Misbah-ul-Haq : అనిశ్చితికి కేరాఫ్ అయిన పాకిస్థాన్ క్రికెట్‌లో మరోసారి ముసలం మొదలైంది. లార్డ్స్ టెస్టులో ఓటమితో ఆగ్రహించిన పాక్ క్రికెట్ బోర్డు స్క్వాడ్‌లోని సీనియర్లను స్వదేశానికి పంపడంపై దుమారం రేగుతోంది.
సిరీస్ మధ్యలోనే సీనియర్లను, కోచ్ సర్ఫరాజ్ అహ్మద్‌ను సైతం బాధ్యతల నుంచి తప్పించడంపై రగిలిపోయిన సెలెక్టర్ మిస్బావుల్ హక్ (Misbah-ul-Haq) రాజీనామా చేశాడు. మంగళవారం అతడు హఠాత్తుగా తన పదవిని వదులుకున్నాడు.
ఇంగ్లండ్ పర్యటనలో బ్యాటర్ల వైఫల్యంతో టెస్టు సిరీస్ కోల్పోయింది పాకిస్థాన్. లార్డ్స్ టెస్టులో ఒక్కరోజే ఆలౌటవ్వడంతో ఆ దేశ క్రికెట్ బోర్డు కఠిన చర్యల్లో భాగంగా.. ముగ్గురు సీనియర్లతో కలిపి ఏడుగురిని స్వదేశానికి పంపింది. పైగా కోచ్ సర్ఫరాజ్ అహ్మద్‌ను తప్పించి.. మూడో టెస్టుకు వైట్‌బాల్ కోచ్ మైక్ హెసన్‌కు బాధ్యతలు అప్పగించింది పీసీబీ.
అంతేకాదు బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌ను సైతం సాగనంపింది. తాము ఎంపిక చేసిన స్క్వాడ్‌లోని ఆటగాళ్లను బోర్డు ఇలా అవమానించడంతో నొచ్చుకున్న సెలెక్టర్ మిస్బావుల్ హక్ తన పదవికి రాజీనామా చేశాడు. అయితే.. అతడి రాజీనామాను పాక్ బోర్డు ఇంకా ఆమోదించలేదు. నేషనల్ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ కోచ్ పదవికి కూడా మిస్బా వదుకోనున్నాడని సమాచారం.
ఏడుగురు ఔట్
లార్డ్స్ టెస్టులో ఓటమి అనంతరం రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ అఘా, అలీ ఉస్మాన్, అమీర్ జమాల్, అవైస్ జఫార్, ఖుర్రం షెహజాద్.. ఈ ఏడుగురిని స్క్వాడ్ నుంచి తప్పించింది పాక్ బోర్డు. సయీం అయూబ్‌తో పాటు ఐదుగురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు అరాఫత్ మిన్హాస్, మొహమ్మద్ ఇమ్రాన్, సాద్ బైగ్, ఇమ్రాన్ రంధవా, రజుల్లాహ్‌లు చివరి టెస్టుకోసం స్క్వాడ్‌తో కలువనున్నారు.
194 రన్స్ తేడాతో
హెడింగ్లేలో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్ రెండో టెస్టులోనూ జయభేరి మోగించింది. లార్డ్స్‌లో నాలుగోరోజు పేసర్లు ఓలీ రాబిన్సన్(4-24), జోఫ్రా ఆర్చర్(2-73)లు విజృంభించగా 194 రన్స్ తేడాతో పాక్‌ను ఓడించింది ఆతిథ్య జట్టు. 389 పరుగుల భారీ ఛేదనలో షాద్ షకీల్(97) పోరాడినా.. మిడిలార్డర్ వైఫల్యం పాక్‌ను ముంచింది.
టీ బ్రేక్ తర్వాత జోష్ టంగ్(3-46) ధాటికి ప్రత్యర్థి బ్యాటర్లు తోకముడిచారు. దాంతో, సిరీస్ సమం చేయాలనుకున్న పాక్ ఆశలు అడియాశలయ్యాయి. బెన్ స్టోక్స్ వీడ్కోలు తర్వాత తిరిగి పగ్గాలు చేపట్టిన జో రూట్ సారథిగా స్వదేశంలో తొలి టెస్టు సిరీస్ విజయం సాధించాడు. నామమాత్రమైన మూడో టెస్టు సెప్టెంబర్ 9న బర్మింగ్‌హమ్‌లో జరుగనుంది.

