ఆ కుమ్మక్కులోకి ఎన్నికల సంఘం కూడా చేరుతున్నట్టుగా కనిపిస్తున్నదని వ్యాఖ్యానించారు.
ఈ వ్యవహారంపై బీఆర్‌ఎస్ న్యాయస్థానాల్లోనూ, ప్రజల మధ్యనూ పోరాడుతుందని స్పష్టం చేశారు. చట్టవిరుద్ధంగా తొలగించిన ప్రతి ఓటును తిరిగి చేర్పిస్తామని ప్రకటించారు. చివరగా ఆయన తన రాజకీయ సందేశాన్ని మరోసారి స్పష్టం చేస్తూ తెలంగాణలో ఒకే ఒక్క 'సార్' ఉన్నారు. అది కేసీఆర్ సార్. ప్రజలకు ఆయనపై ఉన్న ప్రేమను ఏ 'ఎస్‌ఐఆర్' కూడా ఓడించలేదు' అని అన్నారు.

