Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మాగనూరులో సాగునీరు వృథా.. పంటలు మునిగి రైతులకు నష్టం

మాగనూరులో సాగునీరు వృథా.. పంటలు మునిగి రైతులకు నష్టం

మాగనూరు, ఆగస్టు 30: నారాయణపేట జిల్లా సంగంబండ రిజర్వాయర్‌ కెనాల్‌ కాలువకు గండి పడి ఏళ్లుగా సాగునీరు వృథాగా ప్రవహిస్తోంది. కాలువ నుంచి బయటకు వస్తున్న నీరు పంట పొలాల్లోకి చేరడంతో చేతికొచ్చే దశలో ఉన్న పంటలు మునిగిపోతున్నాయని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒకవైపు సాగునీరు వృథా అవుతుండగా.. మరోవైపు అధిక నీటితో పంటలు దెబ్బతింటున్నాయని చెబుతున్నారు.

కాలువ నుంచి వచ్చిన నీరు పొలాల్లోకి చేరడంతో పాటు రహదారిపై సైతం ప్రవహిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా.. క్షేత్రస్థాయికి వచ్చి పరిస్థితిని పరిశీలించి వెళ్లిపోవడం తప్ప మరమ్మతులు చేపట్టడం లేదని మండిపడుతున్నారు.

'పరిశీలనలతోనే సరిపెడతారా?'

రోజురోజుకూ నీరు వృథాగా పోతుండటంతో ఒకవైపు సాగునీటి కొరత ఏర్పడే పరిస్థితి ఉందని రైతులు అంటున్నారు. మరోవైపు అధిక నీటితో పంటలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేసిన రైతులకు నష్టం వాటిల్లుతున్నా అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మంత్రి ఇలాకాలోనే ఇంత నిర్లక్ష్యమా?

ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని రైతులు అంటున్నారు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోనే సాగునీరు వృథాగా పోతూ, పంటలు మునిగిపోతున్నా సంబంధిత శాఖ అధికారులు శాశ్వత చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి కాలువకు మరమ్మతులు చేపట్టి నీటి వృథాను అరికట్టాలని, దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana