Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మాది దిల్‌దార్‌ సర్కార్‌.. ఓట్లు అడిగే హక్కు మాకే ఉంది

మాది దిల్‌దార్‌ సర్కార్‌.. ఓట్లు అడిగే హక్కు మాకే ఉంది

జీడిమెట్ల : 'మాది దిల్‌దార్‌ సర్కార్‌.. ఓట్లు అడిగే హక్కు మాకే ఉంది. కాంగ్రెస్‌, కమలం నేతలు ఎన్ని కల్లబొల్లి మాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రతి గడపకు ప్రభుత్వ పథకాలు అందినయి. గడిచిన ఐదేండ్లలో జరిగిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నగరవ్యాప్తంగా 104 డివిజన్లలో గులాబీ జెండా ఎగురవేస్తాం. బల్దియా పీఠాన్ని కైవసం చేసుకుంటాం' అని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ధీమా వ్యక్తంచేశారు.

అభివృద్ధి అంటే ఆ రెండు పార్టీలకు తెలుసా..?

సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ కృషితో మహానగరం గడిచిన ఐదేండ్లలో విశ్వనగరంగా మారిందని మంత్రి మల్లారెడ్డి చెప్పారు.

ప్రతి డివిజన్‌కు కోట్లాది రూపాయల నిధులు కేటాయించి ప్రతి కాలనీలో దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించారని తెలిపారు. కాలనీలలో జరిగిన అభివృద్ధిని, మార్పులను చూసి ప్రజలు ఓటేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి అనే పదం కాంగ్రెస్‌, బీజేపీలకు తెలుసా.. అని మంత్రి మల్లారెడ్డి ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ర్టాలను దోచుకొని కష్టాల్లోకి నెట్టేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజధాని అభివృద్ధికి ఒక్క పైసా కూడా నిధులు తీసుకురాని కేంద్ర మంత్రి, ఎంపీలు ఏ మొఖం పెట్టుకొని ప్రచారానికి వస్తున్నారని ప్రశ్నించారు. అభివృద్ధిపై మాట్లాడే దమ్ములేక మతం ముసుగులో వస్తున్నారని మండిపడ్డారు. ప్రజల మధ్యన కొట్లాట పెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తే.. నగర ప్రజలు అంత అమాయకులు కాదన్నారు. తమది హిందువుల పార్టీ అని చెప్పుకునే కాషాయం నేతలు నగరంలోని ఒక్క దేవాలయం అభివృద్ధికైనా నిధులు తీసుకొచ్చారా అని ప్రశ్నించారు.

మన్ననలు పొందుతున్న మ్యానిఫెస్టో..

జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విడుదల చేసిన మ్యానిఫెస్టో అన్ని వర్గాలను ఆకట్టుకుంటున్నదని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. ముఖ్యంగా 20వేల లీటర్ల వరకు ఉచిత నల్లానీరు, బార్బర్‌ షాపులు, లాండ్రీ షాపులు, దోబీఘాట్‌లకు ఉచిత విద్యుత్‌ సరఫరా, పరిశ్రమలకు కనీస డిమాండ్‌ చార్జీల రద్దు, ఆటో క్యాబ్‌ డ్రైవర్లకు పన్ను మినహాయింపు పట్ల ఆయా వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌లో ఎన్నికల కోసం మ్యానిఫెస్టోను ప్రకటించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఆయా పథకాలు అమలు అవుతాయని చెప్పారు. మచ్చలేని మనిషి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బి.విజయశేఖర్‌గౌడ్‌ను అఖండ మెజార్టీతో గెలిపిస్తే డివిజన్‌ ఇన్‌చార్జిగా అత్యధిక నిధులు కేటాయించి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని హామీ ఇచ్చారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana