Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మనదే జోరు

మనదే జోరు

  • రెండో టీ20లో భారత్‌ ఘన విజయం
  • మెరిసిన నితీశ్‌ , శాంసన్‌

న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్‌పై మళ్లీ భారత్‌దే పైచేయి. తెలుగు కుర్రాడు నితీశ్‌ రెడ్డి (3/24) సూపర్‌ బౌలింగ్‌కు తోడు ఓపెనర్‌ సంజూ శాంసన్‌ (22 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 57) మెరుపు అర్ధ శతకంతో విజృంభించిన వేళ వరుసగా రెండో టీ20లోనూ టీమిండియా ఘన విజయం అందుకుంది.

మంగళవారం జరిగిన ఈ పోరులో 7 వికెట్ల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసిన అయ్యర్‌సేన మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది.

అఫ్గాన్‌ ఇచ్చిన 160 పరుగుల లక్ష్యాన్ని 14.5 ఓవర్లలో మూడే వికెట్ల్లు కోల్పోయి ఛేదించింది. అభిషేక్‌ శర్మ (19 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 39), ఇషాన్‌ కిషన్‌ (23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 నాటౌట్‌) మెరిశారు. తొలుత అఫ్గాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 159/8 స్కోరుకు పరిమితం అయింది. కెప్టెన్‌ ఇబ్రహీం జద్రాన్‌ (37), రషీద్‌ ఖాన్‌ (28), డ్వారిష్‌ రసూలీ (26), మహ్మద్‌ నబీ (20) రాణించారు. అర్ష్‌దీప్‌ రెండు వికెట్లు తీశాడు. నితీశ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. గురువారం చివరి, మూడో టీ20 జరుగుతుంది.

ఓపెనర్ల జోరు
ఓపెనర్లు శాంసన్‌, అభిషేక్‌ దంచికొట్టడంతో మోస్తరు లక్ష్యాన్ని భారత్‌ అలవోకగా ఛేదించింది. తన ఫామ్‌ కొనసాగిస్తూ తొలి ఓవర్లోనే ముజీబ్‌కు వరుస ఫోర్లతో స్వాగతం పలికిన అభిషేక్‌.. మరో స్పిన్నర్‌ నబీ వరుస ఓవర్లలో రెండు సిక్సర్లతో అలరించాడు. క్రీజులో కుదురుకునేందుకు కొంచెం సమయం తీసుకున్న శాంసన్‌ తర్వాత తనదైన స్టయిల్లో భారీ షాట్లతో అలరించాడు. అజ్మతుల్లా వేసిన ఐదో ఓవర్లో మూడు ఫోర్లు, సిక్స్‌తో స్టేడియాన్ని హోరెత్తించాడు.

ఆపై నబీ బౌలింగ్‌లో అభి సిక్స్‌ కొడితే.. శాంసన్‌ 6, 4, 4, 6తో రెచ్చిపోవడంతో పవర్‌ప్లేలోనే భారత్‌ 82/0 స్కోరు చేసింది. ఏడో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన రషీద్‌కు తొలి బాల్‌కే సిక్స్‌ రుచి చూపించిన అభిషేక్‌ మరో సిక్స్‌కు ట్రై చేసి బౌండరీ లైన వద్ద సెదిఖుల్లాకు చిక్కగా.. 4,6 కొట్టిన శాంసన్‌ ఆఖరి బాల్‌కు నబీకి క్యాచ్‌ ఇచ్చాడు. ఒకే ఓవర్లో ఓపెనర్లు ఔటైన తర్వాత రన్‌రేట్‌ కొంచెం మందగించింది. నూర్‌ బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టిన తర్వాత ఇషాన్‌ స్లో అవ్వగా.. రషీద్‌ వేసిన 11వ ఓవర్లో సిక్స్‌ రాబట్టిన కెప్టెన్‌ శ్రేయస్‌(11) అతనికే వికెట్‌ ఇచ్చుకున్నాడు. అప్పటికే మ్యాచ్‌ భారత్‌ చేతుల్లోకి వచ్చింది.వైస్‌ కెప్టెన్‌ తిలక్‌ (15 నాటౌట్‌) తోడుగా ఇషాన్‌ మిగతా లాంఛనం పూర్తి చేశాడు.

నితీశ్‌ తీన్‌మార్‌..
తొలుత టాస్‌ నెగ్గి బౌలింగ్‌ ఎంచుకున్న కెప్టెన్‌ శ్రేయస్‌ నిర్ణయానికి బౌలర్లు న్యాయం చేశారు. ఆతిథ్య బౌలింగ్‌ దాడిని నితీశ్‌ రెడ్డి ముందుండి నడిపించగా ప్రత్యర్థి భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు. పేస్‌ లీడర్‌ బుమ్రా మెయిడిన్‌ ఓవర్‌తో బౌలింగ్‌ ఆరంభించగా.. రెండో ఓవర్లోనే ఓపెనర్‌ రహ్మనుల్లా గుర్బాజ్‌ (0)ను వైడ్‌ బాల్‌తో బోల్తా కొట్టించిన అర్ష్‌దీప్‌ అఫ్గాన్‌ను తొలి దెబ్బకొట్టాడు. కానీ, మరో ఓపెనర్‌ జద్రాన్‌ ఉన్నంతసేపు వరుస బౌండరీలతో జోరు చూపెట్టాడు. బుమ్రా, అర్ష్‌దీప్‌ తర్వాతి ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టిన అతను.. స్పిన్నర్లు అక్షర్‌, బిష్ణోయ్‌కు బౌండరీలతో స్వాగతం పలికాడు. దాంతో పవర్‌ ప్లేను అఫ్గాన్‌ 41/1తో ముగించింది. ఫీల్డింగ్‌ విస్తరించిన తర్వాత భారత బౌలర్లు మళ్లీ ఒత్తిడి పెంచారు.

అక్షర్‌, బిష్ణోయ్‌ పొదుపుగా బౌలింగ్‌ చేస్తే.. నితీశ్‌ తన వరుస ఓవర్లలో జద్రాన్‌, గుల్బదిన్‌ నైబ్‌ (10)ను ఔట్‌ చేసి ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు. మధ్యలో బిష్ణోయ్‌ బౌలింగ్‌లో తిలక్‌కు క్యాచ్‌ ఇచ్చి సెదిఖుల్లా (12) పెవిలియన్‌ చేరాడు. 63/4తో కష్టాల్లో పడ్డ జట్టును డ్వారిష్‌ రసూలీ, అజ్మతుల్లా (11) ఆదుకునే ప్రయత్నం చేసినా.. బౌలర్లు ఆ చాన్స్‌ ఇవ్వలేదు. 13వ ఓవర్లో అజ్మతుల్లాను అక్షర్‌, 15వ ఓవర్లో మళ్లీ బౌలింగ్‌కు దిగిన అర్ష్‌దీప్‌ ఔట్‌సైడ్‌ ఆఫ్‌ స్టంప్‌ బాల్‌తో రసూలీని వెనక్కుపంపారు. ఈ ఇద్దరూ తిలక్‌కే క్యాచ్‌లు ఇచ్చారు. దాంతో అఫ్గాన్‌ 150 మార్కు దాటడం కష్టమే అనిపించినా.. చివర్లో మాజీ కెప్టెన్లు నబీ, రషీద్‌ ఫోర్లు, సిక్సర్లతో ఎదురుదాడి చేశారు. బిష్ణోయ్‌ బౌలింగ్‌లో నబీ 4,6 కొడితే.. అర్ష్‌దీప్‌ను టార్గెట్‌ చేసిన రషీద్‌ 4, 4, 6తో జోరు చూపెట్టాడు. ఆఖరి బంతికి నూర్‌ అహ్మద్‌ (7 నాటౌట్‌) సిక్స్‌ కొట్టడంతో అఫ్గాన్‌ సంతృప్తికర స్కోరు చేసింది.

వరుణ్‌ మళ్లీ
టీమిండియా స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి మళ్లీ గాయపడ్డాడు. జూలైలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో తొడకండరాల గాయంతో మూడు నెలలు ఆటకు దూరమై ఇటీవలే టీమ్‌తో చేరిన అతనికి అఫ్గాన్‌తో తొలి టీ20 ముగిశాక పక్కటెముకల్లో గాయమైనట్టు బీసీసీఐ తెలిపింది. దీంతో వరుణ్‌ ఈ సిరీస్‌ మొత్తానికి దూరమవగా రాబోయే ఆసియా క్రీడలకూ ఆడటం అనుమానమేనని బోర్డు వర్గాలు తెలిపాయి.

10టీ20ల్లో అఫ్గానిస్థాన్‌పై భారత్‌కు ఇది వరుసగా పదో విజయం.

సంక్షిప్త స్కోర్లు
అఫ్గానిస్థాన్‌: 20 ఓవర్లలో 159/8 (జద్రాన్‌ 37, రషీద్‌ 28, నితీశ్‌ 3/24)
భారత్‌: 14.5 ఓవర్లలో 163/3 (శాంసన్‌ 57, అభిషేక్‌ 39, రషీద్‌ 3/36)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana