Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లంచావతారులు

లంచావతారులు

  • రంగారెడ్డి జిల్లాలో పట్టుబడుతున్న అవినీతి అనకొండలు
  • ఓ వైపు ఏసీబీ దాడులు జరుగుతున్నా.. ఆగని లంచాల పర్వం
  • కరప్షన్‌లో రెవెన్యూశాఖ ముందుండగా.. తర్వాతి స్థానాల్లో మున్సిపల్‌, రిజిస్ట్రేషన్‌ శాఖలు

రంగారెడ్డి, మే 22 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో అవినీతి అనకొండలు రోజుకోచోట పట్టుబడుతున్నారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఓ వైపు దాడులు జరిపి అక్రమార్కుల ఆట కట్టిస్తున్నా లంచాల వసూళ్లు మాత్రం ఆగటంలే దు. ఇటీవల శంషాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మూడురోజులపాటు సోదాలు నిర్వహించా రు. అక్కడ పనిచేసిన తహసీల్దార్‌ మూడేండ్ల కిందటే తహసీల్దార్‌గా పదోన్నతి పొందారు.

అయినా అవినీతి మరకలు ఉండడంతో ఏసీబీ రైడ్స్‌ జరిగాయి. ఈ ఘటనపై ఏసీబీ అధికారులు విచారణ జరుపుతుండగా.. మేడ్చల్‌ జిల్లాకు చెందిన డిప్యూటీ కలెక్టర్‌ వంశీమోహన్‌ అక్రమార్కుల కేసులో ఏసీబీకి చిక్కారు. ఆయనపై జరిపిన విచారణలో సుమారు వందకోట్లకు పైగా అక్రమాస్తులున్నట్టు వారు గుర్తించారు. జిల్లాలో అవినీతిలో రెవెన్యూశాఖ ముందు ఉం డగా.. రెండు, మూడు స్థానాల్లో మున్సిపల్‌, రిజిస్ట్రేషన్ల శాఖలున్నాయి. వాటితోపాటు మరికొన్ని శాఖల్లోనూ అవినీతి పెచ్చుమీరుతున్నది. జిల్లా అభివృద్ధితోపాటు అవినీతిలోనూ ముందుకు దూసుకెళ్తున్నది. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట అవినీతి అధికారుల మూలాలు బయటపడుతూనే ఉన్నాయి.

రెవెన్యూశాఖలో లీలలు ఇలా..

ఆదిబట్ల గ్రామంలో 14 గుంటల భూమిని ఆన్‌లైన్‌లో చేర్చేందుకు బాధితుడి నుంచి రూ.8 లక్ష లు లంచం తీసుకుంటూ రంగారెడ్డి డిప్యూటీ కలెక్టర్‌ భూపాల్‌రెడ్డి, అలాగే, తలకొండపల్లి తహసీల్దార్‌ నాగార్జున్‌, వీఆర్‌ఏ యాదగిరి పేరు మా ర్పిడి కోసం రూ.50,000 తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుపడ్డారు. ఆమనగల్లులో ఒక భూమి పాస్‌బుక్కు జారీ విషయంలో తహసీల్దార్‌ లలిత, సర్వేయర్‌ రవిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. అదే మండలంలోని వెల్జా ల్‌ గ్రామపంచాయతీ కార్యదర్శి శరత్‌కుమార్‌ ఓ ఇంటి స్థలాన్ని రికార్డుల్లో చేర్చేందుకు రూ. 30వేలు తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు.

ఇబ్రహీంపట్నం తహసీల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ కృష్ణ, అలాగే, కేశంపేటలో గతంలో పనిచేసిన తహసీల్దార్‌ లావణ్య కూడా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కా రు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై సర్వేల్యాండ్స్‌ అధికారి శ్రీనివాసులుపై ఏసీబీ కేసు నమోదైంది. అలాగే, బఫర్‌జోన్‌లోఎల్‌వోసీ జారీకి రూ. రెండులక్షలు లంచం డిమాండ్‌ చేసిన కేసులో నీటి పారుదలశాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరింగ్‌ బన్సీలాల్‌తోపాటు ఏఈ కార్తిక్‌, ఏఎస్‌డబ్ల్యూ సెక్షన్‌ అధికారి నిఖేశ్‌కుమార్‌, గండిపేట సర్వేయర్‌ గణేశ్‌ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు.

మున్సిపల్‌శాఖలో..

జిల్లాలోని మున్సిపల్‌ కార్యాలయాల్లోనూ అవినీతి పెరిగిపోతున్నది. శేరిలింగంపల్లి, బడంగ్‌పేట, ఆదిబట్ల మున్సిపల్‌ కార్యాలయాల్లో ఇటీవల ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. బడంగ్‌పేటలో ఏకకాలంగా కమిషనర్‌ సహా పదిమంది ఉద్యోగులపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ బది లీ వేటేశారు. నార్సింగి టీపీవో మణిహారిక ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియరెన్స్‌కు రూ. పదిలక్షలు డిమాండ్‌ చేసి రూ.నాలుగు లక్షలు లంచం తీసుకుంటూ.. అలా గే, రాజేంద్రనగర్‌ డిప్యూటీ కమిషనర్‌ అక్రమ నిర్మాణానికి ఇంటినంబర్‌ జారీకోసం..

మణికొండ జలమండలి మేనేజర్‌ నల్లా కనెక్షన్‌ కోసం.. ఆదిబట్ల టీపీవో సైతం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అలాగే, తుర్కయాంజాల్‌ పరిధిలోని గ్రామకంఠం భూమి రిజిస్ట్రేషన్‌ కోసం రూ. 70వేలు లంచం తీసుకుంటూ వనస్థలిపురం సబ్‌రిజిస్ట్రార్‌ .. అలాగే, లంచం తీసుకుంటూ హయత్‌నగర్‌ సబ్‌రిజిస్ట్రార్‌, రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ విశ్వవిద్యాలయంలో విత్తన కంపెనీకి లైసెన్స్‌ జారీ కోసం రూ. 20 వేలు లం చం తీసుకుంటూ గోవర్ధ్దన్‌ అనే అధికారి పట్టుబడ్డాడు. అలాగే.. మణికొండ మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ డీఈ దివ్యజ్యోతిపై ఆదాయానికి మించి ఆస్తుల కేసును నమోదు చేశారు.

తాజాగా..

అవినీతి ఆరోపణల నేపథ్యంలో శంషాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో పనిచేస్తున్న తహసీ ల్దార్‌తోపాటు పలువురు సిబ్బందిపై ఏసీబీకి వచ్చిన ఫిర్యాదుల మేరకు మూడు రోజులపాటు కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల నేపథ్యంలో అక్కడి నుంచి తహసీల్దార్‌ ను బదిలీ చేశారు. అలాగే, శుక్రవారం ఆదా యానికి మించి ఆస్తుల కేసులో మేడ్చల్‌ డిప్యూటీ కలెక్టర్‌ వంశీమోహన్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి ఏకకాలంలో పది ఇండ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ. వంద కోట్లకు పైగా అక్రమాస్తులను కూడబెట్టారని గుర్తించారు. జిల్లాలో అవినీతి తీవ్రస్థాయికి చేరినా దిద్దుబాటు చర్యలు తీసుకోవటం లేదన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వ కార్యా లయాల్లో లంచం ఇవ్వనిదే పనులు జరగడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana