తాజావార్తలు
నేటి నుంచి నేత కార్మికులకు శిక్షణ

- ఏర్పాట్లు చేసిన చేనేత జౌళిశాఖ
- అధునాతన ఫ్రేమ్ మగ్గాల ద్వారా ఉత్పత్తి
పోచమ్మమైదాన్, జనవరి 21 : జిల్లాలో శుక్రవారం నుంచి నేత కార్మికులకు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రస్తుతం తయారు చేస్తున్న జంపఖానలు, బెడ్‌షీట్లతోపాటు అధునాతన డిజైన్లలో ఉత్పత్తికి అవసరమైన నైపుణ్యాలను పెం పొందించనున్నారు. ముఖ్యంగా మార్కెట్‌లో డిమాండ్ ఉన్న షూటింగ్, షర్టింగ్, తాన్ బట్టల తయారీలో తగిన తర్ఫీదు ఇస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పలు చేనేత సహకార సంఘాలకు నూతన ఫ్రేమ్ మగ్గాలను పంపించింది. దీంతో చేనేత జౌళిశాఖ సిబ్బంది ఆయా సంఘాల్లో మగ్గాలను అమర్చింది. సాంకేతిక సమస్యలు రాకుండా ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో చేనేత కార్మికులకు నేరుగా శిక్షణ ఇవ్వడానికి మాస్టర్లు సిద్ధమయ్యారు. గ్రేటర్ వరంగల్‌లో ఉప్పు మల్లయ్య తోట, ఎల్‌బీ నగర్ చేనేత సహకార సంఘాలకు సంబంధించిన 20 మంది నేత కార్మికులకు దేశాయిపేటలోని వీవర్స్ కాలనీలో శిక్షణ ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. అలాగే, కమలాపూర్ మండలంలోని వెంకటేశ్వరపల్లిలో కూడా 20 మంది కార్మికులకు శిక్షణ ఇవ్వనున్నారు. కాగా, ఇప్పటికే ఎల్కతుర్తి మండలం సూరారంలోని చేనేత సహకార సంఘంలో 20 మందికి షూటింగ్, షర్టింగ్, తాన్ బట్టల తయారీలో శిక్షణ ప్రారంభించినట్లు సమాచారం.