Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మానేరుతీరం శోకసంద్రం

మానేరుతీరం శోకసంద్రం

  • ఈతకు వెళ్లి ఇద్దరు ఇంటర్‌ విద్యార్థుల మృత్యువాత
  • సిరిసిల్ల మానేరువాగుకు వెళ్లిన ఆరుగురు స్నేహితులు
  • మొదట నీటికుంటలో దిగిన ఇద్దరు గల్లంతు
  • బయటకు తీసి సీపీఆర్‌ చేసినా దక్కని ప్రాణాలు
  • శోకసంద్రంలో కుటుంబాలు
  • మృతుల్లో తోట ఆగయ్య మేనల్లుడి కొడుకు

రాజన్న సిరిసిల్ల, మే 22 (నమస్తే తెలంగాణ) : వారంతా స్నేహితులు.. వేసవి సెలవులు కావడంతో ప్రతిరోజూ కలుస్తూ సరదాగా గడుపుతున్నారు. రోజువారీలాగానే కలుసుకున్న వీరు స్విమ్మింగ్‌ కోసమని సిరిసిల్ల శివారులోని మానేరు వాగుకు వెళ్లారు. మొదట నీటి కుంటలో దిగిన ఇద్దరు గల్లంతుకాగా, విషయం తెలియడంతో తల్లిదండ్రుల గుండెలు పగిలిపోయాయి. వెంటనే అక్కడకు చేరుకొని, తమ పిల్లలను బతికించుకునేందుకు సీపీఆర్‌ చేస్తూ తల్లడిల్లినా.. అప్పటికే ప్రాణాలు గాల్లో కలిశాయి. ఇక తమ బిడ్డలు లేరని తెలిసి ఆ తల్లిదండ్రులు రోదించిన తీరు ప్రతి ఒక్కరినీ కలిచివేసింది.

ప్రశాంతంగా ఉన్న మానేరు తీరం శో కసంద్రమైంది. సిరిసిల్లలోని శాంతినగర్‌కు చెందిన ఎదురుగట్ల హరిచరణ్‌గౌడ్‌ (17), వేములవాడ మండ లం చీర్లవంచ ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి చెందిన అల్లం మణికంఠ (17), ఆవుల శివకుమార్‌, పులి అభిలాష్‌, పులి సాయిచరణ్‌, మంద అభిలాష్‌ స్నేహితులు. పదో తరగతి వరకు కలిసే చదువుకున్న వీరంతా, ప్రస్తుతం వేర్వేరు కళాశాలల్లో ఇంటర్‌ చదువుకుంటున్నారు. ఇటీవలే ఫస్టియర్‌ పూర్తి చేశారు. వేసవి సెలవులు రావడంతో నిత్యం కలుస్తూ ఉల్లాసంగా గడుపుతున్నారు. రోజువారీలాగానే శుక్రవారం ఉదయం 6గంటలకు కలిశారు. సిరిసిల్ల జూనియర్‌ కళాశాల మైదానానికి వెళ్లి, గంటకుపైగా క్రికెట్‌ ఆడుకున్నారు.

ఆ తర్వాత స్విమ్మింగ్‌ కోసమని సిరిసిల్ల శివారు రామప్ప ఆలయ సమీపంలోని మానేరు వాగులోకి వెళ్లారు. మణికంఠ, హరిచరణ్‌గౌడ్‌ నీటిగుంటలోకి దిగి, గల్లంతయ్యారు. ఇది చూసిన మిగతా నలుగురు స్నేహితులు భయాందోళనతో కేకలు వేశారు. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీస్‌, అగ్నిమాపక శాఖ అధికారులు అక్కడకు చేరుకున్నారు. నీటిలో మునిగిన మణికంఠ, హరిచరణ్‌గౌడ్‌ను వెలికి తీశారు. కుటుంబ సభ్యులు హరిచరణ్‌గౌడ్‌, మణికంఠకు సీపీఆర్‌ చేసి బతికించేందుకు ప్రయత్నం చేశారు. అయినా అప్పటికే మృతి చెందడంతో బోరున విలపించారు. పోలీసులు మృతదేహాలను సిరిసిల్ల దవాఖానకు పోస్టుమార్టం కోసం తరలించారు.

బీఆర్‌ఎస్‌ నేతల పరామర్శ

విద్యార్థుల మృతి విషయం తెలియడంతో బీఆర్‌ఎస్‌ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల్లో తన మేనల్లుడు అల్లం రమేశ్‌ కొడుకు మణికంఠ ఉన్న విషయం తెలిసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తర్వాత పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, నాయకులతో కలిసి సిరిసిల్ల ప్రభుత్వ దవాఖానకు చేరుకున్నారు. మృతుల కుటుంబాలను ఓదార్చారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. పోస్టుమార్టం పూర్తయ్యేంత వరకు అక్కడే ఉన్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తంగళ్లపల్లి ఎస్‌ఐ ఉపేంద్ర చారి తెలిపారు.

20న బర్త్‌డే.. అంతలోనే

ఎదురుగట్ల హరిచరణ్‌గౌడ్‌ కరీంనగర్‌లోని ఢిల్లీ ఢిఫెన్స్‌ కాలేజీలో ఇంటర్‌ చదువుతున్నాడు. ఇటీవలే ఫస్టియర్‌లో 453 మార్కులు సాధించాడు. వేసవి సెలవులు రావడంతో వేములవాడలో తన అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. ఈ నెల 20న తన బర్త్‌డే ఉండడంతో 19న సిరిసిల్ల శాంతినగర్‌లోని తన ఇంటికి వచ్చాడు.

తల్లిదండ్రులు, తన తమ్ముడు, స్నేహితులతో కలిసి పుట్టిన రోజు సంబురంగా జరుపుకొన్నాడు. బర్త్‌డే ముగిసిన తర్వాత అమ్మమ్మ ఇంటి నుంచి రమ్మని ఫోన్‌ వచ్చినా.. రెండు రోజుల తర్వాత వస్తానని చెప్పాడు. శుక్రవారం ప్రమాదవశాత్తూ నీట మునిగి చనిపోవడంతో తల్లిదండ్రులు చంద్రశేఖర్‌, లావణ్య కన్నీరుమున్నీరవుతున్నారు. మొన్ననే పుట్టిన రోజు చేసుకున్నాడని, అంతలోనే ఇలా దూరమయ్యాడని గుండెలు బాదుకుంటున్నారు.

డాడీ నేను రేపు వస్తానని..

అల్లం మణికంఠ కుటుంబం గతంలో సిరిసిల్లలో ఉన్నది. ప్రస్తుతం చీర్లవంచ ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో ఉంటున్నది. తల్లిదండ్రులు రమేశ్‌ అలియాస్‌ రాములు, సంధ్య. వీరికి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు మణికంఠ కరీంనగర్‌లోని అల్ఫోర్స్‌లో ఇంటర్‌ చదువుతున్నాడు. ఇటీవల ఫస్టియర్‌ 400కు పైగా మార్కులు సాధించాడు. వేసవి సెలవులు కావడంతో మణికంఠ శాంతినగర్‌లో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. పదో తరగతి వరకు చదువుకున్న స్నేహితులతో సరదాగా గడుపుతున్నాడు. గురువారం తండ్రి రమేశ్‌ ఇంటికి రమ్మని ఫోన్‌ చేయగా.. డాడీ నేను రేపు వస్తానని, స్నేహితులతో ఉంటానని చెప్పాడు. తెల్లారే ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. తండ్రి మాట విని ఇంటికి వస్తే ప్రాణాలైనా దక్కేవంటూ కన్నీరుమున్నీరయ్యారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana