Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మొరాయిస్తున్న మెట్రో.. పడకేసిన నిర్వహణ.. తరచూ అంతరాయం

మొరాయిస్తున్న మెట్రో.. పడకేసిన నిర్వహణ.. తరచూ అంతరాయం

  • గేట్లు తెరుచుకోక ప్రయాణికుల ఇబ్బందులు
  • సాంకేతిక లోపాలతో గంటల తరబడి పడిగాపులు
  • సర్కార్‌ చేతిలో ఆటబొమ్మలా మెట్రో నిర్వహణ

హైదరాబాద్‌ నగరవాసులకు మెట్రో రైళ్ల మొరాయింపుల నుంచి మోక్షం కలిగేలా లేదు.

శనివార ఉదయం సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరీ ముఖ్యంగా ఆన్‌లైన్‌లో టికెట్‌ కొనుగోలు చేసిన ప్రయాణికులకు స్టేషన్ల వద్ద తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. మెట్రో స్టేషన్లలోని ఎంట్రీ, ఎగ్జిట్‌ గేట్ల వద్ద సెన్సార్లు పనిచేయక ప్రయాణికులు క్యూలో నిలిచిపోయారు. ఆన్‌లైన్‌లో ముందుగానే టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులు కూడా స్టేషన్‌లోకి అడుగుపెట్టలేకపోయారు. టికెట్లను స్కాన్‌ చేయాల్సిన సెన్సార్లలో వచ్చిన సాంకేతిక సమస్యలతో ఇన్‌గేట్‌, అవుట్‌ గేట్ల వద్ద ప్రయాణికులను నిలిచిపోయేలా చేసింది.

పీక్‌ అవర్స్‌లో సాంకేతిక సమస్యలు..

శనివారం ఉదయం నుంచే పలు స్టేషన్లలో సాంకేతిక సమస్యలు వచ్చినట్లుగా తెలిసింది. అయితే పీక్‌ అవర్స్‌ నాటికి ఈ సమస్య తీవ్రత పెరిగినట్లుగా సమాచారం. దీంతో ఆఫీసులు, స్కూళ్లు, విద్యాసంస్థలకు వెళ్లేవారు మెట్రో స్టేషన్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యలతో గంటకు పైగా ఎదురుచూడాల్సినపరిస్థితి వచ్చింది. సెన్సార్లు పనిచేయకపోవడంతో ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో స్టేషన్‌ సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించే వీల్లేక ప్రయాణికులు మరింత అసంతృప్తికి గురయ్యారు. దాదాపు 12 స్టేషన్లలో ఈ సమస్య వచ్చినట్లుగా తెలిసింది. కానీ మెట్రో యంత్రాంగం ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు. అదే విధంగా కారణాలను కూడా పేర్కొనలేదు.

నిర్వహణ లోపాలే…

సర్కారు పూర్తి పర్యవేక్షణలోకి రాక ముందే మెట్రో నిర్వహణ అధ్వాన్నంగా మారితే… ఇక ప్రభుత్వ పర్యవేక్షణలో మెట్రో ప్రయాణం ఊహించలేమని ఇప్పుడే ప్రయాణికులు భయపడిపోతున్నారు. టికెట్లు కొనుగోలు చేసి కూడా గంటల తరబడి గేట్ల వద్ద ఎదురుచూడాలంటే చాలా ఇబ్బందిగా, కీలకమైన సమయం వృథా అవుతుందనీ వాపోతున్నారు. ఆధునాతన సాంకేతికత సాయంతో పనిచేయాల్సిన మెట్రోలో ఇలా తరుచుగా వచ్చే సమస్యలకు ప్రధాన కారణం నిర్వహణ పడకేయడమేనని ప్రయాణికులు మండిపడుతున్నారు. ముఖ్యంగా రద్దీ సమయాల్లో వచ్చే సమస్యలతో మెట్రో ప్రయాణమే భయపడాల్సి వస్తుందనీ, ఎప్పుడూ, ఎక్కడ అగిపోతుందోననే అనుమానం, గమ్యస్థానాలకు చేరేంత వరకు నమ్మకం లేని ప్రయాణంగా మారిపోతుందనీ ఆగ్రహాం వ్యక్తం చేశారు.

పర్యవేక్షణ మరిచి.. అధికారుల పర్యటనలు..

చాలీ చాలనీ బోగీలతో నెట్టుకొస్తున్న మెట్రో సంస్థ ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించడంలో విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో పర్యవేక్షణ చేయాల్సిన హెచ్‌ఎంఆర్‌ఎల్‌ యంత్రాంగం పట్టించుకోలేదు. కనీసం మెట్రో సేవల్లో అంతరాయానికి గల కారణాలను అన్వేషించనీ అధికారులు… భూసేకరణ పూర్తి కానీ ఓల్డ్‌ సిటీ మెట్రో కారిడార్‌లో పర్యటించి హడావుడి చేశారని ప్రయాణికులు మండిపడ్డారు. మెట్రో రైలు జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అజిత్‌ రెడ్డి, అధికారులతో కలిసి ఓల్డ్‌ సిటీ భూసేకరణ పర్యవేక్షించారే తప్పా… మెట్రో రైలులో తరుచుగా వచ్చే సాంకేతిక సమస్యలపై ఎందుకు దృష్టి పెట్టడం లేదనీ ప్రయాణికులు మండిపడుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana