హైదరాబాద్: మిణుగురు పురుగు దాదాపు సెకనుకు రెండు సార్లు మిణుకు మిణుకుమంటూ వెలుగుతూ ఉంటాయి. వీటిలో కొన్ని మట్టిలో, మరికొన్ని నీటిలో నివసిస్తాయి. నీటిలో బతికే మిణుగురుల్లో మొప్పలు ఉంటాయి. ఇవి నత్తలను ఆహారంగా తీసుకుంటాయి. కాంతిని వెదజల్లే వీటిని చూసి శత్రువులు వీటి జోలికి రావు. శత్రువులకు ఆహారం కాకుండా ఉండేందుకు ఇవి కొన్ని రకాల రసాయనాలను కూడా విడుదల చేస్తాయి. గాలిలోని ఆక్సిజన్, మిణుగురుల శరీరంలోని క్యాల్షియం, అడినోసిన్ ట్రై ఫాస్ఫేట్ (ఏటీపీ), ల్యూసిఫెరిన్ అనే రసాయన చర్యవల్ల కాంతి వెలువడుతుంది. ల్యూసిఫెరిన్ విడుదలవడానికి ల్యూసిఫెరేజ్ అనే ఎంజైమ్ తోడ్పడుతుంది.
ఈ రసాయన చర్యలో వెలువడే కాంతి అత్యంత ప్రకాశవంతంగా ఉంటుంది.
తమ జాతికి చెందిన ఆడ మిణుగురులను ఆకర్షించేందుకు మగ మిణుగురులు ఎక్కువ ప్రకాశవంతమైన కాంతిని వెదజల్లుతాయి. మిణుగురు పురుగులు చీకట్లో మాత్రమే తిరిగే జాతుల్లో లామ్‌ఫిరిడే కుటుంబానికి చెందినవి. గ్రీకు భాషలో 'లామ్‌ఫీన్' అంటే 'వెలగడం' అని అర్థం. ఇంద్రధనస్సులోని దాదాపు అన్ని రంగుల్ని ఇవి వెదజల్లుతాయి. మిణుగురుల నుంచి వచ్చే కాంతి ఆకుపచ్చ, పసుపు, లేత ఎరుపు, నారింజ రంగులో ఉంటుంది. సందర్భాన్ని బట్టి కాంతిలో తేడాలు చూపిస్తాయి. మిణుగురులు లార్వాదశ నుంచి ఫ్రౌడ దశకు వచ్చే క్రమంలో వాటి ఆహారపు అలవాట్లు మారిపోతాయి. లార్వాదశలో ఇవి మాంసాహారులు. నత్తలను, వానపాములను, చిన్న చిన్న పురుగులను ఇష్టంగా తింటాయి. పెద్దయ్యాక మొక్కల ఆకులను, పూల మకరందాన్ని మాత్రమే ఆహారంగా తీసుకుంటాయి.

