Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లోన్‌ రైటాఫ్‌ 22వేల కోట్లు కాదు..

లోన్‌ రైటాఫ్‌ 22వేల కోట్లు కాదు..

న్యూఢిల్లీ, ఆగస్టు 27: ఎస్సెల్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు సుభాష్‌ చంద్ర కేసులో నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఆమోదించిన రీపేమెంట్‌ ప్లాన్‌ ఉద్దేశం..

రూ.22,000 కోట్ల రుణాల్లో 99.97 శాతం బ్యాంకులు రైటాఫ్‌ చేస్తాయని కాదని చెప్తున్నారు. ఈ కేసులో రుణదాతలు చేసిన రూ.22,006 కోట్ల క్లెయిమ్‌లకు చంద్ర గ్యారంటీర్‌ మాత్రమేనని అంటున్నారు. ఈ రుణాలన్నీ వివిధ ఎస్సెల్‌/జీ సంబంధిత కంపెనీలు తీసుకున్నాయని, చంద్ర వ్యక్తిగతంగా తీసుకోలేదని గుర్తుచేస్తున్నారు. ఎన్‌సీఎల్‌టీ ఆర్డర్‌లో ఈ వ్యత్యాసాన్ని గుర్తించడం కీలకమని సదరు వర్గాలు సూచిస్తున్నాయి.

నిజాలు చెప్పండి..

మరోవైపు గురువారం ఈ వ్యవహారంపై సుభాష్‌ చంద్ర కూడా స్పందించారు. కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఓ ప్రకటనలో దుయ్యబట్టారు. అసలు తాను ఏ రుణదాత దగ్గర్నుంచి వ్యక్తిగతంగా ఒక్క రూపాయిని కూడా అప్పుగా తీసుకోలేదని, పూచీకత్తును మాత్రమే ఇచ్చానంటున్న చంద్ర.. అదికూడా రూ.22,000 కోట్లకు కాదని, రూ.3,992 కోట్లకేనని స్పష్టం చేశారు. అలాగే ఇందులో రూ.620 కోట్ల చెల్లింపులు జరిగాయని, రుణగ్రహీతలు మరో రూ.1,063 కోట్లను చెల్లించేందుకూ ముందుకొచ్చారని చెప్పారు. ఇదిలావుంటే తాను పూచీకత్తుగా ఉన్న మొత్తం కంపెనీల బకాయిలు దాదాపు రూ.45,000 కోట్లుగా ఉంటే.. ఇప్పటిదాకా సుమారు రూ.43,000 కోట్లను చెల్లించేశారని వివరించారు. మిగతా సొమ్మునూ చెల్లిస్తామని రుణగ్రహీతలు హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఇక తన వ్యక్తిగత సంపదకు సంబంధించి కూడా తప్పుడు ప్రచారం జరిగిందన్నారు. కాగా, ఈ కేసులో 80.81 శాతం రుణదాతలు ఎన్‌సీఎల్‌టీ ప్లాన్‌ను సమర్థించడంతో రీపేమెంట్‌ ప్లాన్‌ ఆమోదం పొందింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana