Padma Awards 2026| న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పద్మ అవార్డులు- 2026ను ప్రకటించిన విషయం తెలిసిందే.
వివిధ రంగాల్లో విశేష సేవలందించే వారికి ఇచ్చే పద్మ పురస్కారాల వేడుక రాష్ట్రపతి భవన్‌లో జరుగుతోంది.
గత నెల 25న 66 మంది ప్రముఖులకు రాష్ట్రపతి అవార్డులను అందజేయగా.. ఇవాళ 47 మందికి అవార్డులు ప్రదానం చేస్తున్నారు. సినీ రంగం నుంచి ప్రముఖ తెలుగు నటులు రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. మలయాళ స్టార్ యాక్టర్ మమ్ముట్టికి పద్మభూషణ్, తమిళ నటుడు ఆర్ మాధవన్‌లకు పద్మశ్రీ పురస్కారాన్ని రాష్ట్రపతి అందజేశారు.
తెలంగాణ నుంచి ఏడుగురు..
తెలంగాణ నుంచి ఏడుగురికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. వీరిలో గడ్డమనుగు చంద్రమౌళి (సైన్స్), దీపికా రెడ్డి (నృత్యకారిణి), గూడూరు వెంకట్రావు (వైద్యం), కృష్ణమూర్తి బాల సుబ్రహ్మణియన్ (సైన్స్, ఇంజినీరింగ్), కుమారస్వామి తంగరాజ్ (సైన్స్, ఇంజినీరింగ్), పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి (వైద్యం), రామారెడ్డి మామిడి (మరణానంతరం) (పశు సంవర్ధక, పాడి పరిశ్రమ) ఉన్నారు. యూజీసీ మాజీ చైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్‌కు ఢిల్లీ కోటాలో పద్మశ్రీ వరించింది. ఏపీ నుంచి నటుడు గద్దె బాబూ రాజేంద్రప్రసాద్ (కళలు), మాగంటి మురళీ మోహన్ (కళలు), గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (కళలు), వెంపటి కుటుంబ శాస్త్రి (సాహిత్యం)కి పద్మశ్రీ ప్రకటించారు.

