- కాలం ఏదైనా గొంతెండని భాగ్యనగరం
- విశ్వనగరానికి శాశ్వత జలధారలు
- తొమ్మిదిన్నరేండ్లలో 9 ప్రధాన ప్రాజెక్టులు
- 340 ఎంజీడీల నుంచి 555 ఎంజీడీల సరఫరాకు పెంపు
- నీటి కష్టాలు లేకుండా భారీ రిజర్వాయర్లు
- వందేండ్లకు భరోసానిచ్చే కేశవాపూర్ రిజర్వాయర్
- కృష్ణా జలాల తరలింపు శాశ్వత ప్రాజెక్టుగా సుంకిశాల
- ఓఆర్ఆర్ కాలనీ, గేటెడ్ కమ్యూనిటీలకు పుష్కలంగా నీరు
- పేదలకు ఉచితంగా రూ.920 కోట్ల విలువైన జలాలు
సిటీబ్యూరో, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) ; ఉమ్మడి పాలనలో గుక్కెడు నీటి కోసం అల్లాడిన భాగ్యనగరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం జలసిరులు పారించింది. మహానగరానికి తాగునీటి సరఫరా కోసం వేల కోట్ల రూపాయలు వెచ్చించి.. తాగునీటి పథకాలు రూపొందించి.. నగర తాగునీటి కష్టాలను శాశ్వతంగా తీర్చింది. కాలం ఏదైనా.. నేడు తాగు నీటి సరఫరా నిరంతరాయంగా కొనసాగుతున్నది. 'కేశవాపూర్’ రిజర్వాయర్ వందేండ్లకు తాగునీటి భరోసా ఇవ్వనున్నది.

ఉమ్మడి పాలనలో గుక్కెడు నీటి కోసం భాగ్యనగర వాసులు అల్లాడిపోయేవారు. ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఖైరతాబాద్ జలమండలి కేంద్ర కార్యాలయం ముందు ఖాళీ బిందెలు..కుండలతో నిరసన ప్రదర్శనలు జరిగేవి. జలమండలి కార్యాలయాన్ని వేదికగా చేసుకొని వివిధ పార్టీలు వంతుల వారీగా ధర్నాలు చేసేవి. నీటి సమస్యను పరిష్కరించలేక.. అప్పటి పాలకులు చేతులెత్తేయడంతో చాలీచాలని నీటితో ప్రజలు కాలం నెట్టుకొచ్చేవారు.
ఒక్కరోజు నీటి సరఫరా నిలిచిపోయినా.. హైదరాబాద్ గొంతు ఎండటం తప్ప..ప్రత్యామ్నాయం లేకుండాపోయేది. ఇలా ఉమ్మడి పాలనలో నగరవాసుల తాగునీటి కష్టాలు వర్ణణాతీతం. కానీ.. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించింది. భవిష్యత్‌లోనూ నీటి ఇబ్బందులు తలెత్తకుండా భాగ్యనగరంలో జలసిరులు పారించింది. మహానగరానికి మంచినీటి సరఫరా కోసం వేల కోట్ల రూపాయలు వెచ్చించి.. తాగునీటి పథకాలు రూపొందించి.. నగర నీటి కష్టాలను శాశ్వతంగా తీర్చింది. కాలం ఏదైనా.. నేడు మంచి నీటి సరఫరా నిరంతరాయంగా కొనసాగుతున్నది.
ఉచితంగా 20 వేల లీటర్లు..
జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలకు వరం లాంటి ఉచితంగా 20 వేల లీటర్ల మంచినీటి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2020 డిసెంబర్లో ప్రకటించింది. 2021 జనవరి 12న మంత్రి కేటీఆర్ బోరబండలోని ఎస్పీఆర్హిల్స్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. గృహ కనెక్షన్లు కలిగిన వినియోగదారులకు నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా నీటిని అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం కింద 50 లక్షల మంది వరకు 20 కేఎల్ ఉచిత తాగునీటి పథకానికి దరఖాస్తు చేసుకోగా, ప్రస్తుతం 11.10 లక్షల మంది కుటుంబాలకు లబ్ధి జరుగుతున్నది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 920 కోట్ల విలువైన నీటిని పేదలకు ఉచితంగా అందజేసింది.

ముందుచూపుతో ప్రణాళికలు
తాగునీటి ప్రాజెక్టులు నిర్మించడమే కాదు… తరలించిన నీటిని సమర్థవంతంగా సరఫరా చేయడమనేది ముఖ్యం. తెలంగాణ ప్రభుత్వం చేసింది అదే. సీఎం కేసీఆర్ ముందుచూపు, ప్రణాళికలు ఇప్పుడు హైదరాబాద్ నగరానికి పుష్కలమైన తాగునీటిని అందిస్తున్నాయి. మొన్నటిదాకా రోజుకు 340 మిలియన్ గ్యాలన్లుగా ఉన్న నగర నీటి సరఫరా సామర్థ్యాన్ని ప్రస్తుతం రోజుకు 555 మిలియన్ గ్యాలన్లకు పెంచారు.
అంతేకాదు… విశ్వ నగరమైన హైదరాబాద్‌కు భవిష్యత్‌లోనూ ఒక్కరోజు కూడా తాగునీటి సమస్య రాకుండా ఉండేందుకు కేశవాపూర్‌లో గోదావరి జలాల భారీ నిల్వ సామర్థ్యంతో డెడికేటెడ్ రిజర్వాయర్‌ను కూడా నిర్మిస్తున్నారు. పైగా కృష్ణాజలాల సరఫరాలోనూ సుంకిశాల పథకంతో వర్షాభావ పరిస్థితుల్లోనూ ఇబ్బందులు రాకుండా ముందుచూపు ప్రదర్శించారు. వెరసి… ఖాళీ బిందెల ప్రదర్శనలు పోయి.. ఉచితంగా నెలకు 20వేల లీటర్ల సురక్షిత జలాలను అందుకునే స్థాయికి నగరవాసి చేరుకున్నాడు.

కొత్త రిజర్వాయర్ల నిర్మాణం..
ప్రపంచ వ్యాప్తంగా మహానగరాలు మంచినీటి కటకటను ఎదురొంటున్నాయి. రైళ్లలో నీటిని తరలించి మహానగరాల్లో నివసిస్తున్న ప్రజలకు సరఫరా చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కానీ, మన హైదరాబాద్ నగరంలో మాత్రం మంచినీటి సమస్యలే లేకుండా చేయడంలో జలమండలి విజయవంతమైంది. ఇప్పటి అవసరాలను తీర్చడంలో సఫలీకృతమైన జలమండలి.. భవిష్యత్‌లో పెరగనున్న జనాభాకు తగ్గట్లుగా ఏర్పడబోయే నీటి అవసరాలను నెరవేర్చేందుకు సిద్ధమవుతున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు ఔటర్ రింగ్ రోడ్డు వరకు మంచినీటి సరఫరా బాధ్యతను తీసుకున్న జలమండలి.. రోజు విడిచి రోజు నీటిని అందిస్తున్నది. ఓఆర్ఆర్ పరిధి వరకు ఎకడా తాగునీటి సరఫరాకు సమస్యలు రాకుండా అవసరమైన చోట్ల జలమండలి కొత్త రిజర్వాయర్లను నిర్మించడంతో పాటు పైప్‌లైన్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నది. రూ.1,450 కోట్లతో నాగార్జున సాగర్ వద్ద నిర్మించనున్న సుంకిశాల ఇంటెక్వెల్ ద్వారా హైదరాబాద్ అర్బన్ అగ్లోమేరేషన్(హెచ్‌యూఏ) ప్రాంతంలో తాగునీటికి భరోసా దకనున్నది.

స్వరాష్ట్రంలో సాధించిన లక్ష్యాలివి..
- 2015 నవంబర్‌లో కృష్ణా మూడో దశ ద్వారా 90 ఎంజీడీలు, 2015 డిసెంబర్లో గోదావరి ఫేజ్-1లో భాగంగా రోజూ 172 ఎంజీడీల్లో తొలి విడతగా 86 ఎంజీడీలు , ఆ తర్వాత మరో 86 ఎంజీడీలను నగరానికి తరలించి తాగునీటి కష్టాలకు చెక్ పెట్టారు.
- 2014 నవంబర్ 2న మల్కాజ్గిరి నియోజకవర్గంలో రూ.338.54 కోట్లతో చేపట్టిన తాగునీటి పథకం ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొచ్చారు. నియోజకవర్గంలో 3.80 లక్షల మంది కుటుంబాలకు మేలు జరిగింది. రోజు విడిచి రోజూ నీటి సరఫరా జరుగుతున్నది.
- ఐటీ కారిడార్‌కు నీటి లభ్యతను పెంచుతూ.. మెదక్ జిల్లా ఘన్పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి పటాన్చెరు వరకు రూ.422.80 కోట్లతో 45 కిలోమీటర్ల మేర 1800 ఎంఎం సామర్థ్యం కలిగిన పైపులైన్ పనులను పూర్తి చేసి..ఐటీ కారిడార్‌లో నీటి లభ్యతను పెంచారు.
- దారిద్య్రరేఖకు దిగువనున్న మధ్య తరగతి వాసులకు సౌకర్యార్థం రూపాయికే నల్లా కనెక్షన్ తీసుకొచ్చి లక్ష మంది బీపీఎల్ కుటుంబాలకు నల్లా కనెక్షన్ ఇచ్చారు.
- రూ. 1900 కోట్లతో శివారు మున్సిపాలిటీల్లో చేపట్టిన తాగునీటి పథకం పనులను కేవలం ఏడాదిలోనే పూర్తి చేసి సమృద్ధిగా నీటి సరఫరాకు శ్రీకారం చుట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. దాదాపు 279 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో 56 సర్వీసు రిజర్వాయర్ల నిర్మాణ పనులు, 2200 కిలోమీటర్ల పైపులైన్ డిస్ట్రిబ్యూషన్ పైపులైన్ విస్తరణ పనులను విజయవంతంగా పూర్తి చేసి.. సుమారు 40 లక్షల మంది ప్రజల దాహార్తిని తీర్చింది. 2015లో ఈ పథకం శ్రీకారం చుట్టి..2019 నవంబర్ నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చింది.
- 100 శాతం మురుగునీటి శుద్ధి లక్ష్యంగా మూసీ పరివాహాక ప్రాంతం, కూకట్పల్లి నాలా వెంబడి 31 చోట్ల ఎస్టీపీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.3866.21 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు చేపడుతున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల అందుబాటులోకి రాగా…డిసెంబర్ నెలాఖరు నాటికల్లా ఈ పథకం పూర్తి చేయడం ద్వారా దేశంలోనే వందకు వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్ నిలువనున్నది.
- ఓఆర్ఆర్ లోపల కాలనీలకు మెరుగైన నీటి సరఫరా లక్ష్యంగా రూ. 1200 కోట్లతో తాగునీటి పథకం పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విస్తరిత కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు సమృద్ధిగా నీరందించే లక్ష్యంతో భారీ రిజర్వాయర్లు, పైపులైన్ల నిర్మాణం చేపట్టి ఇప్పటికే 60 కాలనీలకు పైగా సమృద్ధిగా నీరందిస్తున్నది. త్వరలోనే ఈ ఓఆర్ఆర్ ఫేజ్-2 పథకం పూర్తి ఫలాలు అందనున్నాయి.
ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న 190 గ్రామాల్లోని ప్రజల నీటి కష్టాలను తీర్చే లక్ష్యంలో భాగంగా అర్బన్ మిషన్ భగీరథలో రూ.756.41కోట్లతో తాగునీటి పథకాన్ని చేపట్టారు. బోర్ నీటిపైన ఆధారపడిన 58 గ్రామాలను గుర్తించి.. వీటికి తొలి ప్రాధాన్యతలో పనులను పూర్తి చేసి ఈ గ్రామాలకు ఇంటింటికీ నల్లా ద్వారా నీటి సరఫరా అందించారు. 2019 జూలై నాటికి ఈ పథకం పూర్తి చేసి 190 గ్రామాలకు సమృద్ధిగా నీటిని అందిస్తున్నారు.


