Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మోసపోతే గోసపడ్తం!

మోసపోతే గోసపడ్తం!

తెలంగాణపై విషం చిమ్మినవారిలో కొందరి మాటలు అవి. ఇందులో మన ప్రాంతం వాళ్లు కూడా ఉండటం విషాదం! ఈ విషప్రయోగం రోజూ నడుస్తూనే ఉన్నది. దీనికి అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నడు రేవంత్‌ రెడ్డి!

తెలంగాణ సిద్ధించిన తర్వాత కూడా తమ మాట వినే గవర్నర్‌కు హక్కులు ధారాదత్తం చేసే 'చాప్టర్‌ 8' అమలు చేయాలంటూ తన యజమాని అజెండాను నెత్తికెత్తుకున్నవాడు రేవంత్‌. ఇతను తన బాస్‌ ఆనతి తలదాల్చి తొట్టతొలి ప్రభుత్వాన్ని కూల్చ ప్రయత్నించి ఊచలు లెక్కపెట్టిన సీమాంధ్ర బానిస. అలాంటివాడు తెలంగాణ ముఖ్యమంత్రి కావటం మాటల్లో వర్ణించలేని దౌర్భాగ్యం! సీఎం అయ్యాక కూడా మారలేదు సరికదా మరింత బలుపుతో తెలంగాణను బొంద పెట్టే ప్రయత్నాలు చేస్తున్నడు. 'నీళ్లు-నిధులు-నియామకాలు' అనే ఉద్యమ ట్యాగ్‌లైన్‌ కూడా తనదైన రీతిలో అమలుపరుస్తున్నడు. మన నీళ్లు చంద్రబాబుకు, నిధులు రాహుల్‌ గాంధీకి, సీఎంవోలో సైతం నియామకాలు సీమాంధ్రులకు కట్టబెడుతున్నడు.

కనీస విలువలు, సిద్ధాంతాలు లేని మనిషి రేవంత్‌రెడ్డి. జీవితాంతం కాంగ్రెస్‌ను వ్యతిరేకించిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా ఆవిష్కరించటం మాత్రమే కాదు; ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని అన్యాయంగా కూల్చేసిన ఇందిరను-ఎన్టీఆర్‌ను కలిపే ప్రయత్నం చేస్తున్నడు. ఎటూ కాని ఈ బైరూపిని తెలుగుదేశం అభిమానులు ఆకాశానికి ఎత్తటం దరిద్రంలోకెల్లా దరిద్రం. మురికి అంతా కలిసినా, ఆ నీటిలో తన పంట పండుతుందని చంద్రబాబు సంబురం! ఏతావాతా..బీజేపీ, కాంగ్రెస్‌, టీడీపీ, జనసేన, కమ్యూనిస్టులు, ఎంఐఎం, కవిత పార్టీ, పచ్చమీడియా, కాసుల కక్కుర్తి యూట్యూబర్లు, తేలుకుట్టిన దొంగల్లాంటి మేధావులు ఒకవైపు; ఈ దుష్టకూటమిని ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఒక్కటి ఒకవైపు. అంటే, అర్థం కావటం లేదూ? ఎవరు తెలంగాణ పక్షమో, ఎవరు తెలంగాణకు నష్టమో?!

ఆంధ్ర పోలీసులు మన రాజకీయ విశ్లేషకులను, జర్నలిస్టులను అరెస్టు చేయటానికి వస్తరు; మన హైడ్రా చీఫ్‌ అమరావతి పోయి డీసీఎంతో రెండు గంటలకుపైగా మంతనాలు ఆడుతరు అర్థం కావడం లేదూ..పరిపాలనా కేంద్రం ఎక్కడ ఉన్నదో? మన సలహాదారులు, మంత్రులు చంద్రబాబుకు సాగిలపడుతుంటరు; విధానపర నిర్ణయాలు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో తీసుకున్నా,అమరావతిలో ఉన్న రేవంత్‌ హైకమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఆమోదం లేకుండా ఏదీ జరగదు!

ఎన్ని సమస్యల్లో ఉన్నది నేడు రాష్ట్రం! అత్యాచారాలకు గురవుతున్న మైనర్‌ బాలికలు; ధాన్యం కొనుగోళ్ల డిమాండ్‌తో రోడ్డెక్కుతున్న రైతాంగం; మా భూములు మాకేనని నినదిస్తున్న జనం; ప్రభుత్వోద్యోగుల ధర్నాలు; విద్యార్థులు-నిరుద్యోగుల ఆందోళనలు; ఫార్మాసిస్ట్‌ల నిరసనలు; కలుషితాహారం బారిన పడుతున్న విద్యార్థులు; ప్రశ్నించే గొంతుకలపై ఉక్కుపాదం; పేదలను రోడ్డుకు ఈడుస్తున్న హైడ్రా; కోర్టుల ఆదేశాలనూ లెక్కచేయని నిర్లక్ష్యం! వీటిలో ఏ ఒక్క అంశంపైనా మాట్లాడదు దుష్టకూటమి. ఒక్క బీఆర్‌ఎస్‌ తప్ప ఎవరైనా ఆందోళనలు చేస్తున్నరా? అంటే, కట్టగట్టుకుని అందరూ తెలంగాణ వ్యతిరేక శిబిరంలో చేరినట్లే కదా?!

రెండున్నరేండ్లుగా అభివృద్ధి, సంక్షేమం నిలిచిపోయినయి. తెలంగాణ సంస్కృతి విచ్ఛిన్నం అవుతున్నది, తెలంగాణ అస్మిత పనికిరానిదన్న నెరేటివ్‌ బలంగా తోసుకొస్తున్నది. అస్తిత్వం సెంటిమెంట్‌ స్థాయికి దిగజారుతున్నది. ఆభివృద్ధి-సంక్షేమాలు ముందో, వెనుకో నడుస్తనే ఉంటయ్‌. ఆత్మ చచ్చిన తర్వాత, అస్తిత్వం కనుమరుగైన తర్వాత, బానిసత్వంలోకి మళ్లీ కూరుకుపోయిన తర్వాత..భాష, యాస, ఆహారం, ఆహార్యం, ఆచారం, వ్యవహారం అన్నిటా పరాయితనం ఆవరించిన తర్వాతి బతుకు యెంత భయానకం? మునుపటి చీకటి రోజులు దుష్టకూటమి మళ్లీ తేనున్నదనే ప్రమాద హెచ్చరికలు రోజూ జారీ అవుతూనే ఉన్నయి, భయం గొలుపుతూనే ఉన్నయి. 'మోసపోతే గోసపడుతం' అని కేసీఆర్‌ అంటే వినలేదు, ఫలితం అనుభవిస్తున్నం.బతుకులు ఆగమయినయి. మరోసారి మోసపోతే.. బతుకులు కాదు, ఉనికే ఉండదు. జీవచ్చవాలు అయితము. ఎంతలా అంటే, మన బానిసత్వం కూడా ఎరుక లేనంత! ఇప్పటికైనా మనం మేల్కొనాలి. నది రాత్రిపూట కూడా నిదురించదు. తెలంగాణ చైతన్య ప్రవాహమైన కేసీఆర్‌ కూడా అంతే. దుష్టకూటమిపై పాంచజన్యం పూరిస్తున్నడాయన; మనమూ సిద్ధం కావాలి. ఈ జూన్‌ 2 ఎప్పటిలాంటిది కాదు; చావో రేవో తేల్చుకోవాల్సిన ప్రాముఖ్యం కలది! లైఫ్‌ లైన్‌ లేదా డెడ్‌లైన్‌ అనేది తేల్చుకోవటానికి ఇక చివరి అవకాశం!

  • 'తల్లిని చంపి బిడ్డను బతికించారు
    -నరేంద్ర మోదీ
  • 'సీమాంధ్రుల ఆమోదం లేకుండా యెట్లా ఇస్తారండీ తెలంగాణ?
    -చంద్రబాబు
  • 'తెలంగాణ ఏర్పాటు చేస్తే హైదరాబాద్‌లో శాంతిభద్రతలు క్షీణిస్తాయి
    -కిరణ్‌ కుమార్‌రెడ్డి
  • 'తెలంగాణవాసులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా మాకు ఎలాంటి నష్టం లేదు, సమైక్య ఆంధ్రప్రదేశే మా నినాదం
    -జేసీ దివాకర్‌రెడ్డి
  • 'ప్రత్యేక తెలంగాణ ఒక మిత్‌
    -కనుమూరి బాపిరాజు
  • 'తెలంగాణ ఇస్తే రాష్ట్రంలో అశాంతి రాజుకుంటుంది
    -వి.హనుమంతరావు
  • 'తెలంగాణ అనే పదమే డిక్షనరీలో లేదు
    -బక్కని నర్సింహులు
  • 'తెలంగాణ వచ్చిన రోజు నుంచి 11 రోజుల పాటు నేను పచ్చి మంచినీళ్లు ముట్టలేదు. తెలంగాణ దిష్టి తగిలి మా కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి
    -పవన్‌ కల్యాణ్‌

-శ్రీశైల్‌ రెడ్డి పంజుగుల
90309 97371

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana