Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Nepal | నేపాల్‌లో జలప్రళయం.. 1600మందికి పైగా గల్లంతు 362కి చేరిన మృతుల సంఖ్య..!

Nepal | నేపాల్‌లో జలప్రళయం.. 1600మందికి పైగా గల్లంతు 362కి చేరిన మృతుల సంఖ్య..!

Nepal | నేపాల్‌లో బుధవారం సంభవించిన జల ప్రళయం తీరని విషాదాన్ని నింపింది. తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. ఈ మెరుపు వరదల్లో మృతుల సంఖ్య 362కు చేరుకోగా, 1,600 మందికి పైగా గల్లంతయ్యారు.

ప్రభావిత ప్రాంతాల్లో గురువారం ఎక్కడ చూసినా వరద, బురదే కనిపించాయి. గల్లంతైన వారిలో, 290మంది భారతీయులున్నారు. మరోవైపు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. నేపాల్‌లో ఒక భారీ హిమనీ నదం ముక్క విరిగి కింద ఉన్న నదీ లోయలో కూలిపోవడం వల్ల ఈ వరదలు సంభవించి ఉండవచ్చునని నిపుణులు భావిస్తున్నారు.

ఖాట్మాండ్‌, ఆగస్టు 27: హిమాలయ దేశం నేపాల్‌లో బుధవారం సంభవించిన జలప్రళయం పెను విషాదాన్ని నింపింది. తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. ఈ మెరుపు వరదల్లో మృతుల సంఖ్య 362కు చేరుకోగా, 1,600 మందికి పైగా గల్లంతయ్యారు. ప్రభావిత ప్రాంతాల్లో గురువారం ఎక్కడ చూసినా వరద నీరు, పెద్దయెత్తున పేరుకుపోయిన బురద కన్పించింది. నేపాల్‌లో 826 మంది గల్లంతు కాగా, అందులో 290 మంది భారతీయులున్నారు. గల్లంతైన వారిలో 332 మంది మరణించినట్టు అధికారులు గురువారం ప్రకటించారు. వారిలో 30 దేశాలకు చెందిన పౌరులు ఉన్నారు. కాగా, ఇదే వరదలకు టిబెట్‌లో ముగ్గురు మరణించగా, 558 మంది గల్లంతైనట్టు చైనా సీసీటీవీ వెల్లడించింది. వరదలకు వందలాది ఇండ్లు ధ్వంసమయ్యాయి. వంతెనలు, పలు ప్రాజెక్టులు కూడా నాశనమయ్యాయి. నువాకోట్‌, రసువా జిల్లాల్లో తీవ్ర నష్టం ఏర్పడింది.

డజన్ల వంతెనలు పాడైపోయాయని, 40 కి.మీ మేర రోడ్లు ధ్వంసం అయ్యాయని అధికారులు తెలిపారు. పలు గ్రామాల్లోని నిరాశ్రయులను సురక్షిత ప్రాంతాలకు, శిబిరాలకు తరలిస్తున్నారు. నేపాల్‌లోని రసువా జిల్లా దిగువ ప్రాంతాల్లో వరద విధ్వంసమే సృష్టించింది. త్రిశూలి నది నుంచి పోటెత్తిన వరద నీరు, వ్యర్ధాలు ఇండ్లు, రోడ్లు, వంతెనలు, హైడ్రోపవర్‌ ప్రాజెక్టును ముంచెత్తాయి. తిమురే, త్రిశూలి బజార్‌, భెట్రాపతి ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బలమైన నీటి ప్రవాహానికి ఒక హెలిప్యాడ్‌ కూడా కొట్టుకుపోవడంతో సహాయక చర్యలకు ఇబ్బంది ఏర్పడింది. కాగా, చైనాలోని గిరోంగ్‌ పట్టణంలో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించగా, పోర్టు ప్రాంతం మాత్రం ఇంకా అంధకారంలోనే ఉంది. వరద ప్రభావ ప్రాంతాల్లో గాలింపు, సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ధాడింగ్‌, గోర్ఖా, నువాకోట్‌, తనహూన్‌, రసువా, పశ్చిమ నవల్పరాసి ప్రాంతాల నుంచి కూడా ప్రాణనష్టం నమోదైంది.

వరదలు హిమానీనదం వల్లే

నేపాల్‌ హిమాలయ ప్రాంతాన్ని బుధవారం అతలాకుతలం చేసిన ప్రాణాంతక మెరుపు వరదలు, ఎత్తయిన పర్వతాలలో ఒక భారీ హిమానీనదం ముక్కవిరిగి కింద ఉన్న నదీలోయలో కూలిపోవడం వల్ల సంభవించి ఉండవచ్చునని నిపుణులు భావిస్తున్నారు. న్యూయార్క్‌ టైమ్స్‌ ఉటంకించిన భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు, హిమానీనద శాస్త్రవేత్తల ప్రాథమిక విశ్లేషణ ప్రకారం ఈ ఘటన ఒక హిమసంపాతం (ఐస్‌ అవలాంచ్‌) అని తెలుస్తున్నది. చిత్రాలను అధ్యయనం చేసిన కాల్గరీ విశ్వవిద్యాలయంలోని భూ విజ్ఞాన శాస్త్రవేత్త డేనియల్‌ షుగర్‌ ప్రకారం ఉపగ్రహ చిత్రాలు దాదాపు రెండు వేల అడుగుల వెడల్పు గల ఒక హిమానీనదంలోని ఒక భాగం విరిగి సుమారు 17 వేల అడుగుల ఎత్తు నుంచి పడిపోయినట్టు సూచిస్తున్నాయి.

28 మంది భారతీయులు సేఫ్‌

నేపాల్‌ వరదల్లో గల్లంతైన 21 మందిని రక్షించినట్టు భారత ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఇంకా 290 మంది ఆచూకీ తెలియడం లేదని తెలిపింది. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రక్షించిన 21 మంది కూడా తమిళనాడుకు చెందిన వారని, వారిని భారత్‌ రప్పిస్తున్నట్టు తెలిపారు. చైనా వైపున ఉన్న సరిహద్దు ప్రాంతమైన టిబెట్‌లో కూడా చాలామంది భారతీయులు చిక్కుకుపోయారని, 200 మందికి పైగా సహాయం కోరుతున్నారని, వారిలో 95 మంది ప్రస్తుతం టిబెట్‌లోని దార్చెన్‌లో ఉన్నారన్నారు.

వరద ప్రాంతాల్లో నేపాల్‌ ప్రధాని పర్యటన

వరదకు గురైన నువాకోట్‌ జిల్లాలో నేపాల్‌ ప్రధాని బాలేందర్‌ షా గురువారం పర్యటించి నష్టాన్ని ప్రత్యక్షంగా చూశారు. అధికారులు, నేతలతో సమావేశమై చేపట్టాల్సిన సహాయ చర్యల గురించి చర్చించారు. భారత్‌ పంపిన సహాయ సామగ్రిని తీవ్రంగా వరద ప్రమాదానికి గురైన ప్రాంత వాసుల కోసం హెలికాప్టర్ల ద్వారా విడిచి పంపిణీ చేస్తున్నట్టు నేపాల్‌ సైనిక ప్రతినిధి రాజారామ్‌ బసెంట్‌ తెలిపారు.

జగ్గీ వాసుదేవ్‌ కన్నీటి పర్యంతం

కైలాస యాత్రకు వెళ్లిన భారత్‌కు చెందిన ఈశా ఫౌండేషన్‌ సభ్యులు కనీసం 80 మంది నేపాల్‌ వరదల్లో గల్లంతయ్యారు. జరిగిన విపత్తు పట్ల ఈశా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్‌ కండ్ల నీళ్లు పెట్టుకున్నారు.

కట్టు బట్టలతో మిగిలాం

త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని కేవలం కట్టుబట్టలతో మిగిలామని వరద ప్రమాదం నుంచి బయటపడ్డ నేపాల్‌లోని విదుర్‌ గ్రామానికి చెందిన దీపికా (పేరు మార్చారు) తెలిపారు. 'బుధవారం ఉదయం ఆరుబయట ఉన్న అరుగుపై గిన్నెలు తోముతుండగా, మెల్లిగా వరద నీరు రావడం గమనించాను. గట్టిగా అరచి కుటుంబ సభ్యులందరినీ అప్రమత్తం చేసి వారిని టెర్రస్‌పైకి తీసుకువెళ్లా. కొన్ని నిముషాల్లోనే భారీగా బురదతో నిండిన వరద మేమున్న ఇంటి కింది భాగాన్ని ముంచేసింది.' అని ఆమె పేర్కొన్నది.

పొంచి ఉన్న మరో ముప్పు

నేపాల్‌లోని ఛోచెస్‌ ఖోలా, పురేపు సాంగ్‌సో నదుల సంగమ ప్రాంతం వద్ద ఏర్పడిన ఒక అవరోధ సరస్సు రాబోయే మూడు రోజుల్లో తెగిపోయే ప్రమాదం ఉందని చైనా అధికారులను ఉటంకిస్తూ గ్లోబల్‌ టైమ్స్‌ గురువారం నివేదించింది. ఇప్పటికే ఈ సరస్సు ఉదయానికి 2 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నీటితో ఇప్పటికే నిండి పొర్లుతున్నదని చైనా జల వనరుల శాఖ వెల్లడించింది.

డీఆర్‌డీవో మాజీ ఛైర్మన్‌దంపతులు సురక్షితం

హైదరాబాద్‌/సిటీబ్యూరో, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): నేపాల్‌ విపత్తులో చిక్కుకున్న డీఆర్‌డీఓ మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ సతీష్‌ రెడ్డి, ఆయన భార్యతో పాటు సురక్షితంగా ఉన్నారని తెలిసింది. కాగా, మానససరోవర్‌ యాత్రకు వెళ్లిన ఎల్బీనగర్‌ ప్రాంతానికి చెందిన కందిమళ్ల సుహాసిని రెడ్డి ఆచూకీ తెలియరాలేదని తండ్రి మహేందర్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

తెలంగాణవాళ్లు 22 మంది మిస్సింగ్‌!

న్యూఢిల్లీ, ఆగస్టు 27: నేపాల్‌ వరదల కారణంగా తెలంగాణకు చెందిన 22 మంది ఆచూకీ తెలియకుండా పోయిందని అధికార వర్గాలు గురువారం తెలిపాయి. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటుచేసిన హెల్ప్‌లైన్‌కు అందిన సమాచారం ప్రకారం, బాధిత కుటుంబాలు, ఇతరుల నుండి 80 నుండి 100 ఫోన్‌కాల్స్‌ వచ్చాయి. ఆచూకి గల్లంతైన 22 మందిలో 20 కేసులను అధికారులు గుర్తించారు. వీరిలో ఆరుగురు తెలంగాణకు చెందినవారు కాగా, మరో 17 మంది తెలంగాణ మూలాలున్న ప్రవాస భారతీయులని తెలిసింది. వారి ఆచూకీ కనుగొనేందుకు చర్యలు చేపట్టినట్టు తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రకటనలోతెలిపింది.

చైనాకు తెలిసినా అప్రమత్తం చేయలేదు

వరదలపై చైనాకు తెలిసినా సమాచారం అందించలేదని, దీని కారణంగానే తమకు తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందని నేపాల్‌ ఆరోపించింది. నేపాల్‌లో ఉదయం 8.15 గంటలకు టిబెట్‌లోని కెరుంగీ కౌంటీలో మెరుపు వరదలు సంభవించాయి. ఇది జరిగిన 45 నిమిషాల తర్వాత నేపాల్‌కు వరద గురించిన విషయం తెలిసింది. వరదలపై మధ్యాహ్నం ఒంటిగంటకు చైనా నుంచి నేపాల్‌కు సమాచారం అందింది. అయితే ఈ వరదలకు చైనాను బాధ్యులను చేయలేమని, హెచ్చరిక వ్యవస్థల గురించి ఇరు దేశాల మధ్య ఒప్పందం ఏదీ లేదని నిపుణులు తెలిపారు. కాగా నేపాల్‌ బాధితులను ఆదుకోవడానికి నటుడు సోనూసూద్‌ ముందుకు వచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana