Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నకిలీ కరెన్సీ తయారీ ముఠా అరెస్టు

నకిలీ కరెన్సీ తయారీ ముఠా అరెస్టు

  • రూ.2.91 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం

బండ్లగూడ, సెప్టెంబర్‌ 2 : యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు చూసి నకిలీ కరెన్సీ నోట్లు తయారు చేస్తున్న ఓ ముఠాను శంషాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌, బాలాపూర్‌ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు.

ముగ్గురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్టు రాజేంద్రనగర్‌ అదనపు డీసీపీ శ్రీనివాస్‌రావు విలేకరులకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. వదిపట్ల చింతల్‌తండాకు చెందిన రమావత్‌ రాము అలియాస్‌ మహ్మద్‌ సులభంగా డబ్బు సంపాదించాలన్న అత్యాశతో అక్రమ మార్గాలను ఎంచుకున్నాడు. తన బంధువు రమావత్‌ మోతీలాల్‌ సహాయంతో యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలను చూసి నకిలీ నోట్లను తయారు చేశాడు. అనంతరం ఆ నోట్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు రాము తన మేనల్లుడైన రమావత్‌ గాంధీని రంగంలోకి దింపాడు.

మద్యం దుకాణాలు, కూరగాయల మార్కెట్‌లో ఆ నోట్లను చలామణిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో శంషాబాద్‌ టాస్క్‌ ఇన్‌స్పెక్టర్‌ కృష్ణమోహన్‌, బాలాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ తమ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన రమావత్‌ రాము, రమావత్‌ మోతీలాల్‌, రమావత్‌ గాంధీని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో నకిలీ నోట్ల తయారీ గుట్టు రట్టయింది. దీంతో ఆ ముగ్గురిని అరెస్టు చేసి రూ.2.91 లక్షల విలువైన నకిలీ నోట్లు, వాటి తయారీకి ఉపయోగించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నామని, సుధీర్‌ జాన్‌చెలా అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడని అడిషనల్‌ డీసీపీ శ్రీనివాస్‌రావు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana