Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ముస్లింలకు కుల సర్టిఫికెట్ల కష్టాలు.. మహ్మద్‌ ఇంటిపేరున్నవారికి బీసీ-ఈ సర్టిఫికెట్‌ నిరాకరణ

ముస్లింలకు కుల సర్టిఫికెట్ల కష్టాలు.. మహ్మద్‌ ఇంటిపేరున్నవారికి బీసీ-ఈ సర్టిఫికెట్‌ నిరాకరణ

  • ప్రశ్నిస్తే ప్రభుత్వ ఉత్తర్వుల్లో లేదని చెబుతున్న తహసీల్దార్లు
  • జీవోను సవరించి న్యాయం చేయాలని ముస్లింల డిమాండ్‌

హైదరాబాద్‌, జూన్‌ 1(నమస్తే తెలంగాణ) : మైనారిటీ ముస్లింల్లోని ఓ వర్గానికి చెందినవారు కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ల కోసం అష్టకష్టాలు పడుతున్నారు.

ప్రభుత్వం చేసిన తప్పిదం మహ్మద్‌ ఇంటిపేరు ఉన్నవారికి శాపంగా మారిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సర్కార్‌ జారీ చేసిన జీవోఎంఎస్‌-3లో కేవలం షేక్‌ ఇంటిపేరును చేర్చి, మహ్మద్‌ను విస్మరించిందని ఆరోపిస్తున్నారు. ఈ కారణంగా రాష్ట్రంలోని అనేక మండలాల్లోని తహసీల్దార్లు బీసీ-ఈ సర్టిఫికెట్లు జారీ చేసేందుకు నిరాకరిస్తున్నారని వాపోతున్నారు. ఇదేమిటని అడిగితే ప్రభుత్వ ఉత్తర్వులను సాకుగా చూపుతున్నారని చెప్తున్నారు.

ఈబీసీ.. ఈడబ్ల్యూఎస్‌ వర్తింపజేయరు

తెలంగాణలో ముస్లింలను 14 ఉప కులాలుగా విభజించారు. వీరికి 4శాతం రిజర్వేషన్లు అమలుచేస్తున్నారు. వారి ఆర్థిక పరిస్థితులను బట్టి తెలంగాణలో బీసీ-సీ, బీసీ-ఈ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. 14 ఉపకులాల్లోని పకీర్‌, ఖురేషీలకు మాత్రమే ఈబీసీ కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరుచేస్తున్నారు. మిగిలిన వారికి ఈబీసీ సర్టిఫికెట్లు ఇవ్వడంలేదు. వీరికి ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు వర్తింపజేయడం లేదు. దీంతో తమ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైందని వాపోతున్నారు. రాష్ట్రంలోని అన్ని అగ్రవర్ణాలకు చెందిన వారికి ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్లు ఇస్తున్న అధికారులు, తమను విస్మరించడంతో మనోవేదనకు గురవుతున్నారు. దీంతో కేంద్రస్థాయిలో విద్య, ఉద్యోగాలతోపాటు సంక్షేమ పథకాలకు దూరమవుతున్నామని ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా సివిల్‌ సర్వీసెస్‌, ఐఎఫ్‌ఎస్‌, నీట్‌, జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో తీవ్రంగా నష్టపోతున్నామని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సంక్షేమ పథకాలు, ఉపాధి అవకాశాలకు దూరమవుతున్నామని వాపోతున్నారు.

కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు

మహ్మద్‌ ఇంటి పేరుకలిగిన ముస్లింలతోపాటు ఈబీసీ, ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్ల కోసం ముస్లింలు కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమవుతుండటంతో విద్యార్థులు తిరిగి తిరిగి వేసారిపోతున్నారు. చాలా మండలాల్లో తహసీల్దార్లు ఉత్తర్వులు చూపి సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులను కలిస్తే తమకేం తెలియదని తప్పించుకుంటున్నారని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉత్తర్వులను సవరించాలని కోరుతున్నారు.

జీవోను వెంటనే సవరించాలి

ప్రభుత్వం జారీ చేసిన జీవో-3లో కేవలం షేక్‌ వర్గాన్ని చేర్చి మహ్మద్‌ వర్గాన్ని విస్మరించడంతో ముస్లింలకు బీసీ-ఈ సర్టిఫికెట్లు ఇవ్వడంలేదని ముస్లిం మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్‌పాషా ఆరోపించారు. ముస్లింలు బీసీ సర్టిఫికెట్లు పొందేందుకు అనర్హులా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేసిన తప్పిదంతో సంక్షేమ పథకాల వర్తింపుతోపాటు విద్య, ఉద్యోగాల్లో తీరని అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు ఇప్పటికే పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉత్తర్వుల్లో పొరపాటును సరిదిద్దాలని కోరారు.

– ముస్లిం మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాకూబ్‌పాషా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana