Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Landowners | అమ్ముకోలేక అవస్థలు.. రిజిస్ట్రేషన్లు కాక.. యజమానుల ఆవేదన.. పిల్లల వివాహాలు చేయలేక కన్నీరు

Landowners | అమ్ముకోలేక అవస్థలు.. రిజిస్ట్రేషన్లు కాక.. యజమానుల ఆవేదన.. పిల్లల వివాహాలు చేయలేక కన్నీరు

  • పిల్లల వివాహాలు చేయలేక కన్నీరు
  • 22ఏ నిషేధిత జాబితా తెచ్చిన కష్టం
  • ఎస్‌ఆర్వో కార్యాలయాలు వెలవెల
  • గతంలో రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా వెయ్యి రిజిస్ట్రేషన్లు జరిగేవి..
  • ప్రస్తుతం 600 దాటని పరిస్థితి

రంగారెడ్డి, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌ చుట్టూ విస్తరించి ఉన్న రంగారెడ్డిజిల్లా పరిధిలోని పలు శివారు ప్రాంతాల్లో హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు గతంలో ప్లాట్లను కొనుగోలు చేసి పెట్టుకున్నారు. 22ఏ నిషేధిత జాబితా వచ్చిన తర్వాత సొంత అవసరాల కోసం స్థిరాస్తులను (ఇండ్లు, ప్లాట్లు) అమ్ముకోడానికి యజమానులు ఎస్‌ఆర్వో కార్యాలయాలకు వెళ్తే ఆయా ఆస్తులు నిషేధిత జాబితాలో ఉన్నాయని అధికారులు తెలపడంతో బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూములు అమ్ముకుందాం అంటే రిజిస్ట్రేషన్లు కాక.. కొనుగోలు చేసిన భూములకు అనుమతులు రాక వారి పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలాగా తయారయ్యింది. మరోవైపు తమ పిల్లల పెళ్లిళ్లకు ఉన్న ప్లాట్లను అమ్ముకుందామంటే అవి నిషేధిత జాబితాలో ఉండటంతో తమ కలలు కన్నీళ్లవుతున్నాయని వాపోతున్నారు. ముఖ్యంగా మన్నెగూడ, రాగన్నగూడ, తుర్కయాంజాల్‌ గ్రామాల్లో రెండు మూడు వెంచర్లను పూర్తిగా నిషేధిత జాబితా పరిధిలోకి తీసుకొచ్చారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

గణనీయంగా తగ్గిన రిజిస్ట్రేషన్లు..

జిల్లాలో 18 ఎస్‌ఆర్వో కార్యాలయాలున్నాయి. వీటి పరిధిలో నిషేధిత జాబితాకు ముందు ప్రతిరోజూ 1000-1100 వరకు రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్లు బుక్‌ చేసుకునేవారు. కానీ, నిషేధిత జాబితా వచ్చిన తర్వాత రోజుకు 500-600 కూడా రిజిస్ట్రేషన్లు కావడంలేదని అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రంగారెడ్డి, గండిపేట్‌ వంటి ఎస్‌ఆర్వో కార్యాలయాల్లో రోజుకు వంద స్లాట్ల చొప్పున కేటాయించేవారు. అయినా కూడా రిజిస్ట్రేషన్ల కోసం పోటీ ఉండేది. కాని, ప్రస్తుతం వీటి పరిధిలో 50 నుంచి 60 శాతం కూడా జరగడంలేదు. మిగిలిన 14 కార్యాలయాల్లో కూడా రోజుకు 50 చొప్పున స్లాట్లు బుక్‌ చేసుకునే అవకాశముండేది. కాని, నిషేధిత జాబితా తర్వాత 50 శాతం కూడా స్లాట్‌లు బుక్‌ కావడం లేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

స్థిరాస్తులు నిషేధిత జాబితాలోకి..

ఇబ్రహీంపట్నం, తుర్కయాంజాల్‌, ఆదిబట్ల, కందుకూరు, మహేశ్వరం, తుక్కుగూడ, బాలాపూర్‌, మీర్‌పేట్‌, శంషాబాద్‌, రాజేంద్రనగర్‌, శంకర్‌పల్లి, మొయినాబాద్‌, చేవెళ్ల, గండిపేట్‌, నార్సింగి, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో విలువైన భూములు, ప్లాట్లు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోనే ప్లాట్లు, ఇతర స్థిరాస్తులు పెద్ద ఎత్తున నిషేధిత జాబితాలో చేరాయి. ఒక్కొక్క స్థిరాస్తిపై రెండు మూడు రిజిస్ట్రేషన్లు జరిగినప్పటికీ అలాంటివాటిని కూడా నిషేధిత జాబితాలో చేర్చారు. జాబితాపై పునఃపరిశీలిస్తామని, త్వరలోనే తప్పులు సరిదిద్ది కొత్త జాబితాను ప్రకటిస్తామని అధికారులు చెప్తున్నప్పటికీ ఇప్పటివరకు జాబితాను ప్రకటించలేదు. దీంతో ఇప్పట్లో 22ఏ సమస్య ప్రజలను విడిచిపెట్టే పరిస్థితి లేదని అవగతమవుతున్నది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana